PC: X/PCB
పాకిస్తాన్ వెటరన్ బ్యాటర్ మహ్మద్ రిజ్వాన్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. దేశీ రెడ్‌బాల్ టోర్నీలో డబుల్ సెంచరీతో చెలరేగాడు. కాగా గత కొన్నాళ్లుగా పాకిస్తాన్ క్రికెట్ బోర్డు (PCB)తో రిజ్వాన్‌కు విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే.
తీవ్రమైన ఆరోపణలు
ఇంగ్లండ్ పర్యటనలో భాగంగా టెస్టు సిరీస్ నుంచి రిజ్వాన్ సహా ఏడుగురు ఆటగాళ్లను పీసీబీ.. అకస్మాత్తుగా స్వదేశానికి పిలిపించింది. అంతేకాదు రిజ్వాన్ ఆన్‌లైన్ బెట్టింగ్, గాంబ్లింగ్‌కు పాల్పడ్డాడనే ఆరోపణలు వచ్చాయి.
ఈ నేపథ్యంలో పాకిస్తాన్ జాతీయ సైబర్ నేర విచారణ సంస్థ రిజ్వాన్ ఫోన్‌ను స్వాధీనం చేసుకుని.. అతడిని విచారించింది. దీంతో రిజ్వాన్ కెరీర్ ఇక ముగిసినట్లేనని అంతా భావించారు. అయితే, ఈ వికెట్ కీపర్ బ్యాటర్ మాత్రం తిరిగి ఆటపై దృష్టి పెట్టాడు.
తొలిరోజు 111 పరుగులతో అజేయంగా
క్వైడ్-ఎ-ఆజం ట్రోఫీ గోల్డ్ తాజా సీజన్ మంగళవారం మొదలుకాగా.. అబోటాబాద్‌లో రిజ్వాన్ పెషావర్ రీజియన్ బ్లూస్ తరఫున రంగంలోకి దిగాడు. ఫైసలాబాద్ రీజియన్ జట్టు బౌలర్లపై ఆది నుంచే విరుచుకుపడ్డ రిజ్వాన్.. తొలి రోజు ఆటలో 21 బౌండరీల సాయంతో 142 బంతుల్లోనే 111 పరుగులతో అజేయంగా నిలిచాడు.
రెండో రోజు డబుల్ సెంచరీ పూర్తి
రెండో రోజు ఆటలో భాగంగా 34 ఏళ్ల రిజ్వాన్.. ఓవరాల్‌గా 391 బంతుల్లో డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. రిజ్వాన్‌కు తోడు నజాబ్ ఖాన్ సెంచరీతో రాణించగా.. పెషావర్ జట్టు బుధవారం నాటి ఆట ముగిసేసరికి కేవలం నాలుగు వికెట్ల నష్టానికి ఏకంగా 503 పరుగులు చేసి పటిష్ట స్థితిలో నిలిచింది.
ఇవీ చదవండి: రోహిత్ భాయ్ వల్లే ఇలా!.. అతడు అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు: గిల్
అదే మా కొంపముంచింది.. వారికి క్రెడిట్ ఇవ్వాల్సిందే: న్యూజిలాండ్ కెప్టెన్


