అదే మా కొంపముం‍చింది.. వారికి క్రెడిట్‌ ఇవ్వాల్సిందే: న్యూజిలాండ్‌ కెప్టెన్‌ | Mitchell Santner Reacts After India Outclasses Kiwis in 1st ODI | Sakshi
Sakshi News home page

అదే మా కొంపముం‍చింది.. వారికి క్రెడిట్‌ ఇవ్వాల్సిందే: న్యూజిలాండ్‌ కెప్టెన్‌

Nov 4 2026 4:40 PM | Updated on Nov 4 2026 4:40 PM

Mitchell Santner Reacts After India Outclasses Kiwis in 1st ODI

సొంతగడ్డపై టీమిండియాతో ఐదు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌ను న్యూజిలాండ్ ఓటమితో ఆరంభించింది. ఆక్లాండ్ వేదికగా జరిగిన తొలి వన్డేలో 5 వికెట్ల తేడాతో కివీస్ ఓటమిపాలైంది. ఈ మ్యాచ్‌లో బ్లాక్ క్యాప్స్ బ్యాటర్లు ఘోరంగా విఫలమయ్యారు.

టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన న్యూజిలాండ్.. భారత బౌలర్ల ధాటికి 40.2 ఓవర్లలో 185 పరుగులకే కుప్పకూలింది. కివీస్ బ్యాటర్లలో టిమ్ సీఫెర్ట్ (38), బ్లెయిర్ టిక్నర్ (34) టాప్ స్కోరర్లుగా నిలిచారు. భారత బౌలర్లలో అర్ష్‌దీప్ సింగ్ నాలుగు, గుర్నూర్ బ్రార్ మూడు, అన్షుల్ కాంబోజ్ రెండు వికెట్లు సాధించారు.

అనంతరం పదేపదే వర్షం అంతరాయం కలిగించడంతో భారత్ లక్ష్యాన్ని రివైజ్ చేసి, 32 ఓవర్లలో 143 పరుగులుగా నిర్ణయించారు. ఈ లక్ష్యాన్ని టీమిండియా 22.4 ఓవర్లలో ఛేదించింది. భారత బ్యాటర్లలో విరాట్ కోహ్లి (74) టాప్ స్కోరర్‌గా నిలవగా.. కెప్టెన్ శుబ్‌మన్ గిల్ (37) రాణించారు. ఈ ఓటమిపై మ్యాచ్ అనంతరం కివీస్ కెప్టెన్ మిచెల్ శాంట్నర్ స్పందించాడు. బ్యాటింగ్ వైఫల్యం కారణంగానే తాము ఓడిపోయామని శాంట్నర్ అంగీకరించాడు.

"ఈడెన్ పార్క్‌లో పిచ్ ఇంతటి అదనపు బౌన్స్‌ను ఇస్తుందని మేము అసలు ఊహించలేదు. పిచ్ పరిస్థితులను త్వరగా అడాప్ట్ చేసుకోవడంలో మేము విఫలమయ్యాం. దానికి తోడు భారత బౌలర్లు పిచ్ కండిషన్స్‌ను ఉపయోగించుకుని అద్భుతంగా బౌలింగ్ చేశారు. కచ్చితంగా భారత బౌలర్లకు క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఇలాంటి ట్రిక్కీ పిచ్‌పై ఎక్స్‌ట్రా బౌన్స్‌ను ఎదుర్కొని ఆడటం చాలా కష్టం.

భారత బౌలర్లు పదే పదే షార్ట్ బాల్స్ వేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టారు. రెండో ఇన్నింగ్స్‌లో శ్రేయస్ అయ్యర్ కూడా షార్ట్ బాల్స్ ఆడేందుకు ఇబ్బంది పడ్డాడు. ఆ బాల్స్‌ను అతడు వికెట్ కీపర్ పైనుంచి ఆడేందుకు ప్రయత్నించాడు. అయితే వర్షం పడిన తర్వాత పిచ్ బ్యాటింగ్‌కు మరింత అనుకూలించింది. బంతి నేరుగా బ్యాట్‌పైకి వచ్చింది.

విరాట్, శుబ్‌మన్ ఆడుతున్నప్పుడు మ్యాచ్ వేగంగా పూర్తి అవుతుందని అనుకున్నాను. కానీ మా ఫాస్ట్ బౌలర్లు అద్భుతంగా పోరాడారు. వరుస క్రమంలో ప్రత్యర్థి జట్టు వికెట్లు పడగొట్టారు. ఈ మ్యాచ్‌లో ఓడిపోయినప్పటికీ మాకు కొన్ని సానుకూల అంశాలు ఉన్నాయి. వెల్లింగ్టన్‌లో జరిగే తదుపరి మ్యాచ్‌లో గెలిచి తిరిగి కమ్‌బ్యాక్ ఇస్తాం" అని శాంట్నర్ పోస్ట్ మ్యాచ్ ప్రెజెంటేషన్‌లో పేర్కొన్నాడు.
చదవండి: కోహ్లి మెరుపులు.. తొలి వన్డేలో కివీస్‌ను చిత్తు చేసిన టీమిండియా
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement