విరాట్ కోహ్లి (Photo Credit: BCCI X)
న్యూజిలాండ్‌తో వన్డే సిరీస్‌ను టీమిండియా ఘనంగా ఆరంభించింది. ఆక్లాండ్ వేదికగా బుధవారం జరిగిన తొలి వన్డేలో కివీస్‌పై ఐదు వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా ఐదు మ్యాచ్‌ల సిరీస్‌లో 1-0తో ముందంజ వేసింది.
185 పరుగులకే ఆలౌట్
ఈడెన్ పార్క్ మైదానంలో టాస్ గెలిచిన భారత్ తొలుత బౌలింగ్ ఎంచుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్‌కు దిగిన కివీస్ బ్యాటర్లకు భారత బౌలర్లు చుక్కలు చూపించారు. దీంతో 40.2 ఓవర్లలో కేవలం 185 పరుగులే చేసి న్యూజిలాండ్ ఆలౌట్ అయింది.
ఓపెనర్ టిమ్ సీఫర్ట్ 38 పరుగులతో కివీస్ ఇన్నింగ్స్‌లో టాప్ రన్ స్కోరర్‌గా నిలిచాడు. మిగిలిన వారిలో డారిల్ మిచెల్ 28, గ్లెన్ ఫిలిప్స్ 30 పరుగులతో ఫర్వాలేదనిపించారు. ఆఖర్లో బ్లేయిర్ టిక్నర్ 23 బంతుల్లోనే 34 పరుగులు సాధించడంతో కివీస్ కనీసం 150 పరుగుల మార్కు దాటగలిగింది.
చెలరేగిన భారత పేసర్లు
ఇక విల్ యంగ్ (9), హెన్రీ నికోల్స్ (9), టామ్ లాథమ్ (3), కెప్టెన్ మిచెల్ సాంట్నర్ (4), నాథన్ స్మిత్ (1), కైలీ జెమీషన్ (1) సింగిల్ డిజిట్ స్కోర్లకే పరిమితం కాగా.. జేకబ్ డఫీ 15 పరుగులతో అజేయంగా నిలిచాడు. టీమిండియా బౌలర్లలో పేసర్లు అర్ష్‌దీప్ సింగ్ నాలుగు, గుర్నూర్ బ్రార్ మూడు వికెట్లతో చెలరేగగా.. అన్షుల్ కాంబోజ్ రెండు వికెట్లతో మెరిశాడు.
ఈ క్రమంలో నామమాత్రపు లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్‌కు వర్షం పదే పదే అంతరాయం కలిగించింది. దీంతో పలుమార్లు టార్గెట్‌ను రివైజ్ చేసిన తర్వాత ఆఖరికి.. డీఎల్‌ఎస్ పద్ధతి ప్రకారం టీమిండియా లక్ష్యాన్ని 32 ఓవర్లలో 143 పరుగులుగా నిర్దేశించారు.
కోహ్లి మెరుపు అర్ధ శతకం
ఇక లక్ష్య ఛేదనలో దిగ్గజ ఓపెనర్ రోహిత్ శర్మ డకౌట్ కాగా.. మరో ఓపెనర్, కెప్టెన్ శుబ్‌మన్ గిల్ 56 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఇక వన్‌డౌన్ బ్యాటర్, లెజెండరీ విరాట్ కోహ్లి 35 బంతుల్లోనే అర్ద శతకం పూర్తి చేసుకుని సత్తా చాటాడు. వన్డేలో ‘కింగ్’కు ఇది 80వ హాఫ్ సెంచరీ కావడం విశేషం.
Chasing targets, setting standards. Virat Kohli makes it look all too familiar! 👏 Watch the HERO VIDA India Tour of New Zealand 1st ODI, LIVE NOW on Sony Sports Network TV channels, Sony Vizha and Sony LIV. #SonySportsNetwork #SonyVizha #SonyLIV #NZvIND https://t.co/JohFidMSIV
— Sony Sports Network (@SonySportsNetwk) November 4, 2026
ఆ తర్వాత కూడా జోరు కొనసాగించిన కోహ్లి.. మొత్తంగా 51 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 74 పరుగులు చేశాడు. అయితే, డఫీ బౌలింగ్‌లో షాట్‌కు యత్నించిన కోహ్లి.. టిమ్ సీఫర్ట్‌కు క్యాచ్ ఇవ్వడంతో మూడో వికెట్‌గా వెనుదిరిగాడు.
కోహ్లి స్థానంలో వచ్చిన అక్షర్ పటేల్ డకౌట్ కాగా.. వైస్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ 13 బంతుల్లో 15 పరుగులు చేసి నిష్క్రమించాడు.ఈ క్రమంలో విజయానికి 62 బంతుల్లో కేవలం 7 పరుగులు అవసరం కాగా.. కేఎల్ రాహుల్, నమన్ ధీర్ కలిసి విజయలాంఛనం పూర్తి చేశారు.


