source: X
భారత మహిళల జట్టు కెప్టెన్ స్మృతి మంధన ఓ అనవసర రికార్డు మూటగట్టుకుంది. జింబాబ్వేతో జరుగుతున్న రెండో వన్డేలో డకౌటైన ఆమె.. భారత మహిళల వన్డే క్రికెట్‌లో అత్యధికసార్లు డకౌట్ అయిన ఓపెనర్ల జాబితాలో జెమీమా రోడ్రిగ్స్ సరసన నిలిచింది. ఈ జాబితాలో జయ శర్మ (9) టాప్‌లో ఉండగా.. జెమీమా (6), మంధన, అంజూ జైన్, పూనమ్ రౌత్ (5) ఆతర్వాతి స్థానాల్లో ఉన్నారు.
రెండో బంతికే ఔట్
టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్‌కు దిగిన భారత్‌కు ఆదిలోనే భారీ షాక్ తగిలింది. మంధన ఇన్నింగ్స్ రెండో బంతికే సిబండ బౌలింగ్‌లో ఖాతా తెరవకుండానే ఔటైంది. మరికొద్ది సేపటికే భారత్‌కు మరో షాక్ తగిలింది. డాషింగ్ బ్యాటర్ షఫాలీ వర్మ 8 పరుగులకే సిబండ బౌలింగ్‌లోనే ఔటైంది.
ఈ దశలో మరో ఓపెనర్ ప్రతీకా రావల్ (60), మాజీ కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (56) భారత ఇన్నింగ్స్‌ను నిర్మించే బాధ్యత తీసుకున్నారు. వీరిద్దరూ మూడో వికెట్ పడకుండా జాగ్రత్తగా ఆడుతూ ఇన్నింగ్స్‌ను నిర్మిస్తున్నారు. 21 ఓవర్ల తర్వాత భారత్ స్కోర్ 134-2గా ఉంది. రావల్, హర్మన్ ఇప్పటికే 115 పరుగులు జోడించారు.
కాగా, జింబాబ్వేతో జరుగుతున్న మూడు మ్యాచ్‌ల వన్డే సిరీస్‌లో భారత్ 1-0 ఆధిక్యంలో కొనసాగుతోంది. ఈ సిరీస్ తొలి మ్యాచ్‌లో భారత్ 9 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఆ మ్యాచ్‌లో ప్రతీకా రావల్ (100 నాటౌట్) అద్భుతమైన శతకంతో సత్తా చాటింది. మంధన 32 పరుగులకే ఔటైనా, షఫాలీ వర్మ (64 నాటౌట్) సాయంతో ప్రతీకా భారత్‌ను విజయతీరాలకు చేర్చింది.
ఇదీ చదవండి: మరో రికార్డు బ్రేక్ చేసిన రూట్


