సునామీని గెలిచిన ‘మడ’ తీరం... | Andaman Mangrove Forest Revival, Nature Makes A Remarkable Comeback 20 Years After 2004 Tsunami, Read Story Inside | Sakshi
Sakshi News home page

సునామీని గెలిచిన ‘మడ’ తీరం...

Nov 4 2026 9:07 AM | Updated on Nov 4 2026 9:13 AM

Andaman Mangrove forest Revival

సహజసిద్ధంగా పునరుజ్జీవం పొందుతున్న మడ అడవులు

ప్రతికూలతలనే అనుకూలంగా మార్చుకున్న వైనం

2004లో వచ్చిన సునామీ వల్ల భారీ ప్రాణ, ఆర్థిక నష్టమే కాకుండా పర్యావరణానికి తీవ్ర నష్టం వాటిల్లింది. నాటి రాకాసి అలలు భారతదేశంలోని ఉత్తర అండమాన్‌ దీవుల తీరప్రాంత రూపురేఖలను శాశ్వతంగా మార్చేశాయి. సునామీ తీవ్రతకు భూగర్భంలో చోటుచేసుకున్న భారీ మార్పుల వల్ల అక్కడి భూమి మీటరు కంటే ఎక్కువ పైకి లేచింది. దీంతో విస్తారమైన మడ అడవులు నాశనమవ్వడమే కాకుండా, సముద్ర గర్భంలోని పగడపు దిబ్బలు అందాన్ని కోల్పోయాయి.

ఇదంతా పాత కథ. 20 ఏళ్ల తర్వాత అక్కడ ఒక అద్భుతం జరుగుతోంది. మానవ ప్రమేయం లేకుండానే మడ అడవులు సహజంగా పునరుజ్జీవం పొందుతున్నాయి. వైల్డ్‌లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, గురుకుల కాంగ్రీ విశ్వవిద్యాలయానికి చెందిన శాస్త్రవేత్తలు కలిసి 18 వేర్వేరు తీర ప్రాంతాల్లో దాదాపు 300 చోట్ల సర్వే చేసి, ఈ పునర్జన్మ వెనుక ఉన్న కీలక కారణాలను కనుగొన్నారు. అవేంటో తెలుసుకుందాం.

పునరుజ్జీవం ఇలా..
సునామీ తర్వాత మునిగిపోయిన పాత మడ చెట్లు చనిపోయినప్పటికీ, ఆయా ప్రాంతాల్లో ఏర్పడిన కొత్త తీరప్రాంత ఒండ్రు రేఖల వద్ద సహజసిద్ధంగా విత్తనాలు మొలకెత్తడం ప్రారంభమైంది. తీరప్రాంతంలో కొట్టుకొచ్చే మానవ నిర్మిత వ్యర్థాలు మడ చెట్ల వేర్లలో చిక్కుకుపోవడం ఒక విచిత్రమైన అనుకూలతగా మారింది. ఈ వ్యర్థాలు అలల ఒత్తిడిని తగ్గించి, సముద్రంలో కొట్టుకొచ్చే మడ విత్తనాలు ఒకచోట స్థిరంగా ఆగడానికి సహాయపడుతున్నాయి. దీనివల్ల నిరంతరం కదులుతూ ఉండే సముద్ర అలల మధ్య కూడా విత్తనాలు సులభంగా మొలకెత్తుతున్నాయి.

రైజోఫోరా వంటి జాతుల కాయలు చెట్టుపై ఉండగానే మొలకెత్తి, నీటిలో తేలుతూ కొత్త తీరాలకు కొట్టుకొచ్చి స్థిరపడ్డాయి. అలాగే కొత్తగా ఏర్పడిన లోతు తక్కువ తీరాల్లో అవిసెన్నియా మెరీనా, సోన్నెరేషియా ఆల్బా వంటి ప్రతికూల పరిస్థితులను తట్టుకునే పయనీర్‌ జాతులు వేళ్లూనుకున్నాయి. ఇవి నేలను స్థిరీకరించిన తర్వాత ఇతర మడ జాతులు విస్తరిస్తున్నాయి.

సహజ గోడలు.. మడ అడవులు
మడ అడవులు ఆరోగ్యంగా పెరగడానికి ఆ ప్రాంతంలో పెరిగే పొడవైన ‘పైలనీర్‌ చెట్లు’ కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి అక్కడ ఒక రక్షిత వాతావరణాన్ని సృష్టిస్తాయి. వీటి దట్టమైన, అల్లుకుపోయిన ఊడ వేర్లు వేగంగా వచ్చే అలల ఉద్ధృతిని తగ్గిస్తాయి.

అంతేకాకుండా, మొక్కల ఎదుగుదలకు అవసరమైన మెత్తటి మట్టి కొట్టుకుపోకుండా ఒకే చోట నిలిపి ఉంచుతాయి. మడ అడవులు వాతావరణ మార్పులతో పోరాడే కీలకమైన ‘కార్బన్‌ సింక్స్‌’గా పనిచేస్తాయి. అంతే కాకుండా తీవ్రమైన తుపానులు, సునామీలు, పెరుగుతున్న సముద్ర మట్టాల నుంచి తీరప్రాంతాలను రక్షించే సహజ గోడలుగా ఉపయోగపడతాయి.

సముద్రపు నీటిలోని క్షారత్వాన్ని సమతుల్యం చేసి..
నీరు, బురద నేల స్వల్ప ఆమ్లత్వం నుంచి తటస్థ స్థితిలో (సుమారు 6.5 నుంచి 7.5 ఇఏ) ఉన్నప్పుడు కీలక పోషకాలు వేర్లకు సులభంగా లభ్యమవుతాయి. అండమాన్‌లో సమృద్ధిగా కురిసే వర్షాలు, భూగర్భ జలాల ప్రవాహం, కుళ్లిన ఆకులు–సేంద్రియ పదార్థాల విచ్ఛిన్నం వల్ల విడుదలయ్యే సేంద్రియ ఆమ్లాలు సముద్రపు నీటిలోని అధిక క్షారత్వాన్ని సమతుల్యం చేసి, నీటిని స్వల్ప ఆమ్ల–తటస్థ పరిధిలోనే ఉంచాయి.

ఈ అనుకూల రసాయన సమతుల్యత వల్లే సునామీ అనంతర ప్రతికూల పరిస్థితుల్లోనూ వేల హెక్టార్లలో మడ మొలకలు బలంగా నిలదొక్కుకోగలిగాయి.అండమాన్‌ దీవుల్లో జరుగుతున్న ఈ సహజ పునరుద్ధరణ, తీవ్రమైన పర్యావరణ విపత్తుల నుంచి ప్రకృతి తనను తాను ఎలా కాపాడుకోగలదో నిరూపించడమే కాకుండా, ఆధునిక పర్యావరణవేత్తలకు ఒక ముఖ్యమైన మార్గదర్శకంగా నిలుస్తోంది.
- సాక్షి స్పెషల్‌ డెస్క్‌

ఇదీ చదవండి: వాన కాదు.. రైళ్లకు గాలే శత్రువు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement