‘మంచి’ని ప్రేమిద్దాం డ్యూడ్‌! ఎవరూ ఊహించని కొత్త కోర్సు! | IIT Hyderabad Goodness Course | Sakshi
Sakshi News home page

‘మంచి’ని ప్రేమిద్దాం డ్యూడ్‌! ఎవరూ ఊహించని కొత్త కోర్సు!

Nov 4 2026 8:50 AM | Updated on Nov 4 2026 8:50 AM

IIT Hyderabad Goodness Course

ఐఐటీ హైదరాబాద్‌లో విద్యార్థులకు మానవతా పాఠాలు

మంచితనంపై కోర్సు తమను మార్చేసిందంటున్న విద్యార్థులు

పునరాలోచించుకునేలా చేసిందంటూ వెల్లడి..

నిజాయితీ, కరుణ, దయ, విశ్వసనీయతతోపాటు వివిధ అంశాలపై బోధనలు

సామాజికాభివృద్ధిలో తమ వంతు బాధ్యతపై మననం

భావోద్వేగాలు.. ఆధ్యాత్మిక..సామాజిక సేవలపై అవగాహన

ఐఐటీలు అంటే అడ్వాన్స్‌ టెక్నాలజీలతో కూడిన కోర్సులు..పరిశోధనలు..ఆవిష్కరణలు..స్టార్టప్‌లు.. మల్టీనేషనల్‌ కంపెనీల్లో రూ.లక్షల్లో ప్యాకేజీలతో కూడిన వేతనాలు.. ఇవే గుర్తుకు వస్తుంటాయి. కానీ ఇందుకు భిన్నంగా ఓ విద్యార్థి మంచితనం ఎలా అలవరుచుకోవాలనే దానిపై ఓ ప్రత్యేక కోర్సును ప్రారంభించింది ఐఐటీ హైదరాబాద్‌. ఉరుకులు పరుగుల జీవితాల్లో కొందరు మంచితనాన్ని మరచిపోతున్నారు. సాటి మనిషి కష్టాల్లో ఉన్నా కూడా పట్టించుకోవడం లేదు.

ఈ నేపథ్యంలో ఇక్కడ చదువుతున్న విద్యార్థులకు మంచితనాన్ని నేర్పించడంతో పాటు, వ్యక్తిత్వం, బాధ్యత, వ్యక్తిగత వికాసానికి ఉపయోగపడేందుకు దేశంలోనే తొలి సారిగా ‘గుడ్‌నెస్‌: క్యారెక్టర్, రెస్పాన్సిబిలిటీ హ్యూమన్‌ ఫ్లోరిషింగ్‌ క్రెడిట్‌’కోర్సును ప్రారంభించింది. ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గుడ్‌నెస్‌ ఫౌండర్‌ రవిశర్మ నేతృత్వంలో ప్రారంభించిన ఈ కోర్సులో సుమారు 140 మంది విద్యార్థులు నమోదు చేసుకున్నారు. ఈ కోర్సుల్లో పలు సెషన్లు ఉంటాయి. కేవలం విద్యాపరమైన జ్ఞానంపైనే దృష్టి పెట్టకుండా, విద్యార్థుల సక్సెస్‌కు నిర్వచనం ఏంటి? జీవితంలో దేనికి విలువ ఇస్తారు? ఆ ఎంపికలు ఇతరులను ఎలా ప్రభావితం చేస్తాయి? అనే అంశాలను సైతం బోధిస్తారు. - సాక్షిప్రతినిధి, సంగారెడ్డి

గుడ్‌నెస్‌ క్లాసుకు హాజరైన ఐఐటీహెచ్‌ విద్యార్థులు

ఏం నేర్పిస్తారంటే?

మంచితనాన్ని అర్థం చేసుకోవడం: దైనందిన జీవితంలో విలువలు, నీతి, నైతికత, మంచితనాన్ని అన్వేషించడం.

మంచితనాన్ని కొలవడం (గుడ్‌నెస్‌ ఇండెక్స్‌): దయ, కరుణ, నిజాయితీ, బాధ్యత, న్యాయం, విశ్వసనీయత, పర్యావరణ పరిరక్షణ వంటి గుణాలను అర్థం చేసుకోవడం.

విజయం మరియు మంచితనం: ర్యాంకింగ్‌లు, వృత్తిపరమైన విజయం నిర్వచనాలు, సంపద, ఆనందం, సంబంధాలు, సమాజానికి చేసిన సేవను పరిశీలించడం.

జీవిత పంచతంత్రం–మానవ వికాసం: శారీరక, మానసిక, భావోద్వేగ, సామాజిక, ఆధ్యాత్మిక శ్రేయస్సును అన్వేíÙంచడం.

సమగ్రత–విశ్వాసం: బాధ్యతాయుతమైన ప్రవర్తన సమాజ అభివృద్దికి ఎలా దోహదపడతాయో అర్థం చేసుకోవడం.

మంచితనాన్ని నేర్చుకోవడం, ఆచరించడం : వ్యక్తిగత సామాజిక బాధ్యత, కుటుంబం, సహచరులు, సంస్థలు, పర్యావరణం పట్ల మన బాధ్యతలపై మననం చేసుకోవడం.

వ్యక్తిగత శీలం, సామాజిక విశ్వాసం: సంస్థాగత బలం, బాధ్యతాయుతమైన పౌరసత్వాన్ని దేశ నిర్మాణంతో అనుసంధానించడం.

నన్ను నేను మార్చుకునేలా చేసింది...
నాకు సక్సెస్‌ అంటే, మంచితనం అంటే అస్పష్టమైన నిర్వచనాలు ఉండేవి. కానీ ఈ కోర్సు ద్వారా ఈ అంశాలపై మరింత స్పష్టత వస్తోంది. నన్ను నేను మార్చుకునేలా చేసింది.నా తోటి విద్యార్థుల ముందు ఒక చిన్న ప్రసంగం చేసినప్పుడు నా స్టేజ్‌ ఫియర్‌ను కూడా అధిగమించాను. కోర్సు అంశాలను చాలా లోతుగా అధ్యయనం చేస్తున్నా. – ఆయుష్, విద్యార్థి, ఏఐ.

నా ఆలోచనా విధానాన్ని మార్చేసింది...
గుడ్‌నెస్‌ కోర్సును తీసుకునే ముందు, ఇది ఓ సాధారణ కోర్సు అని అనుకున్నా.. కానీ అత్యంత విశిష్టమైన, ఆలోచింపజేసే అభ్యాస ఎక్స్‌పీరియన్‌గా నిలుస్తోంది. మంచితనం, సక్సెస్‌ అంటే ఏంటి? అనే అంశాలు నేర్చుకుంటున్నాను. తరచుగా అపార్థం చేసుకునే భావనల గురించి విమర్శనాత్మకంగా ఆలోచించేలా ఈ కోర్సు ప్రోత్సహించింది. నా హేతుబద్ధమైన ఆలోచనా విధానాన్ని మెరుగుపరిచి, నా విలువలు మరియు నమ్మకాలపై పునరాలోచించుకునేలా చేసింది. – అనిరుద్దా కభ్రా,విద్యార్థి, కంప్యూటేషనల్‌ ఇంజనీరింగ్‌.

అర్థవంతమైన జీవితాన్ని వివరిస్తుంది...
విద్య కేవలం జ్ఞానాన్ని, వృత్తిపరమైన సామర్థ్యాన్ని పెంపొందించడానికే పరిమితం కాకూడదు. విద్యార్థులను వారి వ్యక్తిత్వం, బాధ్యతలు, సమాజానికి వారి సహకారం గురించి ఆలోచించేలా ప్రోత్సహించాలి. ‘గుడ్‌నెస్‌’కోర్సు అర్థవంతమైన జీవితాన్ని గడపడం అంటే ఏమిటో వివరిస్తుంది. మెరుగైన సమాజానికి, సమైక్య భారత్‌కు ఎలా దోహదపడతాయో మా విద్యార్థులు ఆలోచించాలని మేము కోరుకుంటున్నాము. – ప్రొ.బీ.ఎస్‌.మూర్తి, ఐఐటీ హైదరాబాద్‌ డైరెక్టర్‌

ఇదీ చదవండి: బలవంతపు నవ్వైనా.. బోలెడంత రిలీఫ్‌... ఓసారి నవ్వి చూడండి!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement