ఒకే భూమి – ఒకే ఆరోగ్యం | World One Health Day Human Animal Environment Health | Sakshi
Sakshi News home page

ఒకే భూమి – ఒకే ఆరోగ్యం

Nov 3 2026 7:51 AM | Updated on Nov 3 2026 7:51 AM

World One Health Day Human Animal Environment Health

సందర్భం

నేడు వరల్డ్‌ వన్‌ హెల్త్‌ డే

మానవ ఆరోగ్యం, పశుపక్ష్యాదుల క్షేమం, పర్యావరణ పరిరక్షణ... ఈ మూడింటి మధ్య విడదీయలేని అనుబంధం ఉంది. ప్రకృతిలోని ఏ ఒక్క విభాగానికి విఘాతం కలిగినా, దాని ప్రభావం సమస్త జీవకోటిపై పడుతుంది. అందుకే మనుషులు, జంతు వులు, ప్రకృతి ఆరోగ్యాన్ని వేర్వేరుగా కాకుండా ఒకే సమగ్ర వ్యవస్థలో భాగాలుగా పరిగణించడమే ‘ఒకే ఆరోగ్యం’ (వన్‌ హెల్త్‌) సిద్ధాంతం. ప్రతి ఏటా నవంబర్‌ 3న నిర్వహించే ‘వరల్డ్‌ వన్‌ హెల్త్‌ డే’ దీని ఆవశ్యకతను ప్రపంచానికి చాటి చెబుతోంది.

ప్రపంచ ఆరోగ్య సంస్థ, ప్రపంచ జంతు ఆరోగ్య సంస్థల గణాంకాల ప్రకారం, మానవుల్లో నమోదవుతున్న అంటువ్యాధుల్లో దాదాపు 60 శాతం, కొత్తగా వెలుగుచూస్తున్న అంటువ్యాధుల్లో సుమారు 75 శాతం జంతువుల నుంచి సంక్రమించే వ్యాధులకు సంబంధించినవే. రేబిస్, బ్రూసెల్లోసిస్, ఆంత్రాక్స్, స్వైన్‌ ఫ్లూ, నిపా వైరస్, మంకీపాక్స్‌; అలాగే బర్డ్‌ ఫ్లూ, సిట్టకోసిస్‌ వంటి పశు, పక్ష్యాదుల నుండి సంక్రమించే వ్యాధులు మానవాళికి తీవ్ర ముప్పుగా పరిణమిస్తున్నాయి.

ముఖ్యంగా పాడి రైతులు, పశు వైద్యులు, పశుసంవర్ధక సిబ్బంది ఈ వ్యాధుల బారిన పడే ప్రమాదం ఎక్కువ. జంతువులకు, పక్షులకు ముందస్తు వ్యాధి నిరోధక టీకాలు వేయడం, వ్యాధులపై నిరంతర నిఘా ఉంచడం ద్వారా మానవులకు వ్యాధులు వ్యాపించకుండా ప్రారంభ దశలోనే అడ్డుకట్ట వేయవచ్చు.

‘ఒకే ఆరోగ్యం’ అమలులో ఆహార భద్రత కూడా కీలకమైన అంశం. పాలు, మాంసం, గుడ్లు వంటి జంతు ఉత్పత్తులు పరిశుభ్రమైన పరిస్థితుల్లో ఉత్పత్తి చేసి, సరైన ఉష్ణోగ్రతల్లో నిల్వ చేయాలి. వంటగదిలో ముడి మాంసం, కూరగాయలకు వేర్వేరు కత్తులు, పలకలు ఉపయోగించడం, చేతులను సబ్బుతో శుభ్రంగా కడుక్కోవడం వంటి చిన్న జాగ్రత్తలు కూడా వ్యాధుల వ్యాప్తిని గణనీయంగా తగ్గిస్తాయి. పాఠశాలలు, గ్రామీణ ప్రాంతాల్లో ఆరోగ్య అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా పిల్లలు, కుటుంబాలు పరిశుభ్రత, సురక్షిత ఆహారపు అలవాట్లను అలవరుచు కునేలా చేయవచ్చు.

ప్రస్తుతం ఒకే ఆరోగ్య పరిరక్షణకు అతి పెద్ద సవాలుగా నిలుస్తున్నది యాంటీ బయాటిక్‌ మందుల నిరోధకత. పశువులు, కోళ్లకు పశువైద్యుల పర్యవేక్షణ లేకుండా యాంటీ బయాటిక్‌ మందులను విచక్షణారహితంగా వినియోగించడం, నిర్ణీత చికిత్సను మధ్యలోనే నిలిపివేయడం వల్ల బ్యాక్టీరియాలు మందులకు లొంగని స్థితికి చేరుకుంటున్నాయి. వీటినే సాధారణంగా ‘సూపర్‌ బగ్స్‌’గా పిలుస్తారు. ఫలితంగా మనుషుల్లో సాధారణ అంటువ్యాధులకు సైతం మందులు పనిచేయని దుఃస్థితి ఏర్పడవచ్చు. అందువల్ల పశువులకు అర్హత కలిగిన పశువైద్యుల సూచన మేరకే మందులు వాడాలి.

అలాగే అడవుల నరికివేత, విచ్చలవిడిగా విస్తరిస్తున్న పట్టణీ కరణ, వాతావరణ మార్పులు వన్యప్రాణుల సహజ ఆవాసాలను దెబ్బతీస్తున్నాయి. దీంతో అవి జనావాసాల వైపు రావడం, జంతు వుల నుంచి మనుషులకు వ్యాధులు సంక్రమించే అవకాశాలు పెరగడం ఆందోళన కలిగిస్తోంది.

వ్యవసాయ ప్రధాన దేశమైన భారత్‌లో జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం ద్వారా గాలికుంటు వ్యాధి, బ్రూసెల్లోసిస్‌ నివా రణకు చేపడుతున్న టీకా కార్యక్రమాలు కీలకమైనవి. అదే విధంగా వీధి కుక్కలకు రేబిస్‌ నిరోధక టీకాలు వేయడం, వాటి సంఖ్యను శాస్త్రీయ పద్ధతుల్లో నియంత్రించడం, కుక్కకాటు నివారణపై ప్రజ లకు అవగాహన కల్పించడం అత్యవసరం.

గ్రామస్థాయిలో ఆరోగ్య కార్యకర్తలు, పశువైద్య సిబ్బంది, రైతు సంఘాలు కలిసి పనిచేస్తే వ్యాధులపై ముందస్తు జాగ్రత్త మరింత సమర్థంగా ఉంటుంది. ప్రతి కుటుంబం తమ పెంపుడు జంతువులకు క్రమం తప్పకుండా ఆరోగ్య పరీక్షలు చేయించి వ్యాధి నిరోధక టీకాలు వేయించాలి. ప్రభుత్వాలు, వైద్యులు, పశువైద్యులు, రైతులు, శాస్త్రవేత్తలు, ప్రజలు సమష్టిగా కృషి చేసినప్పుడే ‘ఒకే భూమి–ఒకే ఆరోగ్యం’ సాధ్య మవుతుంది.

- కె. బాలబ్రహ్మం, వ్యాసకర్త వెటర్నరీ లైవ్‌ స్టాక్‌ ఆఫీసర్‌ (రిటైర్డ్‌), పశు సంవర్ధక శాఖ, ఏపీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement