సంకల్ప బలం | fitness icons Women bodybuilder influencers talks on Inspirational words | Sakshi
Sakshi News home page

సంకల్ప బలం

Nov 3 2026 4:52 AM | Updated on Nov 3 2026 4:52 AM

fitness icons Women bodybuilder influencers talks on Inspirational words

స్ట్రెంగ్త్‌ ట్రెయినింగ్, బాడీబిల్డింగ్‌ మగవారికి మాత్రమే పరిమితం.. వారు మాత్రమే జిమ్‌కి వెళ్లాలి అనే ఆలోచన చాలా కాలంగా మనలో ఉంది. అయితే మహిళలు జిమ్‌కు మగవారితో పోటీపడటానికి కాదు, తమ సొంత భయాలను అధిగమించడానికి వెళ్లాలి.. అంటున్నారు సోషల్‌మీడియా వేదికగా విమెన్‌ బాడీబిల్డర్‌ ఇన్‌ఫ్లుయెన్సర్లు. వీరిలో చిత్రా పురుషోత్తం, నటి సంయుక్త హెగ్డె, అర్చనా చంద్రన్, అంకితా సింగ్‌.. చెప్పిన స్ఫూర్తిదాయకమైన విషయాలు.

పురుషుల ఆధిపత్యం ఎక్కువగా ఉండే బాడీ బిల్డింగ్‌ రంగంలో ప్రవేశించి, మహిళలు శారీరకంగా ఎంత బలంగా మారగలరో నిరూపించారు చిత్రా పురుషోత్తం. కర్ణాటకకు చెందిన ఈ ప్రముఖ మహిళా బాడీబిల్డర్, ఫిట్‌నెస్‌ మోడల్‌ మిస్‌ ఇండియా ఫిట్‌నెస్‌ అండ్‌ వెల్నెస్, మిస్‌ సౌత్‌ ఇండియా, కర్ణాటక స్ట్రాంగ్‌ ఉమెన్‌ వంటి ఎన్నో ప్రతిష్టాత్మక టైటిళ్లు గెలుచుకున్నారు. సంప్రదాయ పెళ్లి కూతురు దుస్తులలో ఫిట్‌నెస్‌ బాడీనీ ప్రదర్శిస్తూ ఆమె చేసిన బ్రైడల్‌ షూట్‌ సోషల్‌ మీడియాలో వీపరీతంగా వైరల్‌ అయ్యింది.

నాజూకుగా అనే ఆలోచన నుంచి బయటకు రావాలి
‘ఏ దశలోనైనా మహిళలు తమ ఆరోగ్యం, ఫిట్‌నెస్‌ను నిర్లక్ష్యం చేయకూడదు. మహిళలు అంటే కేవలం నాజూకుగా మాత్రమే ఉండాలనే ఆలోచన నుంచి బయటకు రావాలి. తనకు తాను ఇచ్చుకునే మాటను నిలబెట్టుకున్నవారే విజేతలు అవుతారు. పోటీపడగల శరీరాకృతిని నిర్మించుకోవడం రాత్రికి రాత్రే సాధ్యమయ్యేది కాదు. నిరంతర శిక్షణ, పోషణ, సహనం, త్యాగం, పట్టుదల అవసరం. విజయం అనేది సమాజపు సంప్రదాయ అంచనాలకు అనుగుణంగా ఉండాల్సిన అవసరం లేదు. బలం, సంకల్పం మహిళా సాధికారతకు ప్రతీక. పరిమితులను అధిగమించి, రాబోయే తరాలు మరింత గొప్పగా కలలు కనేలా మన జీవన విధానం ఉండాలి. కండరాల బలం కూడా మహిళల అందానికి, ఆత్మవిశ్వాసానికి ప్రతీక.’ 
– చిత్రా పురుషోత్తం

ఎప్పటికీ వెనకాడకూడదు
అర్చన చంద్రన్‌ గృహిణిగా, తల్లిగా, భార్యగా, సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా ఒక మహిళ జీవితంలోని అన్ని పాత్రలనూ పోషిస్తుంది. దీంతో పాటు బాడీ బిల్డర్‌గా తనను తాను తీర్చిదిద్దుకుంటున్నది. రెండేళ్ల క్రితం బాడీబిల్డింగ్‌లో ‘మిస్‌ యూపీ’ టైటిల్‌ను గెలుచుకున్నది. బాడీబిల్డర్‌ మామ్‌గా సోషల్‌ మీడియాలో తన అనుభవాలను పంచుకుంటూ, స్ఫూర్తిదాయకమైన వ్యాఖ్యలు చేస్తోంది.

‘తల్లులు, మహిళలు ఫిట్‌గా ఉండాలంటే తమకు తాముగా శిక్షణ ఇచ్చుకోక తప్పదు. మునుపెన్నడూ లేనంత బలంగా మారుతున్నాను అని మాటల్లో చెప్పను. అందుకు నిశ్శబ్దంగానే రెడీ అవుతాను. మహిళలు తమ జీవితంలో ఎన్నో మానసిక గాయాల నుంచి కోలుకోక తప్పదు. అందుకు ఎవరి అంగీకారమూ అవసరంలేదు. అన్నింటినీ మర్చిపోయి, నచ్చినపని చేయండి. ముఖ్యంగా మీ వీపును బలంగా ఉంచుకోండి. ఎందుకంటే కొంతమంది పిరికివాళ్లు మీ వీపు వెనుక మాత్రమే పొడుస్తారు. వాళ్లు ఎప్పుడూ ముందుకు రారు. ఆత్మవిశ్వాసంతో బలంగా కనిపించండి. అప్పుడు మీరు కాదు మీ తేజస్సే వారితో మాట్లాడుతుంది. మిమ్మల్ని మీరు పునః సృష్టించుకోండి. ప్రతి మహిళ జీవితంలోనూ భిన్నమైన పోరాటాలు ఉంటాయి. కానీ, వారిలో కొందరిని మాత్రం ప్రత్యేకంగా నిలిపేది ఏంటంటే తమ పోరాటాన్ని తామే చేస్తూ, ఎప్పటికీ వెనకాడకుండా ప్రయత్నించడమే.’
– అర్చన చంద్రన్‌

బలంగా మారడానికే వ్యాయామం
నటి సంయుక్త హెగ్డే చీర కట్టుకుని గంటలో 106 పుల్‌–అప్‌లు చేసి అందరి దృష్టిని ఆకర్షించింది. ఈమె నటి మాత్రమే కాదు ఫిట్‌నెస్, స్ట్రెంగ్త్‌ ట్రైనింగ్‌తో సోషల్‌ మీడియాలో ఎప్పుడూ ట్రెండింగ్‌లో ఉంటారు. జిమ్‌ మెషిన్స్‌కే పరిమితం కాకుండా బాడీ వెయిట్‌ వర్కౌట్స్, కోర్‌ స్టెబిలిటీ, ఫంక్షనల్‌ ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధానమిస్తారు. 
‘మేం మగవారిని ఓడించడానికి జిమ్‌కి వెళ్లడం లేదు. మా ఆరోగ్య భయాలను ఓడించడానికి వెళుతున్నాం. మహిళల ఫిట్‌నెస్‌ అంటే దశాబ్దాలుగా సన్నబడటం, బరువు తగ్గించుకోవడం, కేలరీలు కరిగించడం .. వీటి చుట్టూతనే ప్రచారం జరుగుతోంది. దీంతో వ్యాయామం వల్ల కలిగే అతి ముఖ్యమైన ప్రయోజనాలను మహిళలు పొందడం లేదు. వయసుతోపాటు కండరాల పరిమాణం, బలం తగ్గుతాయి. మెనోపాజ్‌ టైమ్‌లో ఎముకల అరుగుదల ఉంటుంది. మహిళలు బలంగా ఉండటం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ఫిట్‌నెస్‌ లక్ష్యం ఎక్కువ పుల్‌ అప్‌లు చేయడం కాదు. బరువు తగ్గించుకోవడానికి వ్యాయామం అనే ఆలోచనను మానేయాలి. మరింత బలంగా మారడానికే వ్యాయామం అవసరం అని గ్రహించాలి.’
– సంయుక్తా హెగ్డె

అడ్డంకులను ఎదుర్కోవాల్సిందే!
బెంగళూరులో ఉంటున్న ఫిట్‌నెస్‌ ఇన్‌ఫ్లుయెన్సర్‌ అంకితా సింగ్‌ ఇండియన్‌ బాడీ బిల్డర్‌ ఫెడరేషన్‌ ఫౌండర్‌. జాతీయస్థాయి మహిళా బాడీ బిల్డర్‌. సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిగా ఉంటూ ఫిట్‌నెస్‌ రంగంలోకి వచ్చారు. ఆ తర్వాత మోడల్‌గా మారారు. మిస్‌ ఇండియా ఫిట్‌నెస్‌ ఈవెంట్లలో ఫైనలిస్ట్‌గా ఉన్నారు. ఆన్‌లైన్‌ కోచ్‌గా కూడా రాణిస్తున్నారు. ఎలాంటి కోచ్‌ సహాయం లేకుండా కఠినమైన క్రమశిక్షణతో తనను తాను తీర్చిదిద్దుకుంది. 

‘కాలేజీ రోజుల్లో ఉన్నప్పుడు ఒకసారి తీవ్రమైన నిరాశకు లోనయ్యాను. నా ఫ్రెండ్స్‌ వెళుతున్నారు అని నేను జిమ్‌లో చేరాను. అప్పటినుంచి నా లోకమే మారిపోయింది. బికినీలో బాడీ బిల్డింగ్‌ షోలు చేయడంతో ఇంటా బయట అడ్డంకులను ఎదుర్కొన్నాను. ఎన్నో టైటిల్స్‌ గెలుచుకున్నాను. పోరాటం ఇంకా కొనసాగుతూనే ఉంది. సోషల్‌ మీడియాలో నా ఫొటోలకు, అభి్రపాయాలకు చెడుగా కామెంట్లు వస్తూనే ఉంటాయి. కానీ, పట్టించుకోను. మహిళా బాడీబిల్డర్‌గా నేనేంటో నాకు తెలుసు. నా వీడియోల ద్వారా ఎంతో మంది ఉత్సాహంతులైన మహిళలకు స్ఫూర్తినిస్తూ నిలవడమే. ఛాంపియన్‌షిప్‌ కిరీటాలతో మూసధోరణులను బ్రేక్‌ చేయడమే. ఈ మార్గంలో ఇంకా ఎంతో ప్రయాణించాల్సి ఉంది.’ 
– అంకితా సింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement