చీరకట్టుతోనే వర్కౌట్స్‌..! | Health Tips: Here are some workout ideas inspired by Samyuktha Hegde | Sakshi
Sakshi News home page

చీరకట్టుతోనే వర్కౌట్స్‌..! నటి సంయుక్త హెగ్డే ఫిట్‌నెస్‌ పాఠాలు

Oct 31 2026 9:29 AM | Updated on Oct 31 2026 9:29 AM

Health Tips: Here are some workout ideas inspired by Samyuktha Hegde

నటి సంయుక్త హెగ్డే ఇటీవల చీర కట్టుతోనే గంటలో 106 పుల్‌అప్స్‌ చేసి అందరినీ ఆశ్చర్యపరిచింది. తాను జిమ్‌కి వెళ్లేది మగవారితో పోటీపడేందుకు కాదనీ.. తన ఆరోగ్యాన్ని, శరీరాన్ని దృఢంగా మార్చుకునేందుకేనంటూ సందేశాన్ని సైతం ఇచ్చింది. అయితే అందరూ ఇలాంటివే చేయాల్సిన అవసరం లేదు. శరీరాన్ని దృఢంగా, ఆరోగ్యంగా మార్చుకోవాలంటే వ్యాయామం తప్పనిసరిగా చేయాలనే ఆలోచన ప్రతి ఒక్కరిలో వస్తే చాలు. 

చాలా మంది మహిళలను వేధించే సమస్య.. జిమ్‌కి వెళ్తే కండలు ఎక్కడ పెరిగిపోతాయో? శరీరాకృతి పురుషుల్లా మారిపోతుందో అనే భయం. కానీ ఇది ఒక అపోహ మాత్రమే. సరైన పద్ధతిలో చేస్తే కండరాలు బలంగా మారుతాయి. శరీరంలో అదనంగా పేరుకుపోయినటువంటి కొవ్వు కరుగుతుంది. అందుకే వర్కౌట్స్‌ అంటే భయపడకుండా.. ముందు వాటిని ఎలా చేయాలో తెలుసుకోవాలి.

ఆరోగ్యానికి పెట్టుబడి!
ఆడవారిలో వయసు పెరిగేకొద్దీ కండరాల బలం తగ్గుతుంది. ముఖ్యంగా మెనోపాజ్‌ దశలో ఈస్ట్రోజన్‌ హార్మోన్‌  స్థాయులు తగ్గి.. ఎముకలు బలహీనమయ్యే ప్రమాదం ఎక్కువ. అందువల్ల రోజూవారి వాకింగ్, జాగింగ్‌ వంటి వ్యాయామాలతోపాటు బరువులు ఎత్తేటువుంటి వర్కౌట్స్‌ కూడా చేయడం వల్ల కండరాలకు, ఎముకలకు తగిన వ్యాయామం అందుతుంది. 

దృఢంగా మారుతాయి. మెనోపాజ్‌ దశలో ఉన్న 4000 మంది మహిళలపై జరిపిన పరిశోధనల్లోనూ ఎముకల ఆరోగ్యానికి బరువులు ఎత్తేటువంటి వ్యాయామాలు మేలు చేస్తాయని తేలింది.

ఇంటి పనులకూ అవసరమే!
మెట్లు ఎక్కడం.. పిల్లలను ఎత్తుకోవడం.. నేలపై కూర్చుని లేవడం, బరువైన బ్యాగులను మోయడం.. ఇవన్నీ రోజూ చేసుకునే, చేయాల్సిన పనులే. అయితే కండరాలు బలంగా ఉంటేనే ఈ పనులను సులభంగా చేసుకోగలుగుతాం. అంతేకాదు .. వయసు పెరిగిన తర్వాత ఇతరులపై ఆధారపడకుండా ఉండేందుకు అవసరమైన శారీరక బలం కూడా పెరుగుతుంది. అంటే మనం చేసే వ్యాయామాలు.. ఈరోజు కోసమే కాదు.. భవిష్యత్‌కీ చేదోడుగా నిలుస్తాయి. 

మొదట్లోనే భారీ బరువులు వద్దు!
అయితే జిమ్‌కి వెళ్లిన మొదటి రోజు నుంచే భారీ బరువులు ఎత్తాల్సిన అవసరం లేదు. సాధారణ వాటితో ప్రారంభించి శరీరం అలవాటుపడిన తరువాత క్రమంగా వ్యాయామ సమయాన్ని, వర్కౌట్స్‌ని పెంచుకోవాలి.  ఇందుకోసం ముందుగా ఫిట్‌నెస్‌ ట్రైనర్‌ సలహా తీసుకోవడం మంచిది. అయితే సన్నగా ఉండటం మాత్రమే ఆరోగ్యానికి కొలమానం కాదు.. రోజంతా ఎంత చురుగ్గా ఉంటున్నాం.. పనులను ఎంత సులువుగా చేసుకోగలుగుతున్నాం అనేవి కూడా ఆరోగ్య సూచికలే!

 

ఇదీ చదవండి: పర్యావరణ హితమైన బ్యూటీ ప్రొడక్ట్స్‌నే ఉపయోగిద్దాం ఇలా..!

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement