అందంగా కనిపించడం ముఖ్యమే.. కానీ ఆ బ్యూటీ ప్రోడక్ట్స్ వల్ల పేరుకుపోయే వ్యర్థాలు అన్నీఇన్నీ కావు. అవి మనకు అందాన్ని, ఆనందాన్నిచ్చినా పర్యావరణానికి ఎంతో హానిచేస్తున్నాయి. అయితే కొన్ని ఉత్పత్తులను కొనడానికి ముందు చిన్నచిన్న జాగ్రత్తలు పాటిస్తే పర్యావరణానికీ ఎంతో మేలు చేసినవారమవుతాం.
ఒక్కసారి వాడి పారేసే వస్తువులకు దూరంగా ఉండటం మంచిది. ప్లాస్టిక్ రేజర్లు, వెట్ టిష్యూ పేపర్లకు బదులుగా .. శుభ్రం చేసుకుని తిరిగి ఉపయోగించేటువంటి ఉత్పత్తులను ఎంచుకోవడం వల్ల ఖర్చూ ఆదా అవుతుంది. వ్యర్థాలనూ తగ్గించవచ్చు.
రెగ్యులర్‌గా ఉపయోగించే క్రీములు, ఆయిల్స్, షాంపూలు వంటి సౌందర్య ఉత్పత్తులను పెద్దపరిమాణంలో కొనుగోలు చేయడం బెటర్. చిన్న ప్యాకెట్లతో పోలిస్తే వీటికి తక్కువ ప్యాకేజింగ్ అవసరమవుతుంది. ఒక్కో యూనిట్ ధర కూడా తక్కువగా ఉండొచ్చు.
ప్యాకింగ్, కలర్ అందంగా కనిపించిందని చర్మానికి సరిపోతాయో లేదో అనేది ఆలోచించకుండానే కొన్ని సందర్భాల్లో కొనేస్తుంటాం. కానీ ముందుగా పరీక్షించడం వల్ల .. ఉపయోగించని ఉత్పత్తులతో వ్యర్థాలు పేరుకుపోకుండా ఉంటాయి
పర్యావరణానికి తక్కువ హాని కలిగించే సౌందర్య ఉత్పత్తులకు ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. ప్యాకేజింగ్‌పై తిరిగి ఉపయోగించేందుకు సంబంధించిన గుర్తులు, పర్యావరణానికి ఎటువంటి హాని లేదనే సూచనలు వున్నాయో లేదో ముందే పరిశీలించాలి.
అవసరానికి మించిన అట్టపెట్టెలు, ప్లాస్టిక్ సీసాలు, అదనపు కవర్లతో వచ్చే ఉత్పత్తులను తగ్గించడం మంచిది. ఆకర్షణీయమైన ప్యాకేజింగ్ కంటే లోపల ఉన్న ఉత్పత్తి నాణ్యతకే ప్రాధాన్యం ఇవ్వాలి.
కొంతమంది డియోడరెంట్లను విపరీతంగా కొనేస్తుంటారు. వాటి స్థానంలో సహజమైనవి ఎంచుకుంటే ఆరోగ్యానికి, పర్యావరణానికీ మంచిది.
ఇంట్లోనే సహజంగా లభించే పదార్థాలను ప్రయత్నించవచ్చు. మన ఇంట్లో పెద్దవారు పాటించిన చిట్కాలు తెలుసుకుని ఫాలో అవ్వచ్చు. కానీ ఏదయినా కొత్త పదార్థాన్ని ఉపయోగించే ముందు ముందుగా పరీక్షించడం మంచిది.
సౌందర్య ఉత్పత్తుల ఖాళీ సీసాలు, డబ్బాలను చెత్తలో పడేయకుండా రీసైక్లింగ్‌కు ఇవ్వండి. కొన్ని సంస్థలు ఖాళీ ప్యాకేజింగ్‌ను తిరిగి సేకరించే కార్యక్రమాలను నిర్వహిస్తాయి. వాటిని ఉపయోగించుకోవచ్చు.
సౌందర్యాన్ని కాడుకోవడం అంటే చర్మాన్ని అందంగా ఉంచుకోవడమే కాదు.. మన చుట్టూ ఉన్న ప్రకృతిని కాపాడుకోవడం కూడా.


