అక్టోబర్‌ 31 రాత్రి ఆత్మలు వస్తాయా? ఈ నమ్మకం వెనుక కథేంటి? | Halloween History Fear Festival | Sakshi
Sakshi News home page

అక్టోబర్‌ 31 రాత్రి ఆత్మలు వస్తాయా? ఈ నమ్మకం వెనుక కథేంటి?

Oct 31 2026 7:35 AM | Updated on Oct 31 2026 7:35 AM

Halloween History Fear Festival

అక్టోబర్‌, 31 - నేడు హాలోవీన్‌

చీకటి పడుతుండగానే వీధుల్లో దయ్యాలు, మంత్రగత్తెలు, రక్తపిశాచాలు తిరుగుతుంటాయి. గుమ్మాల ముందు భయంకరమైన కళ్లతో మెరిసే గుమ్మడికాయ దీపాలు స్వాగతం పలుకుతుంటాయి. పిల్లలు చేతుల్లో బుట్టలు పట్టుకుని ‘ట్రిక్‌ ఆర్‌ ట్రీట్‌’ అంటూ మిఠాయిల వేటలో మునిగి పోతారు. ఈ దృశ్యం ‘హాలోవీన్‌’ రోజు కనిపిస్తుంది.

హాలోవీన్‌ మూలాలు సుమారు రెండు వేల సంవత్సరాల క్రితం యూరప్‌లోని సెల్టిక్‌ జాతి జరుపుకున్న ‘సామ్హైన్‌’ పండుగలో ఉన్నాయి. వేసవి ముగిసి కఠినమైన శీతాకాలం మొదలయ్యే సమయంలో ప్రకృతిలో వచ్చే మార్పును వారు ఒక సంధికాలంగా భావించేవారు. అక్టోబర్‌ 31 రాత్రి మరణించినవారి ఆత్మలు భూమిపై సంచరిస్తాయని నమ్మిన ప్రాచీనులు, ఆ దుష్టశక్తుల బారిన పడకుండా ఉండేందుకు తామే భయానక వేషాలు వేసుకుని తిరిగేవారు. కాలక్రమంలో వ్యవసాయ ఆధారిత నమ్మకాలు, క్రైస్తవ సంప్రదాయాలు కలగలిసి ఇప్పటికి గ్లోబల్‌ ఈవెంట్‌గా రూపాంతరం చెందాయి.

హాలోవీన్‌ వెనుక అద్భుతమైన మానసిక విశ్లేషణ దాగి ఉంది. మనిషికి పుట్టుకతోనే ఉన్న అతిపెద్ద బలహీనత ‘భయం’. ముఖ్యంగా చీకటి, మరణం, అజ్ఞాత శక్తులంటే భయం. హాలోవీన్‌ ఆ భయాన్ని సమాజం ముందు పెట్టి, దానితో సరదాగా ఆడుకునే అవకాశాన్ని ఇస్తుంది. భయపెట్టే దయ్యాల ముసుగులు ధరించి నవ్వుకోవడం ద్వారా, మనుషులు తమలోని అంతర్గత భయాలను దూరం చేసుకుంటారు. 

భారతీయ సంస్కృతిలో ‘మహాలయ అమావాస్య’ నాడు పూర్వీకులను స్మరించుకున్నట్టే, ప్రకృతి చక్రంలో వెలుగు–చీకటి, జననం–మరణం రెండూ భాగమేనని హాలోవీన్‌ పరోక్షంగా గుర్తుచేస్తుంది. సరిహద్దులు దాటి ఇప్పుడు ప్రపంచమంతా ఈ వేడుకలు వ్యాపించాయి. పరిధులు ఏవైనా, సంప్రదాయాలు వేరైనా... చెడును ఎదుర్కోవడం, భయాన్ని జయించి జీవితాన్ని ఆనందంగా ఆస్వాదించడమే హాలోవీన్‌ సందేశం. 
– భవనం బద్రిరెడ్డి

ఇదీ చదవండి: మనసు అదుపులో ఉంటే.. మనిషికి తిరుగే ఉండదు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement