పాలు–పెరుగు కథలో స్థితప్రజ్ఞత రహస్యం! | Spiritual Practice Path To Inner Peace And Moksha | Sakshi
Sakshi News home page

మనసు అదుపులో ఉంటే.. మనిషికి తిరుగే ఉండదు!

Oct 30 2026 7:34 AM | Updated on Oct 30 2026 7:34 AM

Spiritual Practice Path To Inner Peace And Moksha

జ్యోతిర్మయం

ఆధ్యాత్మిక సాధనల వల్ల కలగవలసిన ప్రయోజనాలు రెండు. మొదట అవి, అతి చంచలంగా ఉండే మనసును కుదుటపరచి, నిశ్చలం చేయాలి. ఆపైన అవి, సాధకుడిని క్రమేణా స్థితప్రజ్ఞుడిగా మార్చి, మోక్ష మార్గంలో– బ్రహ్మనిర్వాణ ప్రాప్తి మార్గంలో – నిలిపి, నడపాలి.

మనసును కల్లోలం చేసే భావోద్రేకాలనూ, కోరికల పరంపరలనూ, నిరంతరం అభ్యాసంతో నియంత్రించి, మెల్లిగా త్యజించగలిగిన సాధకుడు స్థితప్రజ్ఞుడు. మనసు స్వాధీనమైన మనిషి కష్టాలు కలిగినప్పుడు కుంగిపోడు. సుఖాలు కలిగినప్పుడు, ఒళ్ళుమరచి పొంగిపోడు. ఇంద్రియ భాగాల మీద ఆసక్తి క్రమంగా తగ్గించుకొంటూ, ఆయోమయానికీ, ఆందోళనలకూ గురిచేసే క్రోధావేశాలకూ, లాభమోహాలకూ దూరంగా ఉంటాడు. అతని బుద్ధి పెడదార్లు పట్టకుండా, సవ్యంగా, శ్రేయోదాయకంగా పనిచేస్తుంది.

పెద్దలు ఒక పోలిక చెప్తూ ఉంటారు. సామాన్యుడి మనసు పాలలాగా పలచగా, చంచలంగా ఉంటే, స్థితప్రజ్ఞుడి మనసు గట్టిపడి, గడ్డపెరుగులా నిశ్చలంగా ఉంటుంది అని. పాలు ఏ ప్రయత్నమూ లేకుండా వాటంతటవి పెరుగుగా మారవు. ముందు అవి నిప్పుసెగన పొంగు వచ్చేదాకా బాగా కాగాలి. తరవాత చల్లారి గోరువెచ్చదనానికి రావాలి. అప్పుడు వాటికి, అంతకుముందే తోడుకొని గట్టి పడి ఉన్న పెరుగుతో సాంగత్యం కావాలి. తోడు వేసిన పాలగిన్నెను కొంతకాలం కదల్చకుండా పక్కన పెట్టాలి. తగినంత సమయం గడిచిన తరవాత, అవి పెరుగు అవుతాయి.

సాధకుడూ అంతే. ముందు కొన్నాళ్ళు ప్రాపంచిక విషయాల పట్ల కామక్రోధ లోభాదులతో కాగిపోవాలి. అలా తపించితేగానీ వాటిమీద మొహం మొత్తి, కొంత వైరాగ్యభావం ఏర్పడదు. క్రమంగా విరక్తి వల్ల తాపం తగ్గి, చల్లారుతాడు. అప్పుడు అతడికి జ్ఞానులైన సద్గురువుల బోధనల ‘తోడు’ కావాలి. క్రమంగా ఆ గురుబోధలను తగిన రీతిలో శ్రవణం, మననం, చింతనా, ఆచరణా చేసుకొంటూ; మనసును నిశ్చలం చేసుకొని స్థిరచిత్తుడిగా, స్థితప్రజ్ఞుడిగా, సంతుష్ఠుడిగా మారతాడు. పాలు పెరుగయిన తరవాత, దాని నుండి బ్రహ్మానందమనే నవనీతాన్ని రాబట్టుకొంటాడు.
– ఎం. మారుతి శాస్త్రి

ఇదీ చదవండి: ఆత్మసాక్షాత్కారం అంటే ఏమిటి? శ్రీ మాతాజీ బోధనలివే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement