ఏదైనా అదుపులో ఉందాం.. | Monika advises a young first-generation wealth creator on managing a sudden financial windfall | Sakshi
Sakshi News home page

ఏదైనా అదుపులో ఉందాం..

Oct 30 2026 12:43 AM | Updated on Oct 30 2026 12:43 AM

Monika advises a young first-generation wealth creator on managing a sudden financial windfall

నేడు పొదుపు దినోత్సవం

మోనికా హెలెన్‌ ఫైనాల్సియల్‌ జర్నలిస్ట్, రచయిత్రి, స్పీకర్, పర్సనల్‌ ఫైనాన్స్‌ మేనేజ్‌మెంట్‌ నిపుణురాలు. బెంగళూరులోని ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌లో చదువుకున్న మోనిక స్టాన్‌ఫోర్డ్‌ యూనిర్శిటీలో బ్రాడ్‌కాస్ట్‌ జర్నలిజంలో పట్టా అందుకున్నారు. 

జటిలమైన ఆర్థిక విషయాలను కూడా సామాన్యులకు సైతం అర్థమయ్యేలా చెప్పడం ఆమె ప్రత్యేకత. ఆమె ప్రసిద్ధ పుస్తకం... లెట్స్‌ టాక్‌ మనీ. ఏది చేయాలి? ఏది చేయకూడదు?... మన ఆర్థిక విషయాలకు సంబంధించి సరైన అవగాహన కలిగించే ఈ పుస్తకంలో నుంచి కొన్ని విషయాలు...

‘రెండు వారాలు తిరిగేసరికల్లా నెల జీతం మొత్తం ఖర్చయిపోతుంది. డబ్బు ఎక్కడికి పోతుందో ఏమిటో!’ అని చాలామంది గందరగోళానికి గురవుతుంటారు. క్లాష్‌ ఫ్లో మేనేజ్‌మెంట్‌ సిస్టమ్‌ గురించి అవగాహన లేకపోవడమే దీనికి కారణం. ఈ సిస్టమ్‌ డబ్బును ఖర్చు, పొదుపుగా వర్గీకరించడంలో సహాయపడుతుంది.

నీడ్స్‌ వర్సెస్‌ గ్రీడ్‌
→ ‘ఇవ్వాళ ఖర్చు చేశాం. రేపు సంపాదిస్తాం’ అనే నిర్లక్ష్య ధోరణి వీడి... ఎందుకు ఖర్చు చేశాం? అనవసర ఖర్చా? అవసరమైన ఖర్చా? ఈ విషయాలు ఎప్పటికప్పుడూ విశ్లేషించుకుంటే వృథా ఖర్చులను గణనీయంగా తగ్గించుకోవచ్చు. ‘ఎమోషనల్‌ పర్చేజింగ్‌’కు దూరంగా ఉండాలి.

→ త్రీ–బకెట్‌ (మూడు ఖాతాల) విధానాన్ని అమలు చేయాలి.
1. ఇన్‌కామ్‌ ఎకౌంట్‌ (అన్ని రకాల నగదు రాబడుల కోసం)

2. ఖర్చుల ఖాతా–స్పెండ్‌ ఇట్‌ ఎకౌంట్‌ (నెలవారీ ఖర్చుల కోసం)

3. పెట్టుబడుల ఖాతా: ఇన్వెస్ట్‌–ఇట్‌ ఎకౌంట్‌ (పొదుపు, పెట్టుబడుల కోసం) త్రీ–బకెట్‌ సిస్టమ్‌ను అమలు చేసిన మూడు నెలల లోపు మనకు అవసరమైన ఖర్చులు, అనవసరమైన ఖర్చుల గురించి ఒక అవగాహన వస్తుంది.

→ పొదుపు పద్దతులను అలవాటు చేసుకోవడానికి మొదట్లో సమయం పట్టవచ్చు. పొదుపు విషయంలో క్రమబద్ధమైన విధానాన్ని అలవాటు చేసుకోవాలి. ఫలితాలు అద్భుతంగా ఉంటాయి.

→ జీవితం అన్నాక ఊహించని ఖర్చులు ఉంటాయి. అలాంటి సందర్భాలో ఎవరినో అప్పు అడిగే బదులు, ఇబ్బందులు పడే బదులు అత్యవసర నిధి (ఎమర్జెన్సీ ఫండ్‌) తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి.
→ పొదుపు చేయడానికి, పెట్టుబడి పెట్టడానికి అవసరమైన డబ్బును సమకూర్చుకోవాలంటే క్యాష్‌ ఫ్లో సిస్టమ్‌ ఉండాలి. ఆ సిస్టమ్‌ను మనం సమగ్రంగా అర్థం చేసుకోవాలి.

→ డబ్బుకు ఒక నిర్దిష్ట ఉద్దేశాన్ని (లేబుల్‌)ను కేటాయించడం వల్ల దాన్ని ఇతర అవసరాలకు వాడకుండా నిరోధించవచ్చు.

నీటిని కూడా...
సాధారణంగా ఎండాకాలంలో మాట్లాడే నీటి పొదుపు గురించి వర్షాభావం పుణ్యమా అని ఈ కాలంలో కూడా తప్పనిసరిగా మాట్లాడుకోవాల్సి వస్తోంది. మన ఇంట్లో నీటి పొదుపుకు కొన్ని మార్గాలు...

→ చాలా నగరాల్లో నీరు వృథా కావడానికి కారణం... పళ్లు తోముకునేటప్పుడు, ముఖం కడిగేటప్పుడు, గిన్నెలు కడిగేటప్పుడు కుళాయిని మూసివేయకపోవడం. దీన్ని నివారించడానికి కుళాయి తెరిచిన ప్రతీసారి అప్రమత్తంగా ఉండాలి. నీరు వృథా కాకుండా చూడాలి.

→ కుళాయిల నుండి నీరు వృథాగా పోయే సమస్యకు వాటర్‌ ఏరేటర్‌లు ఒకే ఒక్క పరిష్కార మార్గం. సాధారణ కుళాయిలతో పోలిస్తే 
ఏరేటర్‌లు నిమిషానికి దాదాపు 35–40 శాతం నీటిని ఆదా చేస్తాయి.

→ తడి చెత్తను ఎరువుగా మార్చే ప్రక్రియ కంపోస్టింగ్‌. పట్టణ ప్రాంతాలలో మిద్దెతోటలు ప్రాచుర్యం పొందుతుండడం వల్ల మొక్కలు ఉన్న ఇళ్లలో నీటి వినియోగం పెరిగింది.  కంపోస్టింగ్‌ ఎరువును ఉపయోగించడం ద్వారా తక్కువ నీరు అవసరమవుతుంది.

→ షవర్‌హెడ్స్‌ ద్వారా ఎన్నో లీటర్‌ల నీరు వృథా అవుతోంది. దీనికి బదులు ఒక బకెట్‌ నీటితో స్నానం చేస్తే మంచిది. సాధారణ షవర్‌హెడ్స్‌కు బదులుగా నీటిని ఆదా చేసే షవర్‌హెడ్స్‌ను అమర్చుకోవడం ద్వారా 80 శాతం వరకు నీటి వినియోగాన్ని తగ్గించుకోవచ్చు. ఇంధన వినియోగాన్ని కూడా తగ్గించుకోవచ్చు.

→ నీటిని పునర్వినియోగించుకోవడమే నీటి పొదుపుకు ఉత్తమ మార్గం. ఉదా: కూరగాయలు, పండ్లు కడిగిన నీటిని తోట పనులకు తిరిగి ఉపయోగించవచ్చు. కూరగాయలను ఆవిరిపై ఉడికించడానికి ఉపయోగించిన నీటిని పారబోస్తుంటాం. చల్లారిన తరువాత ఈ నీటిని మొక్కలకు తిరిగి పోయడానికి ఉపయోగించవచ్చు. వంట నీటిని తిరిగి ఉపయోగించడం అనేది వ్యర్థాలను తగ్గించే సులభ మార్గం. మొక్కలకు సహజమైన బలాన్ని కూడా ఇస్తుంది.

→ కండెన్సేషన్‌ ట్రేలు ఉన్న డిహ్యూమిడిఫైయర్‌లు, రిఫ్రిజిరేటర్‌లు నీటిని గ్రహిస్తాయి. ఈ నీటిని మురుగు కాలువలో పారబోయడానికి బదులుగా ఫ్లోర్‌ను శుభ్రం చేయడానికి, టాయిలెట్లను ఫ్లష్‌ చేయడానికి, మొక్కలకు నీరు పోయడానికి తిరిగి ఉపయోగించవచ్చు.

→ కూరగాయలు, పండ్లు కడిగేటప్పుడు చాలా నీరు వృథా అవుతుంది. దీనికి బదులుగా ఒక గిన్నె లేదా బేసిన్‌ను ఉపయోగించడం ద్వారా నీటి వృథాను అరికట్టవచ్చు.

→ వంటగదులు, బాత్రూమ్‌లలో పుష్‌–బటన్‌ కుళాయిలు లేదా మోషన్‌–సెన్సార్‌ కళాయిలను అమర్చడం ద్వారా నీటి వృథాను గణనీయంగా తగ్గించవచ్చు. ఈ కుళాయిలు వాటంతట అవే ఆగిపోతాయి. చేతులు కడుక్కోవడం, పళ్లు తోముకోవడం...మొదలైన వాటికి సంబంధించి నీటి వాడకాన్ని పరిమితం చేయడానికి చిన్న ట్యాప్‌ టైమర్స్‌ ఉపయోగపడతాయి.

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement