న్యూఢిల్లీ: ఢిల్లీలో కాక్రోచ్ జనతా పార్టీ (సీజేపీ) నిర్వహిస్తున్న నిరసన కార్యక్రమాన్ని కవర్ చేసేందుకు వెళ్లిన పలువురు జర్నలిస్టులను పోలీసులు నిర్బంధించారు. విధుల్లో ఉన్న మీడియా ప్రతినిధులను సైతం అదుపులోకి తీసుకోవడంపై ప్రశ్నలు తలెత్తాయి. నిరసన కార్యక్రమానికి సంబంధించిన వార్తలను సేకరిస్తున్న సమయంలో జర్నలిస్టులను అడ్డుకోవడం, వారి పరికరాలను స్వాధీనం చేసుకోవడం వంటి చర్యలు మీడియా స్వేచ్ఛపై చర్చకు దారితీశాయి.
ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సీజేపీ నిరసనకు పిలుపునిచ్చిన విషయం తెలిసిందే. ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్‌ఐఆర్) ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణల నేపథ్యంలో ఈ ఆందోళనకు పిలుపునిచ్చింది.
నిరసన నేపథ్యంలో ఢిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేసిన పోలీసులు పలువురు ఆందోళనకారులను, నాయకులను అదుపులోకి తీసుకున్నారు. ఈ క్రమంలో వార్తల సేకరణకు వెళ్లిన జర్నలిస్టులు కూడా నిర్బంధానికి గురయ్యారు. న్యూస్‌లాండ్రీకి చెందిన ముగ్గురు విలేకరులు, స్క్రోల్‌కు చెందిన జర్నలిస్టు అయుష్ తివారీ సహా పలువురు మీడియా ప్రతినిధులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు ఆయా మీడియా సంస్థలు వెల్లడించాయి. న్యూస్‌లాండ్రీ విలేకరుల ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని ఆ సంస్థ తెలిపింది.
ఇదీ చదవండి: సీజేపీ ఫౌండర్ అభిజీత్ దీప్కే ఇంట్లో తీవ్ర విషాదం
తాము జర్నలిస్టులమని గుర్తింపు కార్డులు చూపించినప్పటికీ పోలీసులు తమను విడిచిపెట్టలేదని కొందరు మీడియా ప్రతినిధులు ఆరోపించారు. మరోవైపు, నిరసన కార్యక్రమాలను కవర్ చేసే జర్నలిస్టులు ఆందోళనకారులకు దూరంగా ఉండాలని ఢిల్లీ పోలీసులు గతంలో సూచించారు. కొందరు మీడియా ప్రతినిధులు ఆందోళనల్లో పాల్గొంటూ పోలీసుల విధులకు ఆటంకం కలిగిస్తున్నారని అధికారులు ఆరోపించారు.
ఈ ఘటనతో నిరసనలను కవర్ చేసే జర్నలిస్టుల భద్రత, విధుల నిర్వహణకు ఉన్న స్వేచ్ఛపై మరోసారి చర్చ మొదలైంది. ప్రజా శాంతి పరిరక్షణ చర్యలతో పాటు మీడియా ప్రతినిధులు స్వేచ్ఛగా వార్తలు సేకరించేందుకు అవకాశం కల్పించడంలో పోలీసులు ఎలాంటి వైఖరి అనుసరిస్తారన్నది కీలకంగా మారింది.


