ఢిల్లీలోని బీజేపీ కార్యాలయంలో అమిత్ షా, నితిన్ నబీన్‌లతో చేతులు కలిపిన బాదల్ తదితరులు
ఆరేళ్ల తర్వాత ఎన్డీయే గూటికి చేరిన శిరోమణి అకాలీదళ్
పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో కలిసికట్టుగా బరిలోకి
అకాలీదళ్‌కే పెద్దన్న హోదా.. సీఎం పదవీ ఆ పార్టీకే
కేంద్ర మంత్రి అమిత్ షా ప్రకటన
హిందూ–సిక్కు సోదరభావానికి కూటమి ప్రతీక అని వెల్లడి
బీజేపీతో కలిసి పంజాబ్ అభివృద్ధికి కృషి చేస్తాం
అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ స్పష్టికణ
సాక్షి, న్యూఢిల్లీ: పంజాబ్‌లో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న నేపథ్యంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆరేళ్ల విరామం తర్వాత బీజేపీ, శిరోమణి అకాలీదళ్(ఎస్‌ఏడీ) మళ్లీ చేతులు కలిపాయి. రాష్ట్రంలో వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో కలిసికట్టుగా పోటీ చేయాలని ఇరు పార్టీలు నిర్ణయించాయి. ఎన్డీయేలో అకాలీదళ్ తిరిగి చేరినట్లు కేంద్ర హోం మంత్రి అమిత్ షా ప్రకటించారు.
తమ కూటమిలో అకాలీదళ్‌దే పెద్దన్న పాత్ర అని, ముఖ్యమంత్రి పదవి ఆ పార్టీకే దక్కుతుందని స్పష్టం చేశారు. మొత్తం 117 అసెంబ్లీ స్థానాల్లో రెండు పార్టీ లు కలిసి పోటీ చేస్తాయని వెల్లడించారు. ఢిల్లీలో మంగళవారం బీజేపీ ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నబీన్, అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్‌బీర్ సింగ్ బాదల్ ఈ మేరకు పొత్తు ప్రకటన చేశారు.
అకాలీదళ్‌కు పెద్దన్న హోదా
అకాలీదళ్‌ను బీజేపీకి ‘అత్యంత పురాతన మిత్రపక్షం’గా అమిత్ షా అభివర్ణించారు. ఇరు పార్టీల మధ్య సంబంధం అటల్ బిహారీ వాజ్‌పేయి, ఎల్‌కే అద్వానీల కాలం నాటిదని గుర్తుచేశారు. దేశమంతా పవిత్ర గురుపర్వ్ వేడుకలు జరుపుకుంటున్న తరుణంలో అకాలీదళ్ మరోసారి ఎన్డీయేలోకి తిరిగి రావడం భాగస్వామ్య పక్షాలకు ఎంతో ఆనందం కలిగిస్తోందని అన్నారు. పంజాబ్‌లో అకాలీదళ్ పార్టీ యే పెద్దన్న పాత్ర పోషిస్తుందని తేల్చిచెప్పారు. బడా భాయ్ హీ సీఎం హోతా హై(పెద్దన్నే ముఖ్యమంత్రి అవుతారు) అని వ్యాఖ్యానించారు.
పంజాబ్ ఎన్నికల్లో తమ కూటమి గెలిస్తే ముఖ్యమంత్రి పదవి అకాలీదళ్‌కే దక్కుతుందని వెల్లడించారు. అయితే, ఏ పార్టీ ఎన్ని స్థానాల్లో పోటీ చేయాలనే అంశంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు. సీట్ల సర్దుబాటుపై చర్చలు కొనసాగుతున్నాయని చెప్పారు. ఎన్డీయేలోకి మళ్లీ అకాలీదళ్ రావడం తమకు చాలా సంతోషంగా ఉందన్నారు. రెండు పార్టీల మధ్య బంధం రాజకీయాలకు అతీతమైనదని పేర్కొన్నారు. ప్రధాని మోదీ ఈ పరిణామంపై హర్షం వ్యక్తంచేశారని తెలిపారు.
‘‘పొత్తు నిర్ణయం గురించి మోదీకి తెలియజేసినప్పుడు ఆయన సంతోషం వ్యక్తం చేశారు. సుఖ్‌బీర్ సింగ్ బాదల్, నితిన్ నబీన్‌లకు ప్రధాని ఫోన్ చేసి మాట్లాడారు. బాదల్ సాహెబ్ పార్టీ లేకుండా ఎన్డీయే అసంపూర్ణంగా ఉంది. వారి రాకతో కూటమి సంపూర్ణమైంది’’అని ప్రధాని అన్నట్లు అమిత్ షా వివరించారు. తమ కూటమి హిందూ–సిక్కు సోదరభావానికి ప్రతీకగా నిలుస్తుందని చెప్పారు. పంజాబ్‌కే కాకుండా దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా ఈ ఐక్యతా సందేశం వెళ్లాలని వ్యాఖ్యానించారు.
2029 నాటికి డ్రగ్స్ రహిత పంజాబ్
పంజాబ్‌లో మాదక ద్రవ్యాల సమస్యను నిర్మూలించడమే కూటమి ప్రధాన లక్ష్యాల్లో ఒకటని అమిత్ షా ప్రకటించారు. 2029 డిసెంబర్ నాటికి పంజాబ్‌ను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చాలన్నదే తమ ఆశయమని తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించడంలో అధికార ఆమ్ ఆద్మీ పార్టీ తోపాటు గత కాంగ్రెస్ ప్రభుత్వాలు విఫలమయ్యాయని విమర్శించారు.
ఇది భావోద్వేగ బంధం: సుఖ్‌బీర్
బీజేపీతో పొత్తు కేవలం ఎన్నికల కోసం కుదిరిన రాజకీయ ఒప్పందం కాదని, ఇది పంజాబ్ ప్రయోజనాల కోసం ఏర్పడిన భావోద్వేగ బంధమని సుఖ్‌బీర్‌సింగ్ బాదల్ అన్నారు. తన తండ్రి ప్రకాశ్‌సింగ్ బాదల్, మాజీ ప్రధాని వాజ్‌పేయి ఈ బంధానికి పునాది వేశారని గుర్తుచేశారు. బీజేపీతో కలిసి పంజాబ్ అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. రాష్ట్రంలో డ్రగ్స్ సమస్య, గ్యాంగ్‌స్టర్ల కార్యకలాపాలు, అవినీతిని అరికట్టాల్సిన అవసరం ఉందన్నారు.
2020లో తెగిన బంధం.. ఆరేళ్లకు పునరేకీకరణ
బీజేపీ, అకాలీదళ్ మధ్య దాదాపు 24 ఏళ్లు కొనసాగిన పొత్తు 2020 సెప్టెంబర్‌లో ముగిసింది. కేంద్రంలో ఎన్డీయే ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ కూటమి నుంచి అకాలీదళ్ వైదొలిగింది. అనంతరం ఆ చట్టాలు రద్దయ్యాయి. 2022 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో రెండు పార్టీలు వేర్వేరుగా పోటీ చేయగా 117 స్థానాలకుగాను బీజేపీ రెండు, అకాలీదళ్ మూడు స్థానాల్లో మాత్రమే విజయం సాధించాయి.
వచ్చే ఏడాది జరిగే ఎన్నికల కోసం రెండు పార్టీలు మళ్లీ చేతులు కలపడం ప్రాధాన్యం సంతరించుకుంది. పొత్తు ప్రకటన వెలువడినప్పటికీ సీట్ల పంపకంపై స్పష్టత రావాల్సి ఉంది. బీజేపీకి దాదాపు 40 స్థానాలు కేటాయించే అవకాశం ఉందని ప్రచారం సాగుతోంది. అకాలీదళ్‌కు మిగిలిన స్థానాలు దక్కనున్నాయా? రెండు పార్టీ లు ఏయే స్థానాల్లో పోటీ చేస్తాయి? ఉమ్మడి ఎన్నికల ప్రణాళిక ఎలా ఉంటుంది? అన్న అంశాలపై తదుపరి చర్చల్లో స్పష్టత రానుంది.
చాలా సంతోషిస్తున్నా: ప్రధాని మోదీ
శిరోమణి అకాలీదళ్ మళ్లీ ఎన్డీయేలోకి రావడం పట్ల తాను చాలా సంతోషిస్తున్నానని, తమ కూటమికి పంజాబ్ ప్రజల పట్టంగట్టడం ఖాయమని మోదీ పేర్కొన్నారు. ‘‘పంజాబ్‌కు, పంజాబీ ప్రజల సంక్షేమానికే మా ప్రాధాన్యం. అకాలీదళ్ తిరిగి ఎన్డీయే కుటుంబంలో చేరడం, అది కూడా గురునానక్ దేవ్‌జీ జన్మదినం సందర్భంగా జరగడం ఎంతో సంతోషాన్నిస్తోంది. బీజేపీ, అకాలీదళ్‌లకు సహజమైన పొత్తు ఉంది. ఇది పంజాబ్‌కు సుపరిపాలనను అందిస్తుంది’’ అని ‘ఎక్స్’లో మోదీ పోస్టు చేశారు.
అధికారం కోసమే బీజేపీ–అకాలీదళ్ పొత్తు: కేజ్రీవాల్
బీజేపీ–అకాలీదళ్ పొత్తుపై ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్) జాతీయ కనీ్వనర్ అరవింద్ కేజ్రీవాల్ విమర్శలు గుప్పించారు. అధికారం కోసం బీజేపీ ఎవరితోనైనా చేతులు కలపగలదని ఆరోపించారు. రాజకీయ ప్రయోజనాలను కాపాడుకోవడానికి ఆ రెండు పార్టీలు పదేపదే కలిసి, మళ్లీ విడిపోయాయని ఆక్షేపించారు. పంజాబ్‌లో మహిళలు, షెడ్యూల్డ్ కులాలు, రైతులు, వ్యాపారులతోనే తమ పార్టీ పొత్తు పెట్టుకుందని చెప్పారు. తమ పొత్తు ప్రజలతోనే కొనసాగుతోందని, రాష్ట్ర అభివృద్ధి కోసం పనిచేస్తున్నామని తేల్చిచెప్పారు.
అది మోసగాళ్ల ఒప్పందం: భగవంత్
బీజేపీ–అకాలీదళ్ పొత్తు ను పంజాబ్ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ నేత భగవంత్ మాన్ థగ్ జోడ్(మోసగాళ్ల ఒప్పందం)గా అభివర్ణించారు. బీజేపీ–అకాలీదళ్ కూటమిని మళ్లీ నమ్మవద్దని ప్రజలకు పిలుపునిచ్చారు. వారు మళ్లీ పంజాబ్‌ను దోచుకోవడానికి సిద్ధమయ్యారని మండిపడ్డారు. ఈ మేరకు మంగళవారం వీడియో సందేశం విడుదల చేశారు.


