సాక్షి, చెన్నై: తమిళనాడులో అధికారంలో ఉన్న తమిళగ వెట్రి కళగం ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్న కూటమి పార్టీల ఎమ్మెల్యేలతో సీఎం విజయ్ సోమవారం సాయంత్రం సమావేశమయ్యారు. గ్రీన్ వేస్ రోడ్డులోని ముఖ్యమంత్రి విజయ్ క్యాంప్ నివాసంలో ఈ సమావేశం జరిగింది. అయితే, ఈ కీలక సమావేశానికి కాట్టుమన్నార్ కోవిల్ నియోజకవర్గ వీసీకే ఎమ్మెల్యే జ్యోతిమణి హాజరు కాలేదు. ఇందులో కాంగ్రెస్, వీసీకే, ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్ సీపీఐ, సీపీఎం పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు, అలాగే మన్నార్గుడి ఏఎంఎంకే ఎమ్మెల్యే కామరాజ్ పాల్గొన్నారు.
ప్రభుత్వానికి బయటి నుంచి మద్దతు ఇస్తున్న సీపీఎం, సీపీఐ గతంలో కూటమి సమావేశాలకు దూరంగా ఉన్నప్పటికీ, తాజాగా జరిగిన ఎమ్మెల్యేల సమావేశంలో మాత్రం రెండు పార్టీలకు చెందిన నలుగురు ఎమ్మెల్యేలు హాజరుకావడం గమనార్హం. ఈ సమావేశంలో తమ తమ నియోజకవర్గ సమస్యలకు సంబంధించి సీఎం విజయ్‌కు వినతులు సమర్పించామని, వాటిపై తగిన చర్యలు తీసుకుంటామని సీఎం హామీ ఇచ్చారని సమావేశానికి హాజరైన ఎమ్మెల్యేలు తెలిపారు.
రాజకీయ వర్గాల్లో ..
ఈ భేటి రాజకీయంగా చర్చకు దారి తీసింది. సొంతంగా మెజారిటీ రాకపోవడంతో కూటమి పార్టీల మద్దతుతో ప్రభుత్వాన్ని సీఎం విజయ్ నడుపుతున్నారు. విశ్వాస తీర్మానం జరిగి ఆరు నెలలు పూర్తవుతున్న నేపథ్యంలో, ఎప్పుడైనా మళ్లీ బలపరీక్ష ఎదురయ్యే అవకాశం ఉందని రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. త్వరలో ప్రభుత్వం కూలుతుందంటూ డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్ పదే పదే వ్యాఖ్యలు చేస్తూ రావడంగమనించ దగ్గ విషయం. అలాగే, ఎమ్మెల్యే బేరసారాలు తమిళనాట తీవ్ర చర్చలో ఉన్నాయి..ఈ నేపథ్యంలో గత వారం సీఎం విజయ్ తన పార్టీ ఎమ్మెల్యేలతో సుదీర్ఘంగా సమావేశమయ్యారు. తాజాగా కూటమి ఎమ్మెల్యేలతో నిర్వహించిన ఈ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది.


