రాజకీయ పార్టీ పెట్టనున్న హీరోయిన్‌ త్రిష? కొత్త సంస్థ ఏర్పాటు | CM Vijay Dhanush Now Trisha Fan Organisation Turns Political Front | Sakshi
Sakshi News home page

రాజకీయ పార్టీ పెట్టనున్న హీరోయిన్‌ త్రిష? కొత్త సంస్థ ఏర్పాటు

Nov 23 2026 4:18 PM | Updated on Nov 23 2026 4:22 PM

CM Vijay Dhanush Now Trisha Fan Organisation Turns Political Front

చెన్నై: సినీ నటి త్రిష రాజకీయాల్లోకి రావాలంటూ ఆమె అభిమానులు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. ఈ క్రమంలో తమిళనాడులోని తిరునెల్వేలి కేంద్రంగా ఆమె పేరుతో కొత్త సంస్థను ఏర్పాటు చేశారు. ‘ఇళయ పురట్చి తలైవీ త్రిష పేరవై’ (యువ విప్లవ నాయకురాలు త్రిష వేదిక) పేరుతో ఈ సంస్థను ప్రారంభించారు. అభిమానుల ఈ నిర్ణయం తమిళనాడు రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చకు దారితీసింది.

తిరునెల్వేలికి చెందిన త్రిష అభిమాని రాజగోపాల్ ఈ సంస్థను ప్రారంభించారు. సంస్థ సమన్వయకర్తగా వ్యవహరిస్తున్న ఆయన పేరుతో పాటు సంస్థకు సంబంధించిన చిహ్నాన్ని కూడా విడుదల చేశారు. పదవుల కోసం కాకుండా తమిళ ప్రజల హక్కుల కోసం ఈ వేదికను ఏర్పాటు చేసినట్లు ఆయన వెల్లడించారు. ప్రజా సంక్షేమ కార్యక్రమాలు, సామాజిక సేవా కార్యకలాపాలను చేపట్టడం సంస్థ ప్రధాన లక్ష్యమని తెలిపారు.

ఈ సంస్థ ఏర్పాటుకు త్రిష అనుమతి ఉందని ఆమె అభిమానులు చెబుతున్నప్పటికీ, ఆమె నుంచి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన వెలువడలేదు. సంస్థతో ఆమెకు అధికారిక సంబంధం ఉందా? లేదా అభిమానులు స్వచ్ఛందంగా ఈ వేదికను ఏర్పాటు చేశారా? అనే అంశంపై స్పష్టత లేదు.

ఇదిలా ఉండగా, దివంగత తమిళనాడు ముఖ్యమంత్రి జయలలితకు అభిమానులు ‘పురట్చి తలైవీ’ (విప్లవ నాయకురాలు) అనే బిరుదును ఉపయోగించేవారు. ఇప్పుడు త్రిష పేరుతో ఏర్పాటు చేసిన సంస్థలోనూ దాదాపు అదే తరహా బిరుదును చేర్చడం చర్చనీయాంశమైంది. గతంలోనూ త్రిష రాజకీయాల్లోకి రావాలంటూ తమిళనాడులో పలుచోట్ల పోస్టర్లు వెలిశాయి.

త్రిష 2004లో సన్ టీవీకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలోనూ తన రాజకీయ ఆకాంక్షల గురించి ఆసక్తికరంగా మాట్లాడారు. మరో పదేళ్లలో తమిళనాడు ముఖ్యమంత్రి కావాలని ఉందని అప్పట్లో ఆమె సరదాగా వ్యాఖ్యానించారు. ఇటీవల ఆ ఇంటర్వ్యూ మరోసారి సామాజిక మాధ్యమాల్లో చర్చకు వచ్చింది.

మరోవైపు, తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్‌తో త్రిషకు ఉన్న పరిచయం, ఇద్దరూ పలు బహిరంగ కార్యక్రమాల్లో కలిసి కనిపించడం కూడా రాజకీయ ఊహాగానాలకు కారణమవుతోంది. విజయ్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి కూడా త్రిష హాజరయ్యారు. అయితే, వీరిద్దరి మధ్య సంబంధాలపై వస్తున్న ప్రచారానికి అటు విజయ్‌గానీ, ఇటు త్రిషగానీ అధికారికంగా స్పందించలేదు.

ప్రస్తుతం ఈ సంస్థ అభిమానుల చొరవతోనే ప్రారంభమైనట్లు తెలుస్తోంది. త్రిష రాజకీయాల్లోకి వస్తారా? ఈ వేదికతో ప్రత్యక్షంగా అనుబంధం ఏర్పరచుకుంటారా? భవిష్యత్తులో విజయ్ నేతృత్వంలోని తమిళగ వెట్రి కళగంతో కలిసి పనిచేస్తారా? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement