ధనుష్‌ ‘ఓం’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌ | Dhanush OM Movie Review And Rating In Telugu | Sakshi
Sakshi News home page

ధనుష్‌ ‘ఓం’ మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌

Nov 20 2026 12:53 PM | Updated on Nov 20 2026 1:58 PM

Dhanush OM Movie Review And Rating In Telugu

టైటిల్‌: ఓం(O.M)
నటీనటులు: ధనుష్, మమ్ముట్టి, సాయి పల్లవి, శివాజీరాజా తదితరులు
దర్శకుడు: రాజ్‌కుమార్ పెరియసామి
సంగీతం: సాయి అభ్యంకర్
విడుదల తేది: నవంబర్‌  20, 2026

Sai Pallavi OM – Chapter 1 IPS officer Nithya Reddy1

కథేంటంటే..
ఆంధ్రప్రదేశ్‌-తమిళనాడు బార్డర్‌లో జరిగే  ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్యంలో కథ సాగుతుంది. 2014లో రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లో కొనసాగుతున్న ఎర్రచందనం అక్రమ రవాణా నెట్‌వర్క్‌ను నిర్వీర్యం చేసే బాధ్యతను స్పెషల్ టాస్క్‌ఫోర్స్‌ అధికారి  నిత్యారెడ్డి(సాయి పల్లవి) చేపడుతుంది. ఈ నెట్‌వర్క్‌ వెనుక ఉన్న అబ్దుల్‌ హమీద్‌ (నసీరుద్దీన్ షా)ను చేరుకోవడానికి.. అతని అనుచరుడైన బర్మా కార్తికేయన్‌ అలియాస్‌ సియా (మమ్ముట్టి) గ్యాంగ్‌లోకి ఓ వ్యక్తిని అండర్‌కవర్‌గా పంపించాలని నిర్ణయిస్తుంది.

ఈ ఆపరేషన్‌ కోసం పళని (ధనుష్‌)ను ఎంపిక చేస్తారు. ఫొటోగ్రాఫర్‌ తిరుకుమారన్‌గా మారి సియా గ్యాంగ్‌లోకి అడుగుపెట్టిన పళని.. క్రమంగా అతని నమ్మకాన్ని పొందుతాడు. అయితే పోలీస్‌ ఆపరేషన్‌ సాగుతున్న కొద్దీ.. పళని వ్యక్తిగత జీవితంలో అనేక సమస్యలు ఎదురవుతుంటాయి. భార్య(శ్రీలీల) విడాకులు ఇచ్చేందుకు రెడీ అవుతుంది.  దానికి గల కారణం ఏంటి?  సియా వెనుక ఉన్న అసలు నెట్‌వర్క్‌ ఏమిటి? తిరు అండర్‌  కవర్‌ పోలీసు అని తెలిసిన తర్వాత సియా ఏం చేశాడు? స్మగ్లింగ్‌ గ్యాంగ్‌ కారణంగా  నిత్యారెడ్డి కుటుంబానికి జరిగిన అన్యాయం ఏంటి?  ఆపరేషన్‌ని సక్సెస్‌  చేయడం కోసం నిత్యారెడ్డి చేసిన త్యాగం ఏంటి?  ఆపరేషన్‌ కారణంగా తిరుకు జరిగిన అన్యాయం ఏంటి? చివరకు  పళని తన మిషన్‌ను ఎలా  పూర్తి చేశాడు? అనేది తెలియాలంటే సినిమా చూడాల్సిందే. 

Sai Pallavi OM – Chapter 1 IPS officer Nithya Reddy11

ఎలా ఉందంటే..
2015లో తిరుపతి పరిసర ప్రాంతాల్లో జరిగిన కాల్పుల్లో 20 మంది తమిళ కూలీలు ప్రాణాలు కోల్పోయిన వాస్తవ ఘటనను ఆధారంగా చేసుకొని దానికి కొన్ని ఎమోషనల్‌ సన్నివేశాలను అల్లుకొని ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు దర్శకుడు రాజ్‌ కుమార్‌ . ఎర్రచందనం స్మగ్లింగ్‌, పోలీస్‌ ఆపరేషన్‌, వ్యక్తిగత సంఘర్షణలను కలిపి చెప్పే ప్రయత్నం చేశాడు. 

(చదవండి: 'ఆకాశంలో ఒక తార' మూవీ రివ్యూ అండ్‌ రేటింగ్‌)

అయితే కథలో పెద్దగా ట్విస్టులు లేకపోవడం.. కథనం కూడా రొటీన్‌ సాగడంతో కొంతవరకు సాగదీతగా అనిపిస్తుంది. ఫస్టాఫ్‌ కొంత నెమ్మదిగా సాగుతుంది. పాత్రల పరిచయాలు, స్మగ్లింగ్‌ వ్యవస్థ గురించి డీటెయిల్డ్‌గా చూపించడంతో అసలు కథనం నత్త నడకగా సాగుతున్నట్లుగా అనిపిస్తుంది. ధనుష్, మమ్ముట్టి మధ్య రిలేషన్ ఎస్టాబ్లిష్ చేయడానికి దర్శకుడు ఎక్కువ సమయం తీసుకున్నాడు. 

అయితే ఇంటర్వెల్‌  సీన్‌ మాత్రం సెకండాఫ్‌పై ఆసక్తిని పెంచుతుంది. ఇక ద్వితియార్థంలో అయిన ట్విస్టులు ఉంటాయని ఆశిస్తే.. అక్కడ కూడా నిరాశే. అంచనాలకు దగ్గట్లుగానే కథ, కథనం సాగుతుంది. పాత్రల మధ్య బంధాలను సహజంగా కాకుండా ఏదో ఇరికించినట్లుగా అనిపిస్తుంది.  ఎమోషనల్‌ సన్నివేశాలు కూడా అంతగా ఆకట్టుకోలేవు. పోలీసులకు, స్మగ్లర్ల మధ్య జరిగే పోరు కూడా ఉత్కంఠను రేకెత్తించదు. వాస్తవ ఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రంలో ఏకపక్ష ధోరణినే ఎక్కువగా కనిపించింది.

ఎవరెలా చేశారంటే..
ధనుష్‌  నటన గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఎలాంటి పాత్రలో అయినా ఒదిగిపోతాడు. అండర్‌ కవర్‌  పోలీసు తిరు పాత్రకు ఆయన పూర్తి న్యాయం చేశాడు. యాక్షన్‌తో పాటు ఎమోషనల్‌ సన్నివేశాల్లోనూ బాగా నటించాడు. నిత్యారెడ్డిగా సాయి పల్లవి పవర్‌ఫుల్‌ రోల్‌ చేసి మెప్పించింది. యాక్షన్‌ సీన్‌ కూడా బాగానే చేసింది. శ్రీలీల పాత్ర నిడివి తక్కువే అయినా.. తన పరిధిమేర బాగానే నటించింది. సియా పాత్రలో మమ్ముట్టి తెరపై హుందాగా కనిపించాడు. కానీ ఆయనలోని నటుడిని పూర్తిగా వాడుకోలేకపోయాడు. ఆ పాత్రను మరింత పవర్‌ఫుల్‌గా తీర్చిదిద్దితే బాగుండేదేమో. మిగిలిన నటీనటలులు తమ తమ పాత్రల పరిధిమేర చక్కగా నటించారు. 

సాంకేతికంగా సినిమా పర్వాలేదు. సాయి అభ్యంకర్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్‌  సినిమా స్థాయిని పెంచేసింది. పాటలు పర్వాలేదు. సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటర్‌ తన కత్తెరకు ఇంకాస్త పని చెప్పాల్సింది. సినిమాలో చాలా చోట్ల అనవసరపు సన్నివేశాలు ఉన్నాయి. వాటిని కట్‌ చేసిన నిడివి తగ్గిస్తే బాగుండేది. నిర్మాణ విలువలు ఉన్నతంగా ఉన్నాయి. 
-అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్‌

Rating:
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement