శబరిమల (కేరళ): పంబ నుంచి సన్నిధానం వరకు సాగే ప్రయాణం శబరిమల యాత్రికుల విశ్వాసానికి, సహనానికి ఒక పరీక్ష వంటిది. పత్తనంతిట్టలోని అడవిలో కొండపై ఉన్న ఆలయం చుట్టూ పర్వతాలు, దట్టమైన అడవులు ఉన్నాయి. కొండ దిగువన ఉన్న పంబ వరకు మాత్రమే వాహనాలను అనుమతిస్తారు. అక్కడి నుంచి సన్నిధానం వరకు సుమారు 5 కిలోమీటర్ల దూరం ఉంటుంది. కాలినడకన చేరుకోవడానికి రెండు నుంచి మూడు గంటల సమయం పడుతుంది. చాలా మంది భక్తులు ఒక్కసారి ఈ యాత్ర చేయడానికి ఎంతో కష్టపడతారు. కానీ, 68 ఏళ్ల శ్రీధరన్‌కు మాత్రం ఇది 27 ఏళ్లుగా నిత్యకృత్యం. ఏనుగులు, పులులు సంచరించే అటవీ ప్రాంతాల కొండ మార్గంలో ప్రతిరోజూ వెళ్లి వస్తుంటారు. శబరిమల ఆలయం భక్తుల కోసం మూసి ఉంచిన రోజుల్లోనూ, వేలాది మంది భక్తులతో కొండ మార్గం కిక్కిరిసిపోయినప్పుడు కూడా ఆయన కొండ ఎక్కి, దిగుతుంటారు.
వార్తా పత్రికలు అందించడానికి..
ఆలయ ప్రధాన పూజారితోపాటు మరో 14 మందికి వార్తా పత్రికలను అందించడానికి ఆయన ప్రతిరోజూ కొండ ఎక్కుతుంటారు. ఇక, భక్తులు వెళ్లే సీజన్‌లో సన్నిధానంలోని కార్యాలయాలు, దుకాణాలకు కలిపి దాదాపు 250 వార్తా పత్రికలను ఆయన చేరవేస్తుంటారు. ఉదయం 9 గంటలకు బయలుదేరి, సాయంత్రం 4 గంటల కల్లా తిరిగి పంపకు చేరుకుంటారు. ఏడాదికోసారి వచ్చే భక్తులు కొండ ఎక్కడానికి ఆపసోపాలు పడుతుంటే ఆయన మాత్రం.. యాత్ర సమయంలో జనసందోహంలోనూ ఎంతో వేగంగా కదులుతుంటారు. 68 ఏళ్ల వయస్సులో ఇంత నిటారుగా ఉండే కొండ మార్గాన్ని ఆయన అవలీలగా ఎక్కడం చూసి భక్తులు ఆశ్చర్యపోతుంటారు.
కొండ ఎక్కడం వల్లే ఆరోగ్యంగా ఉన్నా..
అదే మాట ఆయనతో అంటే.. ‘ఈ మార్గం నాకు బాగా అలవాటైంది. జీవనోపాధికి ఇది అవసరం అయితే, స్వామి అయ్యప్పను దర్శించుకోవడం నా అదృష్టం. ఎవరికీ ఎటువంటి ఇబ్బంది కలగకూడదని కోరుకుంటాను. ‘స్వామీ, మమ్మల్ని కాపాడండి’అని వేడుకుంటూ చుట్టూ ఉన్న అడవి జంతువుల గురించి మర్చిపోతాను. ఒకవేళ అవి ఎదురైనా, తిరిగి అడవిలోకి వెళ్లిపోతాయి’’అని చెబుతున్నారు. ప్రతిరోజూ కొండ ఎక్కడం వల్లే తాను ఆరోగ్యంగా ఉన్నానని, ఎప్పుడూ అలసట, ఎలాంటి అనారోగ్య సమస్యలు రాలేదని చెబుతారు. వార్తాపత్రికలు ప్రచురితం కాని రోజుల్లో, ఆయన అమర్‌నాథ్ యాత్రకు వెళ్ళినప్పుడు తప్ప, మిగిలిన అన్ని రోజుల్లోనూ ఆయన తప్పనిసరిగా కొండ ఎక్కుతుంటారు. అమర్‌నాథ్ యాత్రకు వెళ్ళినప్పుడు మాత్రమే ఆయన తన వార్తాపత్రికల పంపిణీ బాధ్యతను వేరొకరికి అప్పగిస్తారు. ప్రతిరోజూ కొండ ఎక్కే అలవాటు ఉండటం వల్లే, కశ్మీర్ లోని మంచుతో నిండిన పర్వతాలను అధిగమించడం తనకు సులభమైందని ఆయన నమ్ముతారు.
భయపెట్టిన అడవి ఏనుగు
ఓసారి శబరిపీఠం వద్ద ఒక అడవి ఏనుగు ఆయనను భయపెట్టింది. ఆ రాత్రే ప్రసవించిన తర్వాత అక్కడే పడుకుని ఉండిపోయింది. అటుగా వెళ్లిన శ్రీధరన్‌ను చూసి ఘీంకరించుకుంటూ వచ్చింది. భయపడిపోయిన శ్రీధరన్ కళ్లు మూసుకుని ప్రారి్థంచడం మొదలుపెట్టారు. ‘‘దేవుడా, ఇక అంతే, చిక్కుల్లో పడ్డా ‘అయ్యప్పా!’అని ప్రార్ధించా. ప్రార్థన పూర్తయ్యేసరికి, ఆ ఏనుగు ఎటు వెళ్ళిందో కూడా తెలియకుండా మాయమైపోయింది. ఇలాంటి అద్భుతాలు జరుగుతుంటాయి’’అంటూ తన అనుభవాలను పంచుకున్నారు.
ఎవరీ శ్రీధరన్?
వయనాడ్‌కు చెందిన శ్రీధరన్, ఒకప్పుడు వార్తాపత్రికల పంపిణీదారుగా పనిచేసేవారు. ఆయనకు 38 ఏళ్ల వయసున్నప్పుడు తల్లి మరణించింది. తీవ్ర దుఃఖంలో ఉన్న ఆయన కర్ణాటకలోని మూకాంబికా ఆలయానికి వెళ్లి, అక్కడ ఏడాదిన్నర పాటు మౌనవ్రతం పాటించారు. ఆ సమయంలోనే శబరిమల వెళ్లాలనే ఆలోచన వచి్చంది. 2000వ సంవత్సరంలో ఆయన శబరిమలకు చేరుకున్నారు, అప్పటి నుంచి పంబనే తన నివాసంగా మార్చుకున్నారు. ఆయనకు సొంత కుటుంబం అంటూ లేదు. బంధువులతో పెద్దగా సంబంధాలు లేవు.


