శబరిమల: కేరళలోని శబరిమలకు తరలివస్తున్న యాత్రికులకు అక్కడి సమస్త వివరాలను అందించేందుకు కేరళ అటవీ శాఖ ‘అయ్యన్ 4.0’ యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ను అటవీ శాఖ మంత్రి శిబు బేబీ జాన్ ప్రారంభించారు. మలయాళం, ఇంగ్లిష్, తెలుగు, తమిళం, కన్నడ, హిందీ భాషల్లో ఇది అందుబాటులో ఉంది. ఆన్‌లైన్‌తోపాటు ఆఫ్‌లైన్‌లోనూ పనిచేస్తుంది. ప్రధాన యాత్రా మార్గాలు, దూరాలు, పార్కింగ్ స్థలాలు, విశ్రాంతి కేంద్రాలు, దర్శన వేళలు, వాతావరణ సమాచారం, రవాణా సదుపాయాల వివరాలు ఇందులో ఉంటాయి.
అలాగూ అటవీ మార్గాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వన్యప్రాణుల నుంచి రక్షణ, పాముకాటు అత్యవసర ప్రథమ చికిత్స, యాంటీవెనమ్ అందుబాటులో ఉన్న ఆసుపత్రుల వివరాలనూ ఈ యాప్‌లో తెలుసుకోవచ్చు. అత్యవసర సహాయం, హెల్ప్‌లైన్ నంబర్లు, పోగొట్టుకున్న వస్తువుల గుర్తింపు సదుపాయాలు దీనిలో ఉన్నాయి. మరోవైపు భక్తుల రద్దీ, విశ్రాంతి కేంద్రాల వద్ద జనసాంద్రత, అటవీ మార్గాల్లో రాకపోకలను పర్యవేక్షించేందుకు అధికారులకు దీనిలో ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశారు. పెరియార్ టైగర్ రిజర్వ్ జీవవైవిధ్యం, వన్యప్రాణుల సమాచారాన్ని కూడా ఈ యాప్‌లో పొందుపరిచారు.
శబరిమల ఆలయ ద్వారాలు నవంబర్ 16న తెరుచుకున్నాయి. తొలుత భక్తుల రాక కొంత తక్కువగా ఉన్నప్పటికీ ప్రస్తుతం క్రమంగా పెరుగుతోంది. శుక్రవారం అత్యధికంగా 60,635 మంది స్వాములు దర్శనం చేసుకున్నారు. వర్చువల్ క్యూ ద్వారా 64 వేల మంది బుక్ చేసుకున్నారు. శనివారం సాయంత్రం 4 గంటల వరకు 46,266 మంది వచ్చారు. రానున్న రోజుల్లో రోజువారీ భక్తుల సంఖ్య 70 వేల నుంచి 80 వేలకు చేరుతుందని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు అంచనా వేస్తోంది. ఇప్పటికే అదనంగా 5 వేల వర్చువల్ క్యూ స్లాట్లకు అనుమతి ఇవ్వడంతో రోజుకు 85 వేల మంది వరకు దర్శనం చేసుకునే అవకాశం ఏర్పడింది. అదనంగా కేటాయించిన 5 వేల వర్చువల్ క్యూ టికెట్లను ఒకేసారి కాకుండా భారతీయ రైల్వే తత్కాల్ విధానంలో దశలవారీగా విడుదల చేయాలని దేవస్థానం బోర్డు నిర్ణయించింది.
ఇదీ చదవండి: శబరిమల: ఇక రోజుకు 85 వేల మందికి దర్శన భాగ్యం!


