పెళ్లయిన మరుసటి రోజే వధువు ప్రసవం.. | Newlywed Bride Woman Incident In TamilNadu | Sakshi
Sakshi News home page

పెళ్లయిన మరుసటి రోజే వధువు ప్రసవం..

Nov 22 2026 8:32 AM | Updated on Nov 22 2026 8:33 AM

Newlywed Bride Woman Incident In TamilNadu

సాక్షి, చెన్నై: ఎన్నో ఆశలతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన ఓ యువకుడికి వివాహమైన మరుసటి రోజే కోలుకోలేని షాక్‌ తగిలింది. పెళ్లైన 24 గంటల్లోనే నవవధువు బాత్రూమ్‌లో బిడ్డకు జన్మనివ్వడం, ఆ శిశువు మృతి చెందడం తమిళనాడులోని తిరునెల్వేలి జిల్లాలో తీవ్ర కలకలం రేపింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాలలోకి వెళితే..  తిరునెల్వేలి సమీపంలోని అరియకుళం లైన్‌ స్ట్రీట్‌కు చెందిన సెల్లయ్య కుమారుడు వెంకటేష్‌ (25) ఇటుకల బట్టిలో పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు.

ఇటీవల తాలయం సమీపంలోని ఏరల్‌కుడి పాళ్యంకి చెందిన పాల్‌ దురై కుమార్తె పిచ్చమ్మాళ్‌తో రెండురోజుల క్రితం స్థానికంగా ఉన్నæ ఆలయంలో అతనికి వివాహం జరిగింది. వివాహానంతరం వధూవరులు ఇంటికి చేరుకున్న తర్వాత, వధువు కడుపు కాస్త పెద్దగా ఉండటాన్ని గమనించిన వెంకటేష్‌ కుటుంబ సభ్యులు ఆరా తీశారు. తనకు కడుపు సంబంధిత సమస్య ఉందని, దానికోసం మందులు వాడుతుండటం వల్లే  ఉబ్బిందని పిచ్చమ్మాళ్‌ వారికి నమ్మబలికింది. 

మరుసటి రోజే బయటపడ్డ అసలు నిజం 
మొదటి రాత్రి గడిచిన తర్వాత, మరుసటి రోజు ఉదయం బాత్రూమ్‌కు వెళ్లిన పిచ్చమ్మాళ్‌కు అకస్మాత్తుగా తీవ్రమైన కడుపునొప్పి, రక్తస్రావం మొదలయ్యాయి. కంగారుపడిన వెంకటేష్‌  అతని సోదరి వెంటనే ఆమెను సమీపంలోని ప్రైవేట్‌ ఆసుపత్రికి తరలించారు. మరోవైపు, అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు బాత్రూమ్‌లోకి వెళ్లి చూడగా అక్కడ చనిపోయి ఉన్న ఆడ పసికందు కనిపించడంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. వెంటనే ఆ శిశువును తిరునెల్వేలి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పోస్ట్‌మార్టం నిర్వహించారు. ఈ వ్యవహారం తొలుత రెండు కుటుంబాల మధ్య తీవ్ర వివాదానికి దారి తీసింది. 

పోలీసుల దర్యాప్తులో విస్తుపోయే నిజాలు 
చివరకు తన భార్య పెళ్లికి ముందే గర్భవతి అయిన విషయాన్ని దాచిపెట్టి, తనను మోసం చేసి వివాహం చేసుకుందని వెంకటేష్‌ తిరునల్వేలి  పోలీసులకు  ఫిర్యాదు చేశాడు. దీనిపై పోలీసులు నమ్మకద్రోహం, గర్భస్రావానికి కారణమవడం వంటి సెక్షన్ల కింద పిచ్చమ్మాళ్‌పై కేసు నమోదు చేశారు. ప్రాథమిక విచారణలో విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి. 

పిచ్చమ్మాళ్‌ పెళ్లికి ముందే మరొకరిని ప్రేమించి 7 నెలల గర్భవతి అయిందని, అయితే ఆ ప్రేమను అంగీకరించని ఆమె తల్లిదండ్రులు  విషయాన్ని దాచిపెట్టి వెంకటేష్‌తో బలవంతంగా పెళ్లి జరిపించినట్లు తేలిసింది. గర్భంలో ఉన్న బిడ్డను వదిలించుకునేందుకు పిచ్చమ్మాళ్‌ గర్భస్రావ మాత్రలు వాడటం వల్లే నెలలు నిండకముందే ప్రసవం జరిగి, శిశువు మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. ప్రస్తుతం పిచ్చమ్మాళ్‌ ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, పోస్ట్‌మార్టం నివేదిక ఆధారంగా పోలీసులు కేసు దర్యాప్తును మరింత వేగవంతం చేశారు.  

 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement