Rajasthan: ఘోర రోడ్డు ప్రమాదాలు.. 12 మంది మృతి | Kota Udaipur National Highway Accident | Sakshi
Sakshi News home page

Rajasthan: ఘోర రోడ్డు ప్రమాదాలు.. 12 మంది మృతి

Nov 22 2026 7:43 AM | Updated on Nov 22 2026 7:50 AM

Kota Udaipur National Highway Accident

కోటా: రాజస్థాన్‌లో శనివారం అర్ధరాత్రి చోటుచేసుకున్న రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు తీవ్ర విషాదాన్ని మిగిల్చాయి. కోటా–ఉదయ్‌పూర్‌ జాతీయ రహదారిపై జరిగిన ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన తొమ్మిది మంది ప్రాణాలు కోల్పోయారు. మరో ఆరుగురు గాయపడ్డారు. జోధ్‌పూర్‌లో కారు, ట్రావెల్‌ టెంపో ఢీకొన్న ఘటనలో మరో ముగ్గురు మృతిచెందగా, 15 మంది గాయపడ్డారు. ఈ రెండు ప్రమాదాల్లో కలిపి 12 మంది మృత్యువాతపడగా, 21 మంది గాయాలపాలయ్యారు.

ట్రక్కును ఢీకొన్న క్రూయిజర్‌
కోటా–ఉదయ్‌పూర్‌ జాతీయ రహదారిపై శంభుపురా గ్రామ సమీపంలో రోడ్డు పక్కన నిలిపి ఉంచిన ట్రక్కును క్రూయిజర్‌ వాహనం బలంగా ఢీకొట్టింది. నాతా పోలీస్‌స్టేషన్‌ పరిధిలో అర్ధరాత్రి సమయంలో ఈ ప్రమాదం జరిగింది. వాహనంలో మొత్తం 16 మంది ప్రయాణిస్తున్నారు. వారిలో తొమ్మిది మంది అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతుల్లో చిన్నారులు కూడా ఉన్నారు.

డ్రైవర్‌కు కునుకు రావడంతోనే..
ఖాటూ శ్యామ్‌జీ ఆలయంలో దర్శనం చేసుకుని మహారాష్ట్రకు తిరిగి వెళ్తుండగా ఈ దుర్ఘటన చోటుచేసుకుంది. ప్రయాణ సమయంలో డ్రైవర్‌కు కునుకు రావడంతో వాహనంపై నియంత్రణ కోల్పోయినట్లు ప్రాథమిక సమాచారం. దీంతో క్రూయిజర్‌ అదుపుతప్పి రహదారి పక్కన నిలిపి ఉంచిన ట్రక్కును ఢీకొట్టింది. గాయపడిన ఆరుగురిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.

మృతదేహాలకు పోస్టుమార్టం
ప్రమాదంపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతుల వివరాలను గుర్తించేందుకు పోస్టుమార్టం నిర్వహిస్తున్నట్లు అదనపు జిల్లా కలెక్టర్‌ రాజేశ్‌ జోషి తెలిపారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

జోధ్‌పూర్‌లో మరో ప్రమాదం
ఇదే సమయంలో జోధ్‌పూర్‌లోనూ మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కారు, ట్రావెల్‌ టెంపో ఢీకొనడంతో ముగ్గురు ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మంది గాయపడ్డారు. క్షతగాత్రులను మథురాదాస్‌ మాథుర్‌ ఆసుపత్రికి తరలించారు.

గుజరాత్‌ నుంచి రామదేవరకు వెళ్తుండగా..
ప్రమాదంలో మరణించినవారు, గాయపడినవారు ఒకే కుటుంబానికి చెందినవారని ఆసుపత్రి సూపరింటెండెంట్‌ వెల్లడించారు. గుజరాత్‌ నుంచి రామదేవర దర్శనానికి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిపారు. ఒకే రోజు రాత్రి రెండు ప్రమాదాలు చోటుచేసుకోవడం రాజస్థాన్‌లో తీవ్ర విషాదాన్ని నింపింది.

ఇదీ చదవండి: ఇరాన్‌కు ట్రంప్ అల్టిమేటం.. ఇక శాశ్వత ఒప్పందమే!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement