వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్‌పై తన వైఖరిని మరోసారి స్పష్టం చేశారు. ఇరాన్‌లో పాలన మార్పు తమ ప్రధాన లక్ష్యం కాదని, ఆ దేశం అణ్వాయుధాలను తయారు చేయకుండా శాశ్వత ఒప్పందం కుదుర్చుకోవడమే తమ ఉద్దేశమని వెల్లడించారు. ఇరాన్‌తో కుదిరే ఒప్పందం తాత్కాలికంగా ఉండకూడదని, దీర్ఘకాలం అమల్లో ఉండాలని స్పష్టం చేశారు. అణ్వాయుధాలు కలిగి ఉండేందుకు ఇరాన్‌ను అనుమతించే ఒప్పందానికి తాము అంగీకరించబోమని హెచ్చరించారు.
‘ఫాక్స్ న్యూస్’కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేశారు. ఇరాన్‌లోని సీనియర్ నాయకత్వంపై జరిగిన దాడులు ఆ దేశంలో కీలక మార్పులకు దారితీశాయని పేర్కొన్నారు. ప్రస్తుతం అక్కడి కొత్త నాయకత్వం మరింత వాస్తవికంగా వ్యవహరిస్తోందని వ్యాఖ్యానించారు. అయితే గతంలో పలుమార్లు ఒప్పందాలు చేసుకుని వాటిని ఉల్లంఘించిన చరిత్ర ఇరాన్‌కు ఉందని ఆరోపించారు.
చమురు ధరలపైనా ఇరాన్ ప్రభావం
ఇరాన్‌తో చర్చల ఫలితంపైనే అమెరికాలో పెట్రోల్ ధరలు ఆధారపడి ఉంటాయని ట్రంప్ పేర్కొన్నారు. ఒప్పందానికి రావాలని ఇరాన్ కోరుకుంటున్నప్పటికీ, అమెరికాకు ఆమోదయోగ్యమైన నిబంధనలను ముందుకు తీసుకురావడం లేదని విమర్శించారు. గత 51 ఏళ్లుగా ఇరాన్ తమతో వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. నకిలీ ఒప్పందాలు కాకుండా నిజమైన, శాశ్వత పరిష్కారాన్ని కోరుకుంటున్నామని తెలిపారు.
మళ్లీ సైనిక చర్యలకు ఇజ్రాయెల్ ఒత్తిడి?
మరోవైపు పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఇరాన్‌పై మరోసారి సైనిక చర్యలు చేపట్టే అంశాన్ని పరిశీలించాలని ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు ట్రంప్ ప్రభుత్వాన్ని కోరినట్లు సమాచారం. ఒకవైపు దౌత్యపరమైన పరిష్కారానికి ఆసక్తి చూపుతున్నట్లు చెబుతూనే, మరోవైపు ఇరాన్ విషయంలో కఠిన వైఖరిని ట్రంప్ కొనసాగిస్తున్నారు. దీంతో అమెరికా-ఇరాన్ మధ్య చర్చలు ఏ మలుపు తిరుగుతాయన్నది అంతర్జాతీయంగా ఆసక్తికరంగా మారింది.
ఇదీ చదవండి: జమ్మూలో పాక్ యువకుడి కలకలం!


