న్యూఢిల్లీ: బంగారం కొనుగోళ్ల విషయంలో ప్రధాని నరేంద్ర మోదీ గతంలో చేసిన సూచన ఇప్పుడు సరైనదని నిరూపితమైందని ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ (సీటీఐ) పేర్కొంది. ఈ మేరకు ప్రధాని మోదీకి లేఖ రాసి కృతజ్ఞతలు తెలిపింది. కొన్ని నెలల క్రితం బంగారం కొనుగోళ్లకు దూరంగా ఉండాలని ఆయన దేశ ప్రజలకు సూచించినప్పుడు తీవ్ర వ్యతిరేకత ఎదురైందని, అయితే తాజాగా పసిడి ధరలు భారీగా తగ్గడంతో ఆయన ముందుచూపు అర్థమైందని సీటీఐ వెల్లడించింది.
కిలోకు రూ.65 లక్షల తగ్గుదల
సీటీఐ ఛైర్మన్ బృజేశ్ గోయల్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ప్రధాని మోదీ బంగారం కొనొద్దని సూచించిన సమయంలో కిలో ధర రూ.1.90 కోట్లుగా ఉంది. ప్రస్తుతం అది రూ.1.25 కోట్లకు పడిపోయింది. అంటే కిలో బంగారంపై ఏకంగా రూ.65 లక్షల తగ్గుదల నమోదైంది. అప్పట్లో ప్రధాని సూచనను పట్టించుకోకుండా వ్యాపారులు పెద్ద ఎత్తున బంగారం కొనుగోలు చేసి ఉంటే ఇప్పుడు భారీ నష్టాలను చవిచూడాల్సి వచ్చేదని గోయల్ వివరించారు.
లక్షలాదిమంది వ్యాపారులకు ఊరట
దేశవ్యాప్తంగా లక్షలాది నగల వ్యాపారులు నెలల తరబడి బంగారం నిల్వలు ఉంచుతుంటారు. అప్పట్లో కిలో రూ.1.90 కోట్ల ధర వద్ద పెద్ద మొత్తంలో కొనుగోలు చేసి ఉంటే ఇప్పుడు కోట్ల రూపాయల నష్టాలు ఎదురయ్యేవని సీటీఐ తెలిపింది. ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో బంగారం వ్యాపారం చేసే చిన్న వ్యాపారులతో పాటు స్టాక్ మార్కెట్ పెట్టుబడిదారులు కూడా నష్టాల నుంచి తప్పించుకున్నారని పేర్కొంది.
‘మోదీ మమ్మల్ని కాపాడారు’
సీటీఐ వ్యాపార వర్గాల గ్రూపుల్లో ప్రస్తుతం 'మోదీ మమ్మల్ని కాపాడారు' అంటూ సందేశాలు వస్తున్నాయని బృజేశ్ గోయల్ తెలిపారు. గతంలో ప్రధాని సూచనను వ్యతిరేకించిన వారే ఇప్పుడు ఆయన నిర్ణయాన్ని ప్రశంసిస్తున్నారని చెప్పారు. పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతున్న నేపథ్యంలో బంగారం ధరలు తగ్గడం సామాన్య వినియోగదారులకు కూడా ప్రయోజనం చేకూరుస్తోందన్నారు.
మార్కెట్‌పై ప్రభుత్వ మార్గదర్శకత్వం కోరిన సీటీఐ
బంగారం, వెండి మార్కెట్ల విషయంలో ప్రభుత్వం ఎప్పటికప్పుడు వ్యాపారులకు తగిన సూచనలు, మార్గదర్శకత్వం అందించాలని సీటీఐ ప్రధానిని కోరింది. తద్వారా ఊహాజనిత వ్యాపారం, అక్రమ నిల్వల వల్ల మార్కెట్‌లో సమస్యలు తలెత్తకుండా చూడవచ్చని అభిప్రాయపడింది. ప్రధాని సూచన కేవలం సలహా మాత్రమే కాదని, లక్షలాది కుటుంబాల పెట్టుబడులను కాపాడిందని పేర్కొంటూ వ్యాపార సమాజం తరఫున కృతజ్ఞతలు తెలిపింది.
ఇదీ చదవండి: దేశంలో 32 నకిలీ యూనివర్సిటీలు.. ఒక్క రాజధానిలోనే..


