దేశంలో 32 నకిలీ యూనివర్సిటీలు.. ఒక్క రాజధానిలోనే.. | UGC Fake Universities list 32 | Sakshi
Sakshi News home page

దేశంలో 32 నకిలీ యూనివర్సిటీలు.. ఒక్క రాజధానిలోనే..

Nov 22 2026 11:42 AM | Updated on Nov 22 2026 11:46 AM

UGC Fake Universities list 32

న్యూఢిల్లీ: ఉన్నత విద్య అభ్యసించాలని ఆశపడుతున్న విద్యార్థులు అప్రమత్తంగా ఉండాలని యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ (యూజీసీ) హెచ్చరించింది. దేశవ్యాప్తంగా గుర్తింపు, డిగ్రీలు ప్రదానం చేసే చట్టబద్ధమైన అధికారం లేని 32 విద్యాసంస్థలను నకిలీ యూనివర్సిటీలుగా గుర్తించింది. ఈ మేరకు నవంబర్ 17న జారీ చేసిన ప్రకటనలో విద్యార్థులు, తల్లిదండ్రులు అడ్మిషన్లకు ముందు సంబంధిత విద్యాసంస్థల గుర్తింపు, చట్టబద్ధతను తప్పనిసరిగా పరిశీలించాలని సూచించింది.

12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో..
2026 ఫిబ్రవరిలో నవీకరించిన యూజీసీ జాబితా ప్రకారం 12 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో మొత్తం 32 నకిలీ విద్యాసంస్థలున్నాయి. 2023 మార్చిలో విడుదల చేసిన జాబితాలో ఈ సంఖ్య 20గా ఉండగా.. తాజాగా 32కు చేరింది. గతంలో గుర్తించిన 20 సంస్థల్లో 18 ఇప్పటికీ జాబితాలో కొనసాగుతున్నాయి. అంటే గతంలో గుర్తించిన వాటిలో 90 శాతం సంస్థలు తాజా జాబితాలోనూ ఉన్నాయి.

ఢిల్లీలోనే అత్యధికం
ఈ జాబితాలో దేశ రాజధాని ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. గతంలో ఎనిమిది నకిలీ విద్యాసంస్థలుండగా.. ప్రస్తుతం ఆ సంఖ్య 12కు పెరిగింది. పాత జాబితాలోని ఎనిమిదీ కొనసాగుతుండగా, కొత్తగా మరో నాలుగు చేరాయి. ఉత్తరప్రదేశ్‌లో నాలుగు సంస్థలను నకిలీ యూనివర్సిటీలుగా గుర్తించారు.

సుప్రీంకోర్టు ఆదేశాలతో హెచ్చరికలు
అనుమతులు లేని విద్యాసంస్థలపై ప్రజలను అప్రమత్తం చేయాలని 2026, అక్టోబరు 9న సుప్రీంకోర్టు యూజీసీని ఆదేశించింది. ఈ నేపథ్యంలోనే కమిషన్ తాజా ప్రకటన విడుదల చేసింది. ఒక విద్యాసంస్థ చట్టబద్ధంగా ఏర్పాటైందా? డిగ్రీలు ప్రదానం చేసే అధికారం ఉందా? అవసరమైన అనుమతులు పొందిందా? అనే అంశాలను పరిశీలించాలని సూచించింది. కేవలం ప్రకటనలు, వెబ్‌సైట్లు, బ్రోచర్లు, సామాజిక మాధ్యమాల్లో చేసే ప్రచారాన్ని నమ్మవద్దని స్పష్టం చేసింది.

చర్యలు తీసుకుంటున్నా కొనసాగుతున్న పేర్లు
నకిలీ యూనివర్సిటీల జాబితాలో కొన్ని సంస్థలు ఏళ్ల తరబడి కొనసాగుతుండటం వాటిపై తీసుకుంటున్న చర్యల ప్రభావంపై ప్రశ్నలు లేవనెత్తుతోంది. అయితే జాబితాలో పేరు కొనసాగుతున్నంత మాత్రాన అవి ప్రస్తుతం పనిచేస్తున్నట్లు లేదా చర్యలు తీసుకోలేదని భావించరాదని స్పష్టం చేసింది. ఆగస్టు 5న పార్లమెంటుకు ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో విద్యాశాఖ ఈ సంస్థలకు వివరణ కోరుతూ లేఖలు, నిబంధనల అమలు నోటీసులు, షోకాజ్ నోటీసులు, హెచ్చరికలు జారీ చేసినట్లు తెలిపింది. ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేయడంతో పాటు తగిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలను కోరినట్లు పేర్కొంది.

జాతీయ భద్రతకూ ముప్పు
నకిలీ విద్యాసర్టిఫికెట్ల వ్యవహారం కేవలం విద్యార్థుల భవిష్యత్తుకే పరిమితం కాదని, జాతీయ భద్రతపైనా ప్రభావం చూపే ప్రమాదముందని బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ సంస్థ మిలో వ్యవస్థాపకుడు, సీఈఓ కరణ్ భట్టి అభిప్రాయపడ్డారు. పశ్చిమ, దక్షిణ భారతదేశాల్లోని కొన్ని యూనివర్సిటీలు ఇష్టారాజ్యంగా డిగ్రీలు ప్రదానం చేస్తున్నాయని, వీటి వెనుక పెద్ద నెట్‌వర్క్ ఉండే అవకాశముందని ఆయన పేర్కొన్నారు.

ఇదీ చదవండి: ఎయిర్‌పోర్టులో హైడ్రామా.. ఇద్దరిని ఈడ్చుకెళ్లిన అధికారులు!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement