మెక్సికో సిటీ: అమెరికా ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలో ఉన్న కరుడుగట్టిన డ్రగ్ మాఫియా నాయకుడు ఎల్ చాపో ఇసిడ్రో అరెస్టుతో మెక్సికోలో హింస చెలరేగింది. ట్రక్కులకు నిప్పు పెట్టడం, హైవేలను దిగ్బంధించడం, భద్రతా బలగాలపై కాల్పులకు దిగడంతో పలు ప్రాంతాల్లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. పరిస్థితిని అదుపు చేసేందుకు సైనిక హెలికాప్టర్లను కూడా రంగంలోకి దించారు.
44 ఏళ్ల ఫౌస్టో ఇసిడ్రో మెజా ఫ్లోరెస్ అలియాస్ ఎల్ చాపో ఇసిడ్రోను శుక్రవారం అతడి సంస్థకు చెందిన మరో ఇద్దరు కీలక సభ్యులతో కలిసి అరెస్టు చేశారు. మెక్సికన్ సైన్యం, నేషనల్ గార్డ్ ప్రత్యేక బలగాలు అమెరికా నిఘా సంస్థల సమాచారంతో సంయుక్తంగా ఈ ఆపరేషన్ నిర్వహించాయి. ఈ సందర్భంగా భద్రతా బలగాలపై కాల్పులు, పేలుడు పదార్థాలతో దాడులు జరిగినట్లు రక్షణ శాఖ వెల్లడించింది.
అరెస్టు అనంతరం కార్టెల్ సభ్యులు పలు ప్రాంతాల్లో విధ్వంసానికి దిగారు. ట్రక్కులు, ఇతర వాహనాలను తగులబెట్టి రహదారులను మూసివేశారు. దీంతో వాహనదారులు మధ్యలోనే చిక్కుకుపోయారు. సైనిక హెలికాప్టర్ల నుంచి కూడా కాల్పులు జరిపిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి.
గువాసావేలో బేస్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగా కాల్పుల శబ్దాలు వినిపించడంతో నిర్వాహకులు పోటీని రద్దు చేశారు. ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రావద్దని అధికారులు హెచ్చరించారు. మెజా ఫ్లోరెస్‌పై కొకైన్, హెరాయిన్, మెథాంఫెటమైన్, గంజాయి అక్రమ రవాణాలో కీలక పాత్ర పోషించినట్లు ఆరోపణలున్నాయి. 2025లో ఎఫ్‌బీఐ అతడిని మోస్ట్ వాంటెడ్ జాబితాలో చేర్చి, ఆచూకీ తెలిపిన వారికి 50 లక్షల డాలర్ల బహుమతి ప్రకటించింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ డ్రగ్స్ అక్రమ రవాణాపై చర్యలు తీసుకోవాలని మెక్సికోపై ఒత్తిడి పెంచుతున్న నేపథ్యంలో ఈ అరెస్టు ప్రాధాన్యత సంతరించుకుంది. గతంలో ఎల్ మెంచో మరణం తర్వాత కూడా మెక్సికోలో ఇదే తరహా హింస చెలరేగింది.
ఇదీ చదవండి: Nigeria: పడవ ప్రమాదం.. 24 మంది జలసమాధి


