రష్యా కోసం గూఢచర్యం చేశారనే అనుమానంతో బ్రిటన్‌లో అరెస్టయిన అమెరికా ఆర్మీ అధికారి ప్రస్తుతం అమెరికా మిలిటరీ కస్టడీలోకి వెళ్లారు. 41 ఏళ్ల సీనియర్ సైనిక అధికారిని గత వారం గ్లౌసెస్టర్ సమీపంలో బ్రిటన్ ఉగ్రవాద నిరోధక పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ విషయాన్ని బ్రిటన్ కౌంటర్ టెర్రరిజం పోలీసులు తెలిపారు.
సదరు అధికారి గ్లౌసెస్టర్‌షైర్‌లోని ఇన్స్‌వర్త్ ప్రాంతంలో ఉన్న ఇమ్జిన్ బ్యారక్స్‌లో విధులు నిర్వహిస్తున్నట్లు బీబీసీ తెలిపింది. ఈ బ్యారక్స్ నాటోకు చెందిన అలైడ్ ర్యాపిడ్ రియాక్షన్ కార్ప్స్ ప్రధాన కార్యాలయంగా పనిచేస్తోంది. అయితే, జాతీయ భద్రతకు సంబంధించిన సమాచారాన్ని సేకరించడం, బయటపెట్టడం, విదేశీ నిఘా సంస్థకు సహకరించడం వంటి ఆరోపణలపై బ్రిటన్ నేషనల్ సెక్యూరిటీ యాక్ట్–2023 కింద ఆయనను అరెస్టు చేశారు.
దీంతో ఈ కేసు దర్యాప్తును అమెరికా భాగస్వామ్య సంస్థలకు అప్పగించినట్లు బ్రిటన్ కౌంటర్ టెర్రరిజం విభాగం అధిపతి లారెన్స్ టేలర్ తెలిపారు. ఇవి అత్యంత తీవ్రమైన ఆరోపణలని, గూఢచర్య కార్యకలాపాలపై అనుమానాలు వస్తే వేగంగా కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. అలాగే, ఎఫ్‌బీఐ డైరెక్టర్ కాష్ పటేల్ మాట్లాడుతూ.. ఎఫ్‌బీఐ, అమెరికా ఆర్మీ, బ్రిటన్ సంస్థల సమన్వయంతోనే ఈ అరెస్టు జరిగిందన్నారు.
మరోవైపు, దేశ భద్రతకు ముప్పు కలిగించే చర్యలను సహించబోమని కాష్ పటేల్ హెచ్చరించారు. అమెరికా బ్రిగేడియర్ జనరల్ సీన్ స్టించన్ కూడా ఈ ఘటన సైనికులందరికీ గట్టి హెచ్చరికగా నిలవాలని పేర్కొన్నారు. తోటి సైనికుల నమ్మకాన్ని వమ్ము చేసి, దేశ రక్షణకు ముప్పు కలిగించే వారిని గుర్తించి న్యాయం జరిగేలా చూస్తామని స్పష్టం చేశారు. అయితే, అమెరికా అధికారి రష్యా కోసం గూఢచర్యం చేశారనే ఆరోపణలు ఇంకా దర్యాప్తులోనే ఉన్నాయి.
ఇదీ చదవండి: బోర్డు పిలిస్తే వచ్చేస్తా.. జెన్సన్ హువాంగ్ కీలక వ్యాఖ్యలు!


