10 సెకన్లలో బర్త్‌ సర్టిఫికెట్‌ | Gang issuing fake birth and death certificates busted | Sakshi
Sakshi News home page

10 సెకన్లలో బర్త్‌ సర్టిఫికెట్‌

Nov 12 2026 4:45 AM | Updated on Nov 12 2026 4:46 AM

Gang issuing fake birth and death certificates busted

నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాల ముఠా గుట్టురట్టు 

ముగ్గుర్ని అరెస్ట్‌ చేసిన సైబరాబాద్‌ ఎస్‌ఓటీ పోలీసులు 

తెలుగు రాష్ట్రాలతోపాటు యూపీ, కర్ణాటక, ఒడిశా సర్టిఫికెట్లు కూడా తయారీ

సాక్షి, హైదరాబాద్‌: టెలిగ్రామ్‌ లింకులు, నకిలీ వెబ్‌సైట్ల ద్వారా జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను కేవలం 10 సెకన్లలో సృష్టించి విక్రయిస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఏడాది కాలంగా వ్యవస్థీకృత కార్యకలాపాలు సాగిస్తున్న ఈ గ్యాంగ్‌ తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తోపాటు ఉత్తరప్రదేశ్, కర్ణాటక, ఒడిశా రాష్ట్రాలకు చెందిన నకిలీ సర్టిఫికెట్లను కూడా తయారు చేసింది. ఈ వ్యవహారంలో సైబరాబాద్‌ స్పెషల్‌ ఆపరేషన్‌ టీం (ఎస్‌ఓటీ) ఆర్సీపురం జోన్‌ పోలీసులు ముగ్గరిని అరెస్ట్‌ చేశారు. వీరి నుంచి 72 నకిలీ సర్టిఫికెట్లతోపాటు ప్రింటర్, కంప్యూటర్లను స్వాధీనం చేసుకున్నారు. రహమత్‌నగర్‌కు చెందిన మహమ్మద్‌ యాహ్యా యూసుఫ్‌గూడలో ఆన్‌లైన్‌ సర్వీసెస్‌ కేంద్రాన్ని నడుపుతున్నాడు.

ఈ ముఠాలో ఇతనే ప్రధాన నిందితుడు. కుత్బుల్లాపూర్‌కు చెందిన ఎండీ సలీం కరపత్రాల తయారీకి కస్టమర్లను వెతికే ఏజెంట్‌. యూసుఫ్‌గూడకు చెందిన పి.వెంకటేశ్‌ మీసేవ ఆపరేటర్‌గా పనిచేస్తూ, నకిలీ సర్టిఫికెట్ల ప్రింటింగ్‌కు అసలైన మీసేవ లెటర్‌హెడ్స్, పేపర్లు నిందితులకు అప్పగిస్తూ అక్రమంగా డ బ్బు సంపాదించేవాడు. ఈ ముగ్గురు ముఠాగా ఏర్పడి.. నకిలీ జనన, మరణ ధ్రువీకరణ పత్రాలను సృష్టించి డబ్బు సంపాదించాలని నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో ప్రధాన నిందితుడు మహమ్మద్‌ యాహ్యా గతేడాది టెలిగ్రామ్‌లో ‘సీఆర్‌ఎస్‌ ప్రింట్‌ పోర్టల్‌’అనే పేజీ ద్వారా నకిలీ సర్టిఫికెట్లు సృష్టించే  https://dccertificate.com, https://cer&verify.com,  https://crs&dc.com , 3 వెబ్‌సైట్‌ లింకులను కనుగొన్నాడు.  

రూ.25 ఖర్చు.. రూ.3,000 వసూలు  
ఆయా నకిలీ పోర్టల్‌లోని వాలెట్‌ సదుపాయాన్ని ఉపయోగించి భారతదేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన నకిలీ సర్టిఫికెట్లను యాహ్యా సృష్టించేవాడు. దీనికి అతనికి కేవలం రూ.25 మాత్రమే ఖర్చయ్యేది. కానీ, నిందితుడు సలీం సహాయంతో కస్టమర్ల నుంచి ఒక్కో సర్టిఫికెట్‌కు రూ.3 వేల వరకు వసూలు చేసేవారు. ఈ మొత్తంలో ఎండీ సలీం తన కమీషన్‌గా రూ.500 ఉంచుకోగా, మిగిలిన రూ.2,500 యాహ్యాకు చెల్లించేవాడు. కస్టమర్ల వివరాలను సలీం అందించగానే యాహ్యా నకిలీ సర్టిఫికెట్‌ సిద్ధం చేసి ఇచ్చేవాడు.

తెలుగు రాష్ట్రాలతో పాటు పొరుగున కూడా.. 
గత ఏడాది కాలంలో నిందితులు 72 జనన ధ్రువీకరణ పత్రాలు సృష్టించారు. ఇందులో తెలంగాణకు చెందినవి 60, ఏపీ 9, కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా రాష్ట్రాలకు చెందినవి ఒక్కోటి ఉన్నాయి.  వెబ్‌సైట్ల వెనుక ఉన్న అసలు సూత్రధారులు, ఆర్థిక లావాదేవీలపై ఆరా తీసేందుకు ఈ కేసును సైబర్‌ క్రైమ్‌ పోలీసులకు అప్పగించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement