మౌలానా అబుల్ కలాం చిత్రపటం వద్ద అంజలి ఘటిస్తున్న సీఎం రేవంత్. చిత్రంలో అజహరుద్దీన్, పొంగులేటి
మూసీ రివర్ ఫ్రంట్ పరిసరాల్లో నైట్ ఎకానమీ అభివృద్ధి
జాతీయ విద్య, మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో సీఎం రేవంత్‌రెడ్డి
సాక్షి, హైదరాబాద్: దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మైనారిటీలకు కల్పించిన నాలుగు శాతం రిజర్వేషన్లకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని, తొలగించే ప్రసక్తే లేదని సీఎం రేవంత్‌రెడ్డి స్పష్టం చేశారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ బంజారా భవన్‌లో నిర్వహించిన జాతీయ విద్య, మైనారిటీ సంక్షేమ దినోత్సవంలో సీఎం పాల్గొని ప్రసంగించారు. ఇటీవల ఢిల్లీ నుంచి వచ్చిన ఒకరు తెలంగాణలో తమ ప్రభుత్వం ఏర్పడగానే మైనారిటీల రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించారని, ఇలాంటి బాటసారులు వస్తుంటారు.. పోతుంటారు తప్ప వారిని ఎవరూ పట్టించుకోరని ఎద్దేవా చేశారు.
విద్యారంగానికి బలమైన పునాది
దేశంలో విద్యారంగానికి బలమైన పునాది వేసింది మౌలానా అబుల్ కలాం ఆజాద్ అని, ఆయన ఆలోచనలోనే ఐటీఐ సంస్థలు ఏర్పాటయ్యాయని సీఎం రేవంత్‌రెడ్డి గుర్తు చేశారు. మైనారిటీ యువతలో ఉన్న నైపుణ్యాలను పెంపొందించడానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలా ప్రభుత్వం సహాయసహకారాలు అందిస్తుందని సీఎం చెప్పారు.
త్వరలోనే మూసీ రివర్ ఫ్రంట్ పనులు
మూసీ రివర్ ఫ్రంట్ పనులు త్వరలోనే ప్రారంభం కాబోతున్నాయని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. మూసీ రివర్ ఫ్రంట్ పరిసరాల్లో నైట్ ఎకానమీ కార్యకలాపాలను విస్తరించడం ద్వారా స్థానిక యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని చెప్పారు. గౌలిగూడ నుంచి చాంద్రాయణగుట్ట వరకు మెట్రో విస్తరణ పనులు వచ్చే రెండు నెలల్లో ప్రారంభం కానున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రులు అజహరుద్దీన్, పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారులు మహమ్మద్ అలీ షబ్బీర్, వి. హనుమంతరావు, ఎంపీలు వేం నరేందర్‌రెడ్డి, అనిల్‌కుమార్‌యాదవ్, టెమ్రీస్ వైస్ చైర్మన్–ప్రెసిడెంట్ ఫహీం ఖురేషీ, మైనారిటీ సంక్షేమ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ అహ్మద్ నదీమ్, కార్యదర్శి షఫీయుల్లా, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ప్రియాంక ఆలా పాల్గొన్నారు.
ప్రతిభకు పురస్కారాలు
మౌలానా అబుల్ కలాం ఆజాద్ పేరిట అందించే జాతీయ స్థాయి పురస్కారాన్ని తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుడు, ప్రొఫెసర్ అమీర్ ఉల్లాఖాన్‌కు ప్రదానం చేశారు. మఖ్దూం మొహియుద్దీన్ పేరిట రాష్ట్ర స్థాయి పురస్కారాన్ని రిటైర్డ్ తహసీల్దార్ ఖమర్ సుల్తానాకు ప్రదానం చేశారు. తెల ంగాణ మైనారిటీ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటీ పరిధిలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి సీఎం అవార్డులు అందజేసి అభినందించారు.


