ఇంటర్‌ బోర్డు రదు | Telangana govt has decided to abolish the Intermediate Board starting next year | Sakshi
Sakshi News home page

ఇంటర్‌ బోర్డు రదు

Nov 12 2026 4:23 AM | Updated on Nov 12 2026 4:29 AM

Telangana govt has decided to abolish the Intermediate Board starting next year

ఆ స్థానంలో సీనియర్‌ సెకండరీ విధానం

విద్యాశాఖ సమీక్షలోముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి 

పాఠశాల విద్యలో ఇంటర్మీడియెట్‌ విద్య విలీనం 

9 నుంచి 12వ తరగతి వరకూ కొనసాగింపు 

డ్రాపౌట్స్‌ తగ్గించేందుకే ఈ మార్పు 

కార్మిక శాఖ ‘శక్తి’ పరిధిలోకి పాలిటెక్నిక్‌ విద్య 

సాక్షి, హైదరాబాద్‌: వచ్చే ఏడాది నుంచి ఇంటర్మీడియెట్‌ బోర్డును ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. దీని స్థానంలో సీనియర్‌ సెకండరీ విధానం కొనసాగించాలని అధికారులకు ప్రభుత్వం సూచించింది. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ఉన్న ఇంటర్‌ విద్యను పాఠశాల విద్యలో విలీనం చేయాల్సిన అవసరాన్ని సీఎం అధికారులకు వివరించారు. ఈ దిశగా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 

నర్సరీ నుంచి 4వ తరగతి వరకు ప్రాథమిక విద్య, 5 నుంచి 8వ తరగతి వరకు సెకండరీ, 9 నుంచి 12వ తరగతి వరకు సీనియర్‌ సెకండరీ విధానాన్ని అమలు చేయాలని స్పష్టం చేశారు.12వ తరగతి కల్లా విద్యార్థులు భాషా, సమాచార నైపుణ్యాలపై పూర్తి పట్టు సాధించేలా తీర్చిదిద్దాలన్నారు. 12వ తరగతి తర్వాత తమకు నచ్చిన సబ్జెక్టును ఎంచుకొని అందులో నిపుణులుగా మా రేందుకు విద్యార్థులకు అవకాశం ఉండాల న్నారు. 

టెన్త్‌ తర్వాత ఎక్కువ మంది విద్యార్థులు చదువు మానేస్తున్నారని, అందులో అత్యధికులు బాలికలు, దళిత, గిరిజన, మైనారిటీ వర్గాలకు చెందిన పిల్లలే ఉంటున్నారని సీఎం వివరించారు. అదే సమయంలో 12వ తరగతి వరకు కొనసాగుతున్న కేంద్రీయ, నవోదయ విద్యాలయాలు, కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో డ్రాపౌట్స్‌ సంఖ్య చాలా స్వల్పంగా ఉంటోందని తెలిపారు. దేశంలోని 18 రాష్ట్రాల్లో 12వ తరగతి వరకు విధానమే అమల్లో ఉందన్నారు. విద్యార్థుల ప్రయోజనాలే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం స్పష్టం చేశారు.  

నివేదిక మేరకు పాలిటెక్నిక్‌ విలీనం 
పాలిటెక్నిక్‌ విద్యను కార్మిక శాఖకు చెందిన ‘శక్తి’లో విలీనం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమీక్ష సమావేశంలో దీనిపై చర్చ జరిగింది. పాలిటెక్నిక్‌ కాలేజీల అప్‌గ్రేడ్‌కు అవసరమైన నిధులు మంజూరు చేస్తామని సీఎం చెప్పారు. శాఖాపరమైన సమస్యలు తలెత్తితే తన దృష్టికి తేవాలని అధికారులను ఆదేశించారు. నిజానికి పాలిటెక్నిక్‌ విద్యను శక్తిలో విలీనం చేసేందుకు కొన్ని నెలల క్రితమే ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది.

అయితే సాంకేతిక విద్య సిబ్బంది, విద్యార్థుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. ఈ క్రమంలో ప్రభుత్వం వాస్తవాలపై అధ్యయనానికి కమిటీని వేసింది. ఆ కమిటీ ఇటీవల ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. ఈ నివేదిక ఆధారంగా విలీనం ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సీఎం సూచించారు. ఐటీఐలను ఏటీసీలుగా అప్డేట్‌ చేసిన తర్వాత విద్యార్థుల నమోదు పెరగడంతో పాటు వాటిలో శిక్షణ పొందిన వారందరికీ ఉద్యోగాలు లభించాయని సీఎం తెలిపారు. 

నియామకాల వేగం పెంచండి 
యూనివర్సిటీల్లో అసిస్టెంట్, అసోసియేట్, ఇతర ప్రొఫెసర్ల నియామక ప్రక్రియను వేగవంతం చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలో సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ఎట్టి పరిస్థితుల్లోనూ అద్దె భవనాల్లో కొనసాగడానికి వీల్లేదని అన్నారు. పూర్తి వసతులతో సొంత భవనాలు నిర్మించడానికి అవసరమైన కార్యాచరణ వెంటనే ప్రారంభించాలని చెప్పారు. యంగ్‌ ఇండియా ఇంటిగ్రేటెడ్‌ రెసిడెన్షియల్‌ స్కూళ్ల నిర్మాణ పనులు నిర్దేశిత సమయంలో పూర్తి చేయాలని ఆదేశించారు. 

జూనియర్‌ కళాశాలల్లోని లెక్చరర్లు, బోధనేతర సిబ్బంది ఉద్యోగ, రిటైర్‌మెంట్‌ బెనిఫిట్లకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చూస్తామని సీఎం హామీ ఇచ్చారు. సమీక్షలో ప్రభుత్వ సలహాదారులు కేశవరావు, పి.సుదర్శన్‌రెడ్డి, ఎంపీ వేం నరేందర్‌ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్‌ జాజు, విద్యా శాఖ కార్యదర్శి యోగితా రాణా, ఇంటర్మీడియెట్‌ బోర్డు డైరెక్టర్‌ అభిలాష అభినవ్, పాఠశాల విద్యా శాఖ సంచాలకుడు నవీన్‌ నికొలస్, ఉన్నత విద్యా మండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ వి.బాలకిష్టారెడ్డి, ఉస్మానియా వీసీ ప్రొఫెసర్‌ మొలుగారం కుమార్‌ తదితరులు పాల్గొన్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement