breaking news
Secondary education
-
CBSC బోర్డు కీలక నిర్ణయం.. ఇకపై ఏడాదిలో రెండు సార్లు పరీక్షలు
న్యూఢిల్లీ: 2026 నుంచి ఏడాదిలో రెండుసార్లు పదో తరగతి బోర్డు పరీక్షలను నిర్వహించాలన్న ప్రతిపాదనకు సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ)ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే ఆన్లైన్లో ఉంచనుంది. దీనిపై మార్చి 9వ తేదీ వరకు సంబంధిత వర్గాలు తమ అభిప్రాయాలు, సూచనలు సలహాలను అందివ్వవచ్చని అధికారులు వివరించారు. అనంతరం ఈ విధానం ఆమోదం పొందుతుందని తెలిపారు.ఇక, ప్రతిపాదనలు అనుసరించి.. పదో తరగతి మొదటి దశ పరీక్షలు ఏటా ఫిబ్రవరి 17 నుంచి మార్చి 6వ తేదీ వరకు, రెండో దశ పరీక్షలు మే 5 నుంచి 20వ తేదీల మధ్య జరగనున్నాయి. ‘రెండు దశల పరీక్షల్లోనూ సిలబస్ పూర్తి స్థాయిలో ఉంటుంది. అభ్యర్థులు రెండు దశల్లోనూ ఒకే కేంద్రంలో పరీక్ష రాస్తారు. దరఖాస్తు సమయంలో రెండింటికి కలిపి ఫీజును చెల్లించాలి. ఇవి సప్లిమెంటరీ పరీక్షలుగా కూడా ఉంటాయి. ఎట్టి పరిస్థితుల్లోనూ వేరుగా ప్రత్యేకంగా పరీక్షలను నిర్వహించబోం’అని అధికారులు వివరించారు. సీబీఎస్ఈ బోర్డు పరీక్షలంటే ప్రజల్లో నెలకొన్న తీవ్రమైన ఉత్కంఠను తొలగించాలన్న నూతన విద్యా విధానాన్ని అనుసరించి ఈ విధానాన్ని ప్రతిపాదించినట్లు సీబీఎస్ఈ వర్గాలు తెలిపాయి. -
హైటెక్ బోధన.. ఆన్లైన్ సాధన
సాక్షి, హైదరాబాద్: అమెరికా వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా సైన్స్‌లాంటి అత్యాధునిక సాంకేతిక కోర్సుల బోధన తొమ్మిదవ తరగతి నుంచే మొదలు పెడుతున్నారు. ఈ కోర్సుల డిజైన్, బోధన ప్రణాళిక విషయంలోనూ విద్యా కమిటీలదే పూర్తి అజమాయిషీ. గూగుల్ క్రోంలో వర్క్ షీట్లు, అందులోనే మూల్యాంకన విధానం విద్యార్థులను సాంకేతిక పురోగతి వైపు తీసుకెళ్తున్నాయి. మన విద్యా విధానంలోనూ ఇలాంటి సంస్కరణలు అవసరం అంటున్నారు అమెరికా విద్యా విధానాన్ని పరిశీలించిన తెలంగాణ ఉపాధ్యాయుడు సంక్రాంతి రవి కుమార్. అమెరికాలో నిర్వహించిన ‘ఫుల్ బ్రైట్ టీచింగ్ ఎక్సలెన్స్ అచీవ్మెంట్ ప్రోగ్రాం’లో భాగంగా ఆయన అక్కడి విద్యా విధానాన్ని అధ్యయనం చేశారు. ఇందులో మొత్తం 60 దేశాల నుంచి టీచర్లను ఎంపిక చేయగా, మనదేశం నుంచి ఎంపికైన ఏడుగురిలో రవికుమార్ ఒకరు. ఒహియోలో రాష్ట్రంలోని కెంట్ నగరంలో 50 రోజుల పాటు అక్కడి విద్యా విధానంపై ఈయన అధ్యయనం చేశారు. ఖమ్మం జిల్లాలో ఆంగ్ల ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న రవికుమార్ అమెరికా విద్యా విధానంపై తన పరిశీలనను ‘సాక్షి’తో ప్రత్యేకంగా పంచుకున్నారు.అడుగడుగునా టెక్నాలజీ..అమెరికాలో సెకండరీ విద్య పూర్తిగా ఉచితం. ప్రైవేటు స్కూళ్లు కనిపించవు. ప్రభుత్వ ఆ«ధ్వర్యంలో నడిచే స్కూళ్లలో ఎక్కువ భాగం సాంకేతిక పరిజ్ఞానం కనిపిస్తోంది. పెన్, నోట్‌బుక్ ఎప్పుడో దూరమయ్యాయి. గూగుల్ క్రోం బుక్స్‌లో అసైన్మెంట్స్ ఇస్తారు. అందులోనే మూల్యాంకనం చేస్తారు. అయితే, విద్యార్థులు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (ఏఐ) ద్వారా ప్రశ్నలకు సమాధానం తెలుసుకునే అవకాశం ఉందని టీచర్లు అంటున్నారు. ఆక్యులెస్, మెటాక్వెస్ట్ వంటి పరికరాలు, వర్చువల్ రియాలిటీ వంటి సాంకేతికతత అక్కడ ప్రతీ స్కూల్లో కనిపిస్తున్నాయి. ప్రయోగాలను వర్చువల్ రియాలిటీ ద్వారా తెలుసుకునే విధానం ఉంది. ఆన్లైన్ ద్వారా నాలెడ్జ్ పొందడంలో అమెరికన్ విద్యార్థులు ముందున్నారు. ఇందుకు తగ్గ అప్లికేషన్లు కూడా అందుబాటులోకి తెచ్చారు.9వ తరగతి నుంచే భవిష్యత్ ప్రణాళికవిద్యార్థి భవిష్యత్ నిర్దేశం 9వ తరగతిలోనే మొదలవుతుంది. 11 రకాల వృత్తి విద్యా కోర్సులను ఈ దశలోనే అందుబాటులోకి తెచ్చారు. డాక్టర్, ఇంజనీర్, టీచర్... ఇలా ఏ రంగాన్ని ఎంచుకున్నా 9వ తరగతిలో పునాది పడుతుంది. దీంతో సబ్జెక్టుపై విద్యార్థికి పట్టు పెరుగుతుంది. అక్కడ విద్యతో పాటు సామాజిక, సాంస్కృతిక అంశాలకూ ప్రాధాన్యమిస్తున్నారు. సంగీతం, గేమ్స్, మోడ్రన్ మ్యూజిక్.. ఇలా ఏదో ఒక అంశాన్ని విద్యార్థి నేర్చుకునేలా ప్రోత్సహిస్తున్నారు. నైపుణ్యానికి పెద్దపీటఇంజనీరింగ్ విద్య అమెరికాలో భిన్నంగా ఉంది. థియరీ కన్నా ప్రాక్టికల్ నాలెడ్జ్ పొందే బోధన పద్ధతులు అనుసరిస్తున్నారు. ఇంజనీరింగ్ విద్యలో ఎక్కడికో వెళ్లి ఇంటర్న్‌షిప్ చేయడం ఉండదు. ప్లానింగ్, డిజైనింగ్ ఇంజనీరింగ్ విద్యలో భాగం. ఏదో ఒక కొత్త ప్రయోగాన్ని విద్యార్థులు ఇంజనీరింగ్‌లో చేయాలి. ఈ విధానం పాఠశాల విద్యలోనూ కనిపిస్తుంది. దీనివల్ల విద్యార్థిలో నైపుణ్యం పెరుగుతుంది. అయితే, భారత విద్యార్థులకంటే గణితంలో అమెరికా విద్యార్థులు ఇప్పటికీ వెనుకబడే ఉన్నారు. టీచర్లు, అదనపు టీచర్లు..ప్రతి క్లాసులోనూ 20–24 మంది విద్యార్థులనే అనుమతిస్తారు. ఒక్క విద్యార్థి పెరిగినా కొత్త సెక్షన్ నిర్వహించాల్సిందే. ప్రతి సబ్జెక్టుకూ టీచర్లతోపాటు అదనపు టీచర్లనూ నియమిస్తారు. ప్రతి సబ్జెక్టును, క్లాసును విద్యా కమిటీలు పర్యవేక్షిస్తాయి. లోపాలను టీచర్లకు చెబుతాయి. కమ్యూనిటీ పరంగా ఎక్కువ నిధులు ఇచ్చే సంస్థల పర్యవేక్షణలోనే విద్యా కమిటీలు ఏర్పడతాయి. వీటిపై ప్రభుత్వ పెత్తనం ఏమాత్రం ఉండదు. టీచర్ల నియామకం విషయంలోనూ కమిటీలు అన్ని అర్హతలు పరిశీలిస్తాయి. కొన్ని నిబంధనల మేరకు వీళ్లు పనిచేయాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ విద్యార్థులతో ఎలాంటి సంబంధాలు కొనసాగించడం కుదరదు.ప్రభుత్వానికి నివేదిక ఇస్తా..విద్యా విధానంలో మార్పులపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తున్న నేపథ్యంలో అమెరికా విద్యా విధానంపై సమగ్ర అధ్యయనం అవసరం. నేను అక్కడ గమనించిన ప్రతి అంశాన్ని నివేదిక రూపంలో ప్రభుత్వానికి ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను. త్వరలో విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళికి కూడా నివేదిక పంపుతా. సాంకేతికంగా అభివృద్ధి పథంలోకి రాష్ట్ర విద్యా విధానాన్ని తీసుకెళ్లడానికి అమెరికాలోని కొన్ని మంచి అంశాలను మనం స్వీకరించాల్సిందే. – సంక్రాంతి రవి కుమార్ -
మోడల్ స్కూళ్ల భారం మీదే!
- ‘మోడల్ స్కూళ్ల’ పథకాన్ని రాష్ట్రాలే నిర్వహించుకోవాలని కేంద్రం సూచన - ఇప్పటికే నిధులు కేటాయించిన పాఠశాలల పనులపై స్పష్టత ఇవ్వని వైనం - నిధులరాకపై అనుమానం - అయోమయంలో ఆరు మోడల్ స్కూళ్లు సాక్షి, రంగారెడ్డి జిల్లా: మాధ్యమిక విద్యలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలనే సంకల్పంతో ప్రవేశపెట్టిన రాష్ట్రీయ మాధ్యమిక శిక్షా అభియాన్‌ను కేంద్ర ప్రభుత్వం ఎత్తేసింది. దాదాపు నాలుగున్నరేళ్ల క్రితం అమల్లోకి తెచ్చిన ఈ పథకాన్ని ఇకపై రాష్ట్ర ప్రభుత్వాలే నిర్వహించుకోవాలని స్పష్టం చేసింది. ఈ విషయాన్ని ఇటీవల పార్లమెంట్లో ప్రవేశపెట్టిన బడ్జెట్ సందర్భంగా కేంద్ర ఆర్థిక మంత్రి తేల్చిచెప్పారు. ఈ పథకం కింద కొనసాగుతున్న ఆదర్శ పాఠశాలల నిర్వహణ సంగతి అటుంచితే.. ఇప్పటికే మంజూరై నిర్మాణాలకు నోచుకోని మోడల్ స్కూళ్ల పరిస్థితి అయోమయంలో పడింది. ఆర్‌ఎంఎస్‌ఏ పథకంలో భాగంగా జిల్లాకు 25 ఆదర్శ పాఠశాలలు మంజూరయ్యాయి. జిల్లాలో 37 మండలాలుండగా.. విద్య పరంగా వెనకబడిన ప్రాంతాలను గుర్తిస్తూ 25 మండలాలను ఎంపిక చేయగా.. వాటికి కేంద్ర ప్రభుత్వం 2010-11లో తొలివిడత కింద 19 పాఠశాలలు మంజూరు చేసింది. ప్రస్తుతం వీటి నిర్మాణ పనులు దాదాపు పూర్తికాగా.. 2012 -13 వార్షిక సంవత్సరంలో మంజూరైన ఆరు పాఠశాలలపై సందిగ్ధం నెలకొంది. తాజాగా ఆర్‌ఎంఎస్‌ఏ పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వహించుకోవాలని సూచించింది. అయితే ఇప్పటికే మంజూరుచేసి నిధులు విడుదల చేయని వాటిపై స్పందించకపోవడంతో వాటి పురోగతి ప్రశ్నార్థకంగా మారింది. రూ.19.32 కోట్ల సంగతేంటి? ఆర్‌ఎంఎస్‌ఏ రెండో విడతలో వికారాబాద్, మొయినాబాద్, దోమ, యాలాల, ధారూరు, మోమీన్‌పేట మండలాలకు ఆదర్శ పాఠశాలలు మంజూరయ్యాయి. ఒక్కో పాఠశాలకు రూ.3.2 కోట్ల చొప్పున మొత్తం రూ.19.2 కోట్లు కేటాయించింది. ఈ క్రమంలో అధికారులు కాంట్రాక్టర్లను సైతం ఎంపిక చేసి పనులు చేపట్టేందుకు ఏర్పాట్లు చేశారు. అయితే కేంద్ర ప్రభుత్వం మాత్రం నిధుల విడుదలపై తాత్సారం చేసింది. ఫలితంగా పనులు ప్రారంభానికి నోచుకోలేదు. తాజా పరిస్థితుల నేపథ్యంలో వీటి నిర్మాణాల సంగతి సందిగ్ధంలో పడింది. వాస్తవానికి 2012- 13 సంవత్సరంలో పనులు మంజూరు చేసినందున కేంద్ర ప్రభుత్వమే నిధులివ్వాలి. కానీ అప్పట్లో నిధులు విడుదల చేయకపోగా.. ప్రస్తుతం పథకాన్ని వదిలించుకుంది. దీంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపితే తప్ప నిర్మాణాల ప్రక్రియ కొలిక్కి రావడం కష్టమే.