రేవంత్‌రెడ్డి.. రైతులకు ఇచ్చిందేమీ లేదు | BRS Working President KTR at the meeting in Nirmal | Sakshi
Sakshi News home page

రేవంత్‌రెడ్డి.. రైతులకు ఇచ్చిందేమీ లేదు

Nov 12 2026 4:41 AM | Updated on Nov 12 2026 4:41 AM

BRS Working President KTR at the meeting in Nirmal

మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిండు 

బాధిత కుటుంబానికి ధీమానిచ్చే బీమాను ఆపేసిండు 

అష్టగ్రహాల్లా ఉన్న బీజేపోళ్లూ రాష్ట్రానికి ఏం చేస్తలేరు.. 

కరువు, అభివృద్ధిపై పట్టింపు లేని సీఎం నా గడ్డంపై కామెంట్లు చేశాడు 

రేవంత్‌లా కావాలని ఎవరికైనా ఉంటుందా? 

నిర్మల్‌ రైతుగర్జన సభలో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌

నిర్మల్‌: ‘తెలంగాణలో చిన్న, సన్నకారు రైతులు 93 శాతం మంది ఉన్నారు. అరఎకరం, ఎకరం ఉన్న రైతుకు ఏమైనా జరగకూడనిది జరిగి ఇంటిపెద్ద చనిపోతే ఆ కుటుంబం ఆగమైతదనే బాధతో కేసీఆర్‌ ప్రపంచంలోనే ఎవరూ తీసుకోని నిర్ణయం తీసుకున్నారు. రైతు ఏ కారణంతో చనిపోయినా ఆ కుటుంబానికి ధీమా ఉండాలని రూ.5 లక్షల రైతు బీమా తెచ్చిండు. అలాంటి బాధిత కుటుంబానికి ధీమా ఇచ్చే రైతు బీమాను రేవంత్‌రెడ్డి ఆపిండు. అంతే కాదు.. మూడుసార్లు రైతుబంధు ఎగ్గొట్టిండు. ఈ సర్కారు హామీలు తప్ప.. రైతులకిచ్చిందేమీ లేదు’అని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ ధ్వజమెత్తారు. 

నిర్మల్‌ జిల్లా కేంద్రంలో బుధవారం సాయంత్రం నిర్వహించిన రైతుగర్జన బహిరంగ సభలో కేటీఆర్‌ మాట్లాడారు. సమైక్యపాలనలో కాలిపోయే మోటార్లు, పేలిపోయే ట్రాన్స్‌ఫార్మర్లతో రైతన్నకు ఎప్పుడూ కరెంట్‌ కష్టాలు ఉండేవన్నారు. రోజుకు కనీసం 4 గంటలు కరెంట్‌ ఇవ్వలేదని, అలాంటి 60 ఏళ్ల కరెంట్‌ కష్టాలను అధికారంలోకి వచ్చిన ఆరునెలల్లోనే తీర్చి 24 గంటలు నాణ్యమైన కరెంటు ఇచ్చిన నాయకుడు కేసీఆర్‌ అన్నారు. దేశంలోనే రైతుకు పెట్టుబడి సాయం చేయాలని ఆలోచ న చేసిన నాయకుడూ కేసీఆరే అని పేర్కొన్నారు. అలాంటి నాయకుడి పాలనలో నాట్లేసే టైముకు రైతన్నల ఫోన్‌లలో టింగ్‌ టింగ్‌మని రైతుబంధు పైసలు మోగుతుండే అని గుర్తుచేశారు. 

కాంగ్రెస్‌ తెచ్చిన కరువు: దేశమంతా వద్దని తరిమేసిన కలుపుమొక్క కాంగ్రెస్‌ అని, అలాంటి పార్టీని తెలంగాణలోనూ    పెకిలించి వేయాల్సిన అవసరం ఉందని కేటీఆర్‌ పిలుపునిచ్చారు. మన ప్రాజెక్టులు ఎందుకు ఎండినాయి? ఆంధ్రా ప్రాజెక్టులు ఎందుకు నిండుగా ఉన్నాయని రేవంత్‌రెడ్డిని ప్రశ్నించారు. ఆంధ్రలో నీళ్లు, మనకు ఎక్కిళ్లు అని, ఇది ప్రకృతి ఇచ్చిన కరువు కాదని కాంగ్రెస్‌ తెచ్చిన కరువని మండిపడ్డారు. నిర్మల్‌ చుట్టూ ప్రాజెక్టులు, చెరువులు ఉన్నా కరువు ఎందుకు వచ్చిందో రైతులే ఆలోచించాలన్నారు. 

కరువు వస్తుంటే భరోసా ఇవ్వాల్సిన సీఎం రైతులను భయపెడుతున్నాడని ఆరోపించారు. పంటల గురించి మాట్లాడకుండా ఊళ్లల్లో నాటకాలు వెయ్యమని చెబుతున్నాడన్నారు. మిషన్‌ కాకతీయ ద్వారా చెరువులు బాగు చేయడమే కాదు.. ఆ చెరువులు నింపి, వాగుల మీద చెక్‌డ్యాములు కట్టిన ఘనత కేసీఆర్‌దే అని చెప్పారు. కృష్ణా, గోదావరిలో నీటిని ఒడిసిపట్టి, కాళేశ్వరం ప్రాజెక్టు, పాలమూరు–రంగారెడ్డి, సీతారామ, భక్త రామదాసు, నిర్మల్‌ జిల్లాలో కట్టిన సదర్మాట్‌ బరాజ్‌ల ద్వారా రైతాంగానికి నీరిచ్చారన్నారు. చెరువులను బాగు చేయడంతోపాటు నీటి తీరువా శాశ్వతంగా రద్దు చేసిన ఘనత ఆయనదేనని తెలిపారు. 

హామీలన్నీ మర్చిపోయిండు.. 
కరువు పరిస్థితులు, అభివృద్ధి పట్టింపు లేని ముఖ్యమంత్రి తన గడ్డం గురించి ఆయన సొంత జిల్లాలో కామెంట్లు చేశాడని కేటీఆర్‌ మండిపడ్డారు. ఆయనను చూసి తాను గడ్డం పెంచానని అంటున్నాడు.. అసలు ఎవరైనా రేవంత్‌ మాదిరి కావాలనుకుంటారా అని సభికులను ప్రశ్నించారు. కేసీఆర్‌ హయాంలో ఏ పథకం ఆగలేదని, నిధులు వరదలా వచ్చేవన్నారు. ఇప్పుడు ఆ డబ్బుల మూటలన్నీ ఎక్కడికి వెళుతున్నాయో తెలుసుకదా అని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన ఏ హామీనీ సీఎం నెరవేర్చలేదంటూ గతంలో రేవంత్‌రెడ్డి మాట్లాడిన హామీల వీడియోలను సభలో ప్రదర్శించారు. ఉద్యోగులకు పీఆర్సీ ఇస్తానని ఇవ్వలేదు, ఏడు డీఏలూ పెండింగ్‌లో పెట్టాడని పేర్కొన్నారు. రైతులు, ఉద్యోగులకే కాదు.. విద్యార్థులు, మహిళలు చివరకు మసీదుల్లో పని చేసే ఇమామ్, మౌజంలనూ మోసం చేశాడన్నారు. 

తెలంగాణ మీద మోదీకి కనికరం లేదు 
రాష్ట్రంలో గెలిచిన 8 మంది ఎమ్మెల్యేలు, ఎంపీలు అష్ట గ్రహాల్లా ఉన్నారని, అభివృద్ధి కోసం ప్రధాని మోదీని అడిగే ధైర్యం వారికి లేదని కేటీఆర్‌ మండిపడ్డారు. పక్కనే ఉన్న మహారాష్ట్ర, ఆంధ్రకు వెళ్తున్న కరువు బృందాలు తెలంగాణకు మాత్రం రావడం లేదన్నారు. వీరు వీటిపై అడగరని దుయ్యబట్టారు. తెలంగాణ మీద మోదీకి కనికరం లేదని, కరువు కనపడదన్నారు. తమ పార్టీ మహిళా ఎమ్మెల్యేలను జుట్టు పట్టి లాగినా బీజేఎల్పీ నేత మహేశ్వర్‌రెడ్డికి కనపడదన్నారు. రేవంత్‌రెడ్డికి వత్తాసు పలకడం తప్ప ప్రజలకు కోసం ఆయన చేసిందేమీ లేదన్నారు. 

దాల్‌ మే కుచ్‌ కాలా హై... 
దేశమంతా ఎలక్షన్‌ కమిషన్‌ ఓట్‌ చోరీకి పాల్పడుతోందని ఆందోళనలు చేస్తుంటే.. ఇక్కడ బీజేపీవాళ్లు ఎన్నికల కమిషన్‌కు మద్దతుగా ర్యాలీ తీస్తున్నారని, అంటే దాల్‌ మే కుచ్‌ కాలా హై.. అన్న విషయం అర్థమవుతోందని కేటీఆర్‌ అనుమానం వ్యక్తం చేశారు. ప్రజలను వంచిస్తున్న కాంగ్రెస్, బీజేపీలను ఢిల్లీదాకా తరిమికొట్టి, రాష్ట్రంలో మళ్లీ గులాబీ పాలన తెచ్చుకుందామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సభలో ఎమ్మెల్యేలు ప్రశాంత్‌రెడ్డి, అనిల్‌జాదవ్, కోవా లక్ష్మి, మాజీ ఎంపీ బాల్క సుమన్, మాజీ మంత్రులు జీవన్‌రెడ్డి, జోగు రామన్న, మాజీ ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, గంప గోవర్ధన్, జీవన్‌రెడ్డి, దివాకర్‌రావు, నల్లమడుగు సురేందర్, హన్మంత్‌షిండే పాల్గొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement