బెంగళూరు: ఎస్‌ఐనంటూ దర్జాగా వసూళ్లకు, మోసాలకు పాల్పడుతున్న కిలాడీని చిక్కమగళూరు జిల్లా పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలు.. రామనగరకు చెందిన నివేదితా గౌడ చిక్కమగళూరు నగరంలో కెఫెను నడుపుతోంది. కెఫెకు వచ్చే మహిళలు, యువతులతో పరిచయం పెంచుకుంది. తాను బెంగళూరు రాజగోపాలనగర పోలీసుస్టేషన్‌లో ఎస్‌ఐ అని, సెలవు పెట్టి చిక్కమగళూరుకు వచ్చి కెఫెను నడుపుతున్నట్లు నమ్మించింది. పోలీసు కటింగ్ చేయించుకుని, యూనిఫారం కూడా ధరించి ఫోటోలు పంపేది. టూర్‌కు వెళ్లాలని ట్రావెల్స్‌లో విలాసవంతమైన కార్లను బాడుగకు తీసుకొని గుట్టుగా అమ్మేసి డబ్బులు జల్సా చేసేది. అవసరం ఉందంటూ తెలిసినవారి నుంచి భారీ మొత్తంలో డబ్బులు, బంగారు నగలు కూడా తీసుకుంది.
బాధితుల ఫిర్యాదుతో
చివరకు మోసపోయిన 20 మంది చిక్క పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఆమె బండారం గుట్టురట్టయింది. 25 మందికి కోట్ల రూపాయలు టోకరా వేసినట్లు విచారణలో బయటపడింది. ఆమె మొబైల్ ఫోన్‌లో వేరువేరు పేర్లతో 3 ఆధార్ కార్డులు బయట పడ్డాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలలో మోసాలకు పాల్పడినట్లు, ఆ డబ్బులు, బంగారాన్ని తన ప్రియుడు దేవ్‌కు ఇచ్చినట్లు విచారణలో తెలిసింది. ఆమె ప్రియుని కోసం గాలింపు చేపట్టారు.
ఇదీ చదవండి: Asian Games Cricket: సెమీ ఫైనల్లో వైభవ్ సూర్యవంశీ మెరుపులు


