ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుపై 11 పెండింగ్ చలాన్లు
నిందితులకు పోలీస్ వెరిఫికేషన్ లేకుండానే ఉద్యోగం
పనిచేయని సీసీటీవీ కెమెరా.. కిటికీలకు భారీ తెరలు
398 పేజీల ఛార్జ్‌షిట్ దాఖలు చేసిన ఢిల్లీ పోలీసులు
విచారణకు అంగీకరించిన న్యాయస్థానం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీలో ఆగస్ట్ 4వ తేదీన 16 ఏళ్ల బాలికపై బస్సులో అత్యాచారం జరిగిన కేసులో పోలీసులు ఛార్జ్‌షిట్ దాఖలు చేశారు. మరో నిర్భయ ఘటనగా సంచలనం రేపిన ఈ కేసులో ఇద్దరు నిందితులపై అభియోగాలకు సంబంధించి పోలీసులు కీలక ఆధారాలను సేకరించినట్లు సమాచారం. కశ్మీర్ గేట్ పోలీస్‌స్టేషన్ పోలీసులు సమర్పించిన 398 పేజీల ఛార్జ్‌షిట్‌ను పరిశీలించిన న్యాయస్థానం గత వారం కేసు విచారణకు అంగీకరించినట్లు తెలిసింది. 11వ తరగతి చదివే బాధితురాలు యూపీలోని ఫరీదాబాద్‌లో బస్సెక్కింది. నోయిడాలో దిగాల్సి ఉంది.
అయితే, ఆమె తెలియక సుమారు 10 కిలోమీటర్లు ముందుగానే బస్సు దిగింది. పొరపాటు తెలుసుకుని, లిఫ్టు కోసం అటుగా వస్తున్న ప్రైవేట్ ట్రావెల్స్‌కు చెందిన మరో బస్సును ఆపింది. అందులోని వారు ఆమెను ఎక్కించుకున్నారు. బస్సులో ప్రయాణికులెవరూ లేకపోవడాన్ని గమనించిన ఆమె కిందికి దిగేందుకు ప్రయత్నించగా కండక్టర్ బలవంతంగా అడ్డుకున్నాడు. అనంతరం, బస్సు ముందుకు వెళ్తుండగానే ఆమెపై డ్రైవర్, కండక్టర్ అఘాయిత్యానికి పాల్పడ్డారు. దాదాపు 40 కిలోమీటర్ల ప్రయాణం అనంతరం ఢిల్లీ కశ్మీరీ గేట్ ప్రాంతంలో బాలికను వదిలివేసి వెళ్లిపోయారు. బాధితురాలు కశ్మీర్ గేట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
నాలుగు గంటల్లోనే నిందితుల అరెస్ట్
సీసీటీవీ ఫుటేజీ సాయంతో పోలీసులు ఆ బస్సు ఆచూకీని తెలుసుకున్నారు. తిమార్‌పూర్‌లోని పార్కింగ్ ప్రాంతంలో ఉన్న ఆ బస్సును గుర్తించారు. డ్రైవర్ కుల్దీప్ (39), కండక్టర్ సందీప్ (26)లను అరెస్ట్ చేశారు. వీరిద్దరూ యూపీలోని కాన్పూర్ వాసులు. ఫిర్యాదు అందిన 4 గంటల్లోనే నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఛార్జిషీట్‌లో పేర్కొన్నారు. ప్రయాణ సమయంలో భద్రత, నిబంధనల అమలుకు సంబంధించిన తనిఖీలకు సంబంధించిన అధికారులెవరూ బస్సును ఆపలేదని తెలిపారు. అదే సమయంలో బస్సుపై సుమారు రూ. 63 వేల 11 ట్రాఫిక్ చలాన్లు పెండింగ్‌లో ఉన్నట్లు వెల్లడైంది. అతివేగానికి సంబంధించిన వాటిలో ఏడు చలాన్లు జూలైలోనే జారీ అయినవని పోలీసులు పేర్కొన్నారు.
ఆధారాలు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీకి
ప్రైవేట్ ట్రావెల్స్ నిర్వాహకులు డ్రైవర్, కండక్టర్‌ను నియమించే సమయంలో పోలీస్ వెరిఫికేషన్ నిర్వహించలేదని కూడా పోలీసులు గుర్తించారు. బస్సులోని సీసీటీవీ కెమెరా కూడా పనిచేయడం లేదని, కిటికీలకు భారీ తెరలు ఉండటంతో బయట నుంచి లోపలి పరిస్థితులు కనిపించని విధంగా ఉన్నట్లు గుర్తించారు. బస్సులో జీపీఎస్, వాహన ట్రాకింగ్ వ్యవస్థలు, అత్యవసర సమయంలో ప్రయాణికులు వినియోగించే పానిక్ బటన్లు వంటి భద్రతా వ్యవస్థలు ఉన్నాయా? ఉంటే అవి ఘటన సమయంలో పనిచేస్తున్నాయా? అనే అంశాలనూ పోలీసులు పరిశీలించారు. దర్యాప్తులో సేకరించిన వీర్యం, వెంట్రుకల వంటి జీవ సంబంధిత నమూనాలను ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబోరేటరీకి పంపించారు. కేసు విచారణకు సిద్ధమవుతున్న నేపథ్యంలో ఫోరెన్సిక్ నివేదికను త్వరగా అందించాలని పోలీసులు కోరినట్లు సమాచారం.


