శ్రీనగర్: జమ్మూకశ్మీర్ కతువా జిల్లాలో తీవ్ర కలకలం రేగింది. తోటి జవాన్లపై సీఐఎస్‌ఎఫ్ సిబ్బంది విచక్షణారహితంగా కాల్పులకు తెగబడ్డారు. ఈ ఘటనలో ఓ అధికారి సహా నలుగురు సహచరులు ప్రాణాలు కోల్పోయారు.
స్థానికుల సమాచారం మేరకు.. కతువా జిల్లా బసోహ్లిలోని మష్కా గ్రామంలో రావి నదికి ఉపనది సేవా నదిపై సేవా పవర్ ప్రాజెక్ట్ వద్ద సీఐఎస్‌ఎఫ్ యూనిట్ ఉంది. ఇక్కడ విధులు నిర్వర్తిస్తున్న సిబ్బంది మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ వివాదం తర్వాత మంగళవారం సాయంత్రం 6:40 గంటల ప్రాంతంలో ఈ దారుణ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
నిందితుడిగా భావిస్తున్న హెడ్ కానిస్టేబుల్ అవదేశ్ కుమార్ సింగ్ కార్యాలయ ప్రాంగణంలోకి ప్రవేశించి, తనకు కేటాయించిన ఏకే-47 రైఫిల్‌తో సహచర సిబ్బందిపై విచక్షణారహితంగా కాల్పులు జరిపినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆ సమయంలో అతని వద్ద 150 రౌండ్ల మందుగుండు సామగ్రి ఉన్నట్లు సీఐఎస్‌ఎఫ్ వెల్లడించింది. ఈ కాల్పుల ఘటనలో మృతి చెందిన వారిని అసిస్టెంట్ కమాండెంట్ అంకిత్ కుమార్ పాండే, సబ్-ఇన్‌స్పెక్టర్ లక్ష్మణ్ సింగ్, కానిస్టేబుల్ రఫీక్ అహ్మద్, కానిస్టేబుల్ సందీప్ కుమార్‌గా గుర్తించారు.
కాల్పుల్లో తీవ్రంగా గాయపడిన నలుగురు సిబ్బందిని చికిత్స నిమిత్తం సమీపంలోని హిమాచల్ ప్రదేశ్‌లోని ఎన్‌హెచ్‌పిసి ఆసుపత్రికి తరలించగా, అప్పటికే వారు మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. నిందితుడు అవదేశ్ కుమార్ సింగ్‌ను అదుపులోకి తీసుకుని అరెస్టు చేశారు. ఈ కాల్పుల ఘటనకు అసలు కారణాలు ఏమిటనే దానిపై అధికారులు దర్యాప్తు ముమ్మరం చేశారు.


