రంగా విగ్రహం తొలగింపును ప్రశ్నించినందుకు రెచ్చిపోయిన పోలీసులు
రంగా కుమార్తె ఆశాకిరణ్‌పై దౌర్జన్యం
పలువురిని అదుపులోకి తీసుకున్న వైనం
తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితి
నిడదవోలు: తూర్పుగోదావరి జిల్లా ఉండ్రాజవరం సెంటర్‌లో ఏర్పాటు చేసిన దివంగత వంగవీటి మోహనరంగా విగ్రహం తొలగింపును ప్రశ్నించిన కాపులపై పోలీసులు రెచ్చిపోయారు. విచక్షణారహితంగా లాఠీచార్జ్ జరిపి పలువురిని అదుపులోనికి తీసుకున్నారు. తొలుత రంగా కుమార్తె ఆశాకిరణ్ ఉండ్రాజవరంలో రంగా విగ్రహం ఏర్పాటు చేసిన ప్రాంతాన్ని శనివారం పరిశీలించారు. రెండు రోజులుగా చోటుచేసుకున్న ఘటనలను ఆశాకిరణ్‌కు చెబుతూ భారీ ఎత్తున కాపులు గుమిగూడారు. ఆ సమయంలో కొవ్వూరు డీఎస్పీ డి.దేవకుమార్, నిడదవోలు సీఐ పీవీజీ తిలక్ పోలీస్ సిబ్బందితో అక్కడకు వచ్చి శాంతిభద్రతల సమస్యలు తలెత్తుతాయని అక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ ఆశాకిరణ్‌పై దౌర్జన్యానికి దిగారు.

ఈ క్రమంలో తీవ్ర వాగ్వాదం, ఘర్షణ వాతావరణం చోటుచేసుకుంది. ఈ నేపథ్యంలో పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఆశాకిరణ్ ఇద్దరు బాడీగార్డులతో పాటు నలుగురిని వ్యాన్‌లో ఎక్కించుకుని పెరవలి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. దీనిపై ఆశాకిరణ్ తీవ్ర నిరసన వ్యక్తం చేస్తూ రోడ్డుపై బైఠాయించి కాపులతో పాటు ధర్నాకు దిగారు. కొవ్వూరు ఆర్డీవో ఆనందరావు, తహసీల్దార్ పీఎన్‌డీ ప్రసాద్‌లు ఆశాకిరణ్‌తో చర్చించి ఆమెను శాంతింపజేసే ప్రయత్నం చేశారు.
అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ ‘పేద, బడుగు, బలహీన వర్గాల కోసం రంగా ప్రాణం ఇచ్చారని, ఆయన విగ్రహాల ఏర్పాటును ఎవరైనా అడ్డుకునేందుకు ప్రయత్నిస్తే ఖబడ్దార్.. అంటూ హెచ్చరించారు. కాగా, విగ్రహాన్ని తొలగించి, దిమ్మను ధ్వంసం చేసిన ప్రదేశంలోనే రంగా విగ్రహాన్ని ఏర్పాటు చేసేందుకు తన ఇంటి ముందు ఉన్న స్థలాన్ని ఇచ్చేందుకు ఆయన అభిమాని కోటిపల్లి తాతారావు ముందుకొచ్చారు. దీంతో అక్కడే విగ్రహం ఏర్పాటు చేసేందుకు రంగా అభిమానులు అంగీకరించారు.


