రూ.30 లక్షల విలువైన సొత్తు స్వాధీనం
పెద్దాపురం: స్థానిక ఆర్డీవో పి.కృష్ణమూర్తి ఇంటిలో చోరీకి పాల్పడిన నిందితుడిని పోలీసులు అరెస్టు చేశారు. కాకినాడ జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ బిందుమాధవ్ శనివారం వెల్లడించిన వివరాలు ఇలా ఉన్నాయి. జూలై 25 వ తేదీన పెద్దాపురం రామారావుపేటలోని ఆర్డీవో పి.కృష్ణమూర్తి ఇంటి వెనక కేవలం మెష్‌డోర్ మాత్రమే ఉండడంతో దాని గడియ తొలగించి లోపలికి ప్రవేశించిన అడ్డతీగల మండలం కొత్తపాలెం గ్రామానికి చెందిన మామిడి శివకుమార్ ఇంటి రెండో గదిలోని కబోర్డులోని తాళం తీసుకుని అల్మరా తెరచి అందులోని 276 గ్రాముల బంగారం, 48 గ్రాముల వెండి, రూ.75 వేల నగదును దోచుకుని పోయాడు. సాంకేతిక సహకారంతో నిందితుడిని స్థానిక వడ్లమూరు గ్రామ శివారులో అరెస్టు చేసినట్టు తెలిపారు. ఏఎస్పీ డాక్టర్ మహంతి కిషోర్‌కుమార్, పెద్దాపురం డీఎస్పీ ఏబీజీ తిలక్ ఆధ్వర్యంలో సీఐ వైఆర్‌కే శ్రీనివాస్, సీసీఎస్ సీఐ అంకబాబు, ఎస్సై యు.పాపారావు కేసు దర్యాప్తు చేశారన్నారు. నిందితుడి నుంచి రూ.15 లక్షల నగదును, 105.4 గ్రాముల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. మరో రూ.2 లక్షల చోరీ సొత్తు రికవరీ చేయాల్సి ఉందని ఎస్పీ తెలిపారు.


