తిరుపతి ఈస్ట్ పోలీస్ స్టేషన్‌లో నిర్బంధంలో ఉన్న సచివాలయ మహిళా ఉద్యోగులు
జిల్లాల నుంచి శనివారమే బయల్దేరిన సిబ్బంది
వీరిని కట్టడి చేసేందుకు నిర్బంధాలకు దిగిన ప్రభుత్వం
ఆదివారం సెలవైనా పనిచేసే చోటే అందుబాటులో ఉండాలంటూ ఆదేశాలు
ఇతర ప్రాంతాలకు వెళ్లే వారిపై చర్యలు ఉంటాయని హెచ్చరిక
భయపెట్టేందుకు పలువురు ఉద్యోగ సంఘ నేతల సస్పెన్షన్
ఎన్ని ఆంక్షలు పెట్టినా విజయవంతం చేసి తీరుతామంటున్న ఉద్యోగ సంఘ నేతలు
సాక్షి, అమరావతి/నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్): రెండేళ్లకు పైగా ప్రభుత్వానికి వివిధ రూపాల్లో తమ వినతులు తెలియజేసినా ఫలితం లేకపోవడంతో తమ పెండింగ్ సమస్యల పరిష్కారానికి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆదివారం (27న) విజయవాడలో భారీ ఎత్తున ‘ఛలో విజయవాడ’ ఆందోళనకు సిద్ధమయ్యారు. ఇక్కడకు చేరుకునేందుకు శనివారమే అన్ని జిల్లాల నుంచి వేలాది మంది ఉద్యోగులు తమ పనిచేసే చోటు నుంచి విజయవాడకు బయల్దేరినట్లు ఉద్యోగ సంఘ నేతలు తెలిపారు. అయితే, ఈ కార్యక్రమాన్ని అడ్డుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఉద్యోగులపై అన్ని రకాల నిర్బంధాలను ప్రయోగిస్తోందని ఉద్యోగ సంఘ నేతలు మండిపడుతున్నారు. వాస్తవానికి.. ఆదివారం ప్రభుత్వ ఉద్యోగులెవరికైనా సెలవే. కానీ, మూడ్రోజుల క్రితం కురిసిన వర్షాలను సాకుగా చూపి గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులందరూ వారు పనిచేసే కేంద్రంలోనే తదుపరి ఆదేశాలు జారీచేసే వరకు అందుబాటులో ఉండాలంటూ శుక్రవారం ప్రభుత్వం ఆదేశించింది. ఉన్నతాధికారుల ముందస్తు అనుమతిలేకుండా ఎవరూ తాము పనిచేసే కేంద్రాన్ని వదిలి వెళ్లకూడదని ఆదేశాలు జారీచేయడంతో పాటు హెడ్‌క్వార్టర్‌లో అందుబాటులో లేని ఉద్యోగులపై చర్యలు తీసుకోవాలంటూ కలెక్టర్లకు సూచించింది. అయితే, ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా ఛలో విజయవాడ కార్యక్రమాన్ని విజయవంతం చేసి తీరుతామని ఉద్యోగ సంఘ నేతలు తేల్చి చెబుతున్నారు.
తాజాగా గుంటూరులో వార్డు ఎమినిటీస్ సెక్రటరీ సస్పెన్షన్
మరోవైపు.. ఛలో విజయవాడ కార్యక్రమంలో ఉద్యోగులెవరూ పాల్గొనకుండా చేయాలన్న లక్ష్యంతో రెండ్రోజులుగా చంద్రబాబు సర్కారు గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగ సంఘ నేతలను సస్పెండ్ చేస్తోంది. ఈ కార్యక్రమంలో కీలకంగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు చేస్తూ శనివారం ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ ప్రభుత్వోద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, గుంటూరులో వార్డు ఎమినిటీస్ సెక్రటరీ ఎస్‌కే అబ్దుల్ రజాక్‌ను నగర మున్సిపల్ కమిషనర్ కె.మయూర్ అశోక్ శనివారం సస్పెండ్ చేశారు. ‘చలో విజయవాడ’ పేరిట సోషల్ మీడియా గ్రూపుల్లో తోటి సిబ్బందిని రెచ్చగొట్టడంతో ఈ చర్యలు తీసుకున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇవే ఆరోపణలతో విలేజీ సర్వేయర్స్ అసోసియోషన్ రాష్ట్ర అధ్యక్షుడు, శ్రీకాకుళం జిల్లా రణస్థలం మండలం జేఆర్ పురం సచివాలయ సర్వేయర్ బురాడ మధుబాబును శుక్రవారం ప్రభుత్వం సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. మరోవైపు.. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఛలో విజయవాడ కార్యక్రమంలో పాల్గొనకుండా చేసేందుకు జిల్లాల్లో క్రియాశీలకంగా ఉండే ఉద్యోగులకు పోలీసులు ఫోనుచేసి హెచ్చరిస్తున్నారని ఉద్యోగ సంఘ నేతలు ఆరోపించారు. పైగా.. తమ కదలికలపై స్పెషల్ బ్రాంచ్ పోలీసులు నిఘా పెట్టినట్లు వారు చెబుతున్నారు.
రెండు విడతల చర్చల్లో తేలకే..
ఇదిలా ఉంటే.. రెండేళ్లుగా వివిధ సందర్భాల్లో ప్రభుత్వానికి వినతిపత్రాలు అందజేస్తూ వస్తున్న ఉద్యోగులు తమ సమస్యలను ఈనెల 23కల్లా పరిష్కరించని పక్షంలో 24 నుంచి ప్రత్యక్ష కార్యాచరణను మొదలుపెట్టనున్నట్లు సచివాలయ ఉద్యోగ సంఘాల ఐక్యవేదిక పది రోజుల క్రితమే గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరక్టర్ కార్యాలయంలో నోటీసులు అందజేసింది. కానీ, 23న ఈ శాఖ మంత్రి డోలా బాలవీరాంజనేయలుతో జరిగిన సమావేశంలో పెండింగ్ అంశాలపై ఎలాంటి హామీ ఇవ్వలేదని ఉద్యోగ సంఘ నేతలు చెబుతున్నారు. అలాగే, శుక్రవారం గ్రామ, వార్డు సచివాలయ శాఖ డైరక్టర్ శివప్రసాద్‌తో జరిగిన భేటీలోనూ ప్రభుత్వం మొండివైఖరినే అవలంభించినట్లు ఉద్యోగ సంఘ నేతలు తెలిపారు.
ఉద్యోగుల డిమాండ్లు..
– నోషనల్ ఇంక్రిమెంట్లను ప్రభుత్వం వెంటనే మంజూరుచేసి సచివాలయ ఉద్యోగులను జూనియర్ అసిస్టెంట్ కేడర్‌గా గుర్తించాలి.
– గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల డిప్యూటేషన్లన్నీ రద్దుచేయాలి.
– ఒకే సమయంలో వివిధ శాఖల అధికారులు సచివాలయ ఉద్యోగులకు వేర్వేరు పనులు అప్పగిస్తున్నారు. ఈ మలీ్టబాసిజంవల్ల ఉద్యోగులు తీవ్ర పనిఒత్తిడికి గురవుతున్నారు. ఈ పరిస్థితి లేకుండా సింగిల్ లైన్ డిపార్ట్‌మెంట్ పరిధిలోనే ఉద్యోగులు పనిచేసేలా ఆదేశాలివ్వాలి.
– పని ఒత్తిడివల్ల ఉద్యోగుల మరణాలకు కారణమైన అధికారులపై ఒక కమిటీ వేసి మూడునెలల్లోపు విచారణ చేయాలి. అధికారి నిర్లక్ష్యం లేదా పనిఒత్తిడి కారణమని తేలితే, సంబంధిత అధికారిపై మూడునెలల్లోపే చర్యలు తీసుకోవాలి. ఆయా విచారణ కమిటీల్లో సచివాలయ ఉద్యోగ ప్రతినిధిని కూడా నియమించాలి.
– గ్రామ, వార్డు సచివాలయంలో ప్రతీఒక్క పోస్టుకు ప్రమోషన్ ఛానల్ ఇచ్చే క్రమంలో కనీస బేసిక్ పే రూ.30,000కు తగ్గకుండా చూడాలి.
– జాయింట్ స్టాఫ్ కౌన్సిల్‌లో సచివాలయ ఉద్యోగ సంఘాలకు కూడా ప్రాతినిధ్యం ఇవ్వాలి.. జీఓ–11 రద్దు చేయాలి.
సత్యనారాయణపురం (విజయవాడ సెంట్రల్): రాష్ట్రంలోని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు ఆదివారం (నేడు) విజయవాడలో చేపట్టనున్న ధర్నా, నిరసన ర్యాలీలకు ఎలాంటి అనుమతుల్లేవని, వీటిని అతిక్రమించిన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని డీసీపీ గుణ్ణం రామకృష్ణ తెలిపారు. విజయవాడ సత్యనారాయణపురం పోలీస్‌స్టేషన్‌లో శనివారం ఆయన మీడియాతో మాట్లాడారు. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల సమస్యలపై నిరసన తెలిపేందుకు ఈనెల 27న ఎన్టీఆర్ జిల్లా పోలీస్ కమిషనరేట్ పరిధిలో ధర్నాకు అనుమతులు కోరారని తెలిపారు. అయితే, నగరంలో బీఎన్‌ఎస్‌ఎస్ సెక్షన్–163, పోలీస్ యాక్ట్ సెక్షన్–30 ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో ఉన్నందున శాంతిభద్రతలను దృష్టిలో ఉంచుకుని ఆ కార్యక్రమానికి అనుమతులు నిరాకరించామని ఆయన వెల్లడించారు. వర్షాల కారణంగా నగరంలో వరద ముంపు సవాళ్లు, వినాయక నిమజ్జన కార్యక్రమాలు, ఊరేగింపులు, ట్రాఫిక్ అంతరాయాలు, శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ పనుల్లో పోలీస్ యంత్రాంగం, ఇతర సిబ్బంది తీవ్రంగా నిమగ్నమై ఉన్నారన్నారు. ఈ నేపథ్యంలో ధర్నాకు అనుమతులు నిరాకరించామని డీసీపీ చెప్పారు.


