సైబర్‌ ముఠా కొత్త రూట్‌! | - | Sakshi
Sakshi News home page

సైబర్‌ ముఠా కొత్త రూట్‌!

Sep 27 2026 4:10 AM | Updated on Sep 27 2026 4:10 AM

డిఫాల్టర్లంటూ ఫోన్‌ కాల్స్‌! లోన్‌ల పేరుతో సైబర్‌ నేరగాళ్ల బెదిరింపులు బాధితులతో పాటు బంధువులకూ వేధింపులు పరువు పోతుందనే భయంతో కొందరు డబ్బులు చెల్లింపు ఎన్టీఆర్‌ జిల్లాలో ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్న సైబర్‌ నేరాలు

ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి

జి.కొండూరు: సైబర్‌ నేరగాళ్లు కొత్త మార్గాల్లో సామాన్యులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. బ్యాంకుల్లో రుణాలు తీసుకున్నారంటూ ఫోన్‌ చేసి, వెంటనే డబ్బులు చెల్లించకపోతే డిఫాల్టర్‌గా ప్రకటిస్తామని బెదిరిస్తున్నారు. బాధితులతో పాటు వారి బంధువులు, స్నేహితులకు సైతం ఫోన్‌ చేసి రుణం చెల్లించాలంటూ ఒత్తిడి చేస్తున్నారు. తాము ఎలాంటి రుణం తీసుకోకపోయినా తమ పేరుతో ఫోన్‌లు రావడంతో పలువురు ఆందోళనకు గురవుతున్నారు. పరువు పోతుందనే భయంతో కొందరు నేరగాళ్లు అడిగిన మొత్తాన్ని చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.

యువతిని వేధించిన సైబర్‌ నేరగాళ్లు

ఎన్టీఆర్‌ జిల్లా జి.కొండూరు మండలం చెవుటూరుకు చెందిన ఓ యువతికి రుణం పేరుతో సైబర్‌ నేరగాళ్లు వేధింపులకు పాల్పడ్డారు. ఈ నెల 16వ తేదీ ఆమె బంధువులకు ఫోన్‌ చేసి, యువతి రూ.లక్ష రుణం తీసుకున్నా రని, దానికి వారు ష్యూరిటీగా ఉన్నారని బెదిరించారు. రెండు రోజుల్లో సుమారు 25 మందికి ఫోన్‌లు చేసినట్లు బాధితులు తెలిపారు. అనంతరం యువతికి ఫోన్‌ చేసి రూ.6 వేల రుణానికి వడ్డీతో కలిపి రూ.9 వేలు చెల్లించాలని డిమాండ్‌ చేశారు. దీంతో ఆమె సైబర్‌ క్రైమ్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేశారు. గతంలోనూ ఇలాంటి బెదిరింపులకు భయపడి రూ.15 వేలు చెల్లించినట్లు తెలిపారు.

ష్యూరిటీ పేరుతో

మరో కుటుంబానికి వేధింపులు

మునగపాడుకు చెందిన శాగం రాజశేఖరరెడ్డికి జూలై 22న ఫోన్‌ చేసి, శాగం శ్రీలక్ష్మి అనే మహిళ ఐడీఎఫ్‌సీ బ్యాంకులో రూ.13 వేల రుణం తీసుకున్నారని, తాను ష్యూరిటీగా ఉన్నందున చెల్లించాలని బెదిరించారు. ఈ నెల 21న మరోసారి ఫోన్‌ చేసి రుణం రూ.75 వేలుగా పేర్కొంటూ డబ్బులు చెల్లించాలని ఒత్తిడి చేశారు. అనంతరం రాజశేఖరరెడ్డి తల్లికి కూడా ఫోన్‌ చేశారు. తమకు ఆ రుణంతో సంబంధం లేదని చెప్పడంతో తల్లి, కొడుకును అసభ్య పదజాలంతో దూషించినట్లు బాధితులు తెలిపారు.

వ్యక్తిగత సమాచారమే ఆయుధంగా..

వెబ్‌ లింక్‌లు, ఏపీకే ఫైళ్లు, ఉచిత రీచార్జ్‌లు, బ్యాంకు అప్‌డేట్‌లు, ఈకేవైసీ, పార్ట్‌టైమ్‌ ఉద్యోగాల పేరుతో పంపే లింక్‌ల ద్వారా వ్యక్తిగత సమాచారం సైబర్‌ నేరగాళ్ల చేతికి చేరే అవకాశం ఉంది. ఆ సమాచారంతో పేర్లు, ఫోన్‌ నంబర్లు, చిరునామాలు సేకరించి రుణాల పేరుతో బెదిరింపులకు పాల్పడుతున్నట్లు బాధితులు చెబుతున్నారు. నమ్మించేలా రుణ వివరాలు, బ్యాంకు లావాదేవీలకు సంబంధించినట్లుగా కనిపించే ఎడిట్‌ చేసిన ఆధారాలను కూడా పంపుతున్నట్లు తెలుస్తోంది.

అప్రమత్తతే రక్షణ

ఎన్టీఆర్‌ జిల్లాలో ఇటీవలి కాలంలో వివిధ రకాల సైబర్‌ మోసాలు వెలుగులోకి వస్తున్నాయి. రుణం చెల్లించాలంటూ అనుమానాస్పద ఫోన్‌ వస్తే వెంటనే డబ్బులు చెల్లించకుండా సంబంధిత బ్యాంకును సంప్రదించి వివరాలను నిర్ధారించుకోవాలి. తెలియని లింక్‌లు క్లిక్‌ చేయకూడదు, వ్యక్తిగత బ్యాంకింగ్‌ వివరాలను ఎవరితోనూ పంచుకోకూడదు. బెదిరింపు కాల్స్‌ వస్తే ఆధారాలను భద్రపరచుకుని పోలీసులకు లేదా సైబర్‌ క్రైమ్‌ విభాగానికి ఫిర్యాదు చేయాలి.

సైబర్‌ నేరగాళ్ల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. లోన్లు చెల్లించాలంటూ ఎవరైనా ఫోన్‌లు చేసి బెదిరిస్తే వెంటనే డబ్బులు పంపకుండా సమీపంలోని పోలీసుస్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేయాలి. లేదంటే 1930 హెల్ప్‌లైన్‌కు కాల్‌ చేసి చెప్పాలి. ఉచితంగా డబ్బులు వస్తాయంటూ నమ్మి టాస్క్‌ ఆధారిత మోసాలకు బలికావద్దు. తెలియని వ్యక్తులకు వ్యక్తిగత సమాచారం పంపవద్దు. వాట్సాప్‌, ఇన్‌స్టా, పేస్‌బుక్‌ వంటి సోషల్‌మీడియా యాప్‌లలో వచ్చే లింక్‌లు, ఏపీకే పైళ్లును క్లిక్‌ చేయవద్దు.

–పి.రామచంద్రరావు, ఏసీపీ, మైలవరం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement