ముస్తాబాద పీహెచ్‌సీలో సెంట్రల్‌ టీమ్‌ | - | Sakshi
Sakshi News home page

ముస్తాబాద పీహెచ్‌సీలో సెంట్రల్‌ టీమ్‌

Sep 27 2026 4:10 AM | Updated on Sep 27 2026 4:10 AM

ముస్తాబాద పీహెచ్‌సీలో సెంట్రల్‌ టీమ్‌ ఆటోలో మర్చిపోయిన నగలు అప్పగింత ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సింది గురువులే సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు విడుదల

గన్నవరంరూరల్‌: మండలంలోని ముస్తాబాద ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని శనివారం నేషనల్‌ క్వాలిటీ ఎస్‌ఎస్‌మెంట్‌ సెంట్రల్‌ టీమ్‌ పరిశీలించింది. పీహెచ్‌సీలో వసతి, సౌకర్యాలు, సిబ్బంది నైపుణ్య ప్రమాణాలను చర్చించారు. పరిశుభ్రత, డెలివరీ రూమ్‌ భద్రత, ఫార్మసీ పని తీరును అడిగి తెలుసు కున్నారు. పీహెచ్‌సీ సమగ్ర పని తీరును విశ్లేషించారు. నేషనల్‌ టీమ్‌ ప్రతినిధులు డాక్టర్‌ అబ్దుల్‌ బారి, డాక్టర్‌ ప్రశాంత్‌ పట్వార్‌, జిల్లా క్వాలిటీ టీమ్‌ తరఫున డాక్టర్‌ క్రాంతి సంధ్య, మెడికల్‌ ఆఫీసర్లు డాక్టర్‌ శ్రీహర్ష, డాక్టర్‌ సత్యవతి, ఆయుష్‌ డాక్టర్‌ శ్రీధర్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

చిట్టినగర్‌(విజయవాడపశ్చిమ): ఆటోలో మర్చిపోయిన సుమారు రూ. 5 లక్షల విలువైన బంగారు నగలను తిరిగి యజమానికి అప్పగించిన ఘటన సత్యనారాయణపురంలో చోటు చేసుకుంది. కర్నూలుకు చెందిన ఓ కుటుంబం విజయవాడలో ఓ వివాహానికి హాజరయ్యారు. రైల్వేస్టేషన్‌ వద్ద ఆటో ఎక్కిన సదరు కుటుంబం ఆటో దిగే క్రమంలో నగలు ఉన్న బ్యాగ్‌ను ఆ వాహనంలో మర్చిపోయారు. కొంత సమయం తర్వాత నగల బ్యాగ్‌ కనిపించకపోవడంతో బాధితురాలు సత్యనారాయణపురం పోలీసులను ఆశ్రయించారు. ఆమె నుంచి వివరాలు తెలుసుకున్న సీఐ లక్ష్మీనారాయణ వెంటనే ఎస్‌ఐ సౌజన్యను అప్రమత్తం చేశారు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం ఆటోను గుర్తించే క్రమంలో.. బ్యాగ్‌ను గమనించిన డ్రైవర్‌ పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసుల సమక్షంలో నగలు ఉన్న బ్యాగ్‌ను బాధితులకు అందజేశారు.

కంకిపాడు: విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దే బాధ్యత గురువులదేనని విద్యాశాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరీ జె.శ్యామలరావు అన్నారు. ఈడుపుగల్లు జెడ్పీ పాఠశాల, ఎంపీపీఎస్‌ పాఠశాలలను శనివారం ఆయన సందర్శించారు. విద్యార్థుల ప్రతిభను పరీక్షించారు. పాఠశాలల వసతులను పరిశీలించి, ల్యాబ్‌లను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా శ్యామలరావు మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్‌ ఉపాధ్యాయుల చేతిలో ఉందన్నారు. సన్మార్గంలో నడపాల్సిన గురుతర బాధ్యతను సమర్థంగా నిర్వహించాలని స్పష్టం చేశారు. ప్రతి విద్యార్థిపై ప్రత్యేక దృష్టి సారించి ఉన్నత విలువలు అలవర్చుకునేలా బోధించాలన్నారు. విద్యార్థుల సామర్థ్యాలు, నైపుణ్యాలను పెంపొందించేలా బాధ్యతతో వ్యవహరించాలన్నారు. డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని పరిశీలించారు. పదో తరగతి విద్యార్థులతో కలిసి మిషన్‌ మార్చ్‌ సన్నాహాలపై చర్చించారు. పరీక్షల విభాగం సంచాలకుడు డాక్టర్‌ కేవీ శ్రీనివాసులురెడ్డి, విద్యాశాఖ డైరెక్టర్‌ తమీమ్‌ అన్సారియా, సమగ్ర శిక్ష ఎస్‌పీడీ బి.శ్రీనివాసరావు, ఎస్‌సీఈఆర్‌టీ డైరెక్టర్‌ ఎంవీ కృష్ణారెడ్డి, కాకినాడ ఆర్జేడీ నాగమణి, డీఈఓ యూవీ సుబ్బారావు, ఎంఈఓలు, హెచ్‌ఎంలు పాల్గొన్నారు.

కోనేరుసెంటర్‌: కృష్ణా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించిన వివిధ కోర్సుల రెగ్యులర్‌, సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను కృష్ణా విశ్వవిద్యాలయం వైస్‌చాన్సలర్‌ కూన రాంజీ శనివారం విడుదల చేశారు. బి ఫార్మసీ 2, 4 సెమిస్టర్‌, బీఎడ్‌, స్పెషల్‌ బీఎడ్‌ రెండో సెమిస్టర్‌, బి.పి.డి, డి.పి.డి. 2వ సెమిస్టర్‌, బీటెక్‌ 2, 4వ సెమిస్టర్‌ రెగ్యులర్‌, సప్లిమెంటరీ ఫలితాలను విడుదల చేశారు. విద్యార్థులు తమ ఫలితాలను విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో పరిశీలించుకోవచ్చన్నారు. పునఃమూల్యాంకనానికి అక్టోబరు 12లోపు విశ్వవిద్యాలయం వెబ్‌సైట్‌లో సూచించిన రుసుం చెల్లించి దరఖాస్తు చేసుకోవచ్చని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement