దక్షిణాఫ్రికాలో కాల్పుల కలకలం.. 27 మంది మృతి | 27 dead in two mass shootings in South Africa gunmen open fire at bars | Sakshi
Sakshi News home page

దక్షిణాఫ్రికాలో కాల్పుల కలకలం.. 27 మంది మృతి

Sep 27 2026 1:35 PM | Updated on Sep 27 2026 1:58 PM

27 dead in two mass shootings in South Africa gunmen open fire at bars

జొహన్నెస్‌బర్గ్: దక్షిణాఫ్రికాలో రెండు వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన సామూహిక కాల్పుల ఘటనల్లో 27 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 26 మంది గాయపడ్డారు. శనివారం రాత్రి జొహన్నెస్‌బర్గ్‌కు పశ్చిమాన ఉన్న ఓ బార్‌లో మొదటి ఘటన చోటుచేసుకుంది. ఆదివారం తెల్లవారుజామున కేప్‌టౌన్‌ వెలుపల ఉన్న ఓ టౌన్‌షిప్‌లోని వినోద కేంద్రంలో రెండో ఘటన జరిగింది. జొహన్నెస్‌బర్గ్‌ సమీపంలోని బార్‌పై శనివారం రాత్రి సుమారు 7.30 గంటలకు ఎనిమిది మంది తుపాకులతో దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు. ఈ కాల్పుల్లో 17 మంది మృతి చెందగా, మరో 15 మంది గాయపడ్డారు. మృతుల్లో 13 మంది పురుషులు, నలుగురు మహిళలు ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు.

కాల్పుల అనంతరం దుండగులు అక్కడున్న కొందరిని తనిఖీ చేసి, వారి మొబైల్ ఫోన్లు తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అనంతరం గుర్తుతెలియని రెండు వాహనాల్లో అక్కడి నుంచి పారిపోయారు. నిందితులు వెళ్లే ముందు రెండు వాహనాలకు నిప్పుపెట్టినట్లు పోలీసులు చెప్పారు. ఈ ఘటనకు గల కారణం ఇంకా తెలియరాలేదు.మరోవైపు కేప్‌టౌన్‌ వెలుపల ఉన్న ఓ టౌన్‌షిప్‌లో ఆదివారం తెల్లవారుజామున మరో కాల్పుల ఘటన చోటుచేసుకుంది. ఓ వినోద కేంద్రంలోకి దుండగులు కాల్పులు జరపడంతో 10 మంది మరణించగా, 11 మంది గాయపడ్డారు. ఈ రెండు ఘటనలకు సంబంధించి నిందితులను పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను రంగంలోకి దించినట్లు పోలీసులు తెలిపారు.

దక్షిణాఫ్రికాలో చట్టబద్ధమైన, అక్రమమైన తుపాకుల లభ్యత విస్తృతంగా ఉండటంతో కాల్పుల ఘటనలు తరచూ జరుగుతున్నాయి. వీటిలో అనేక ఘటనలు గ్యాంగ్‌ల మధ్య విభేదాలు, అక్రమ వ్యాపారాలపై ఆధిపత్య పోటీతో ముడిపడి ఉంటాయని అధికారులు చెబుతున్నారు. సుమారు 6.2 కోట్ల జనాభా ఉన్న దక్షిణాఫ్రికాలో రోజుకు సగటున 60 మంది హత్యకు గురవుతున్నట్లు నివేదిక పేర్కొంది. జొహన్నెస్‌బర్గ్‌లో పెరుగుతున్న హింసను అరికట్టేందుకు మార్చిలో నేరాలు ఎక్కువగా జరుగుతున్న ప్రాంతాల్లో పోలీసులకు సహకరించేందుకు సైనికులను కూడా మోహరించారు. 

ఇదీ చదవండి: ‘భారత్‌పై కన్నేస్తే గట్టి జవాబే’..‘మన్‌ కీ బాత్‌’లో ప్రధాని మోదీ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement