ఖాట్మండు: నేపాల్‌లోని హిమ్‌లుంగ్ హిమాల్ పర్వతంపై మంచు చరియలు విరిగిపడ్డాయి. ఇవాళ (ఆదివారం) ఉదయం పర్వతం బేస్ క్యాంప్‌పై భారీగా మంచు విరిగిపడటంతో 10 మంది గల్లంతయినట్లు అధికారులు తెలిపారు. ప్రముఖ యాత్ర నిర్వాహకుడు మింగ్మా గ్యాల్జే షెర్పా మాట్లాడుతూ.. గల్లంతైన వారిలో తన బృందానికి చెందిన ఇద్దరు కిచెన్ సిబ్బంది కూడా ఉన్నారని తెలిపారు.
గత వారం వాతావరణ హెచ్చరికలు జారీ కావడంతో పర్వత వాలుపై ఉన్న పర్వతారోహణ, రోప్ ఫిక్సింగ్ బృందాలు అక్కడి నుంచి సురక్షిత ప్రాంతాలకు తరలిపోయాయి. అయితే కొందరు మాత్రం అక్కడే ఉండిపోయినట్లు షెర్పా వెల్లడించారు. పలురోజులుగా ఈ ప్రాంతంలో భారీగా మంచు కురుస్తుండటంతో పర్వతారోహణ కార్యక్రమాలను కూడా తాత్కాలికంగా నిలిపివేసి అధిరోహకులు వెనుదిరిగారు.
ఆదివారం మంచు చరియల్లో గల్లంతైన వారు వేర్వేరు యాత్రా సంస్థలకు చెందినవారిగా అధికారులు చెబుతున్నారు. 7,126 మీటర్ల ఎత్తైన హిమ్‌లుంగ్ హిమాల్ మనాంగ్ జిల్లాలో ఉంది. టిబెట్ సరిహద్దుకు సమీపంలోని ఈ పర్వతం ఎత్తైన ప్రాంతాల్లో ఉంది. సహాయక చర్యలు చేపట్టడం మరింత క్లిష్టంగా మారింది.
బంగాళాఖాతంలో ఏర్పడిన వాతావరణం ప్రభావంతో నేపాల్‌లోని పర్వత ప్రాంతాల్లో భారీగా మంచు, కొండ ప్రాంతాలు, మైదానాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. శుక్రవారం నుంచి ప్రతికూల వాతావరణ పరిస్థితులు కొనసాగుతుండటంతో రహదారి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కొన్ని మార్గాల్లో ట్రాఫిక్‌ను అధికారులు నిలిపివేశారు. ఈ నేపథ్యంలో ట్రెక్కర్లు, పర్వతారోహకులు తమ కార్యకలాపాలను నిలిపివేయాలని నేపాల్ పర్యాటక శాఖ హెచ్చరికలు జారీ చేసింది
ఇదీ చదవండి: గ్యాస్ లీకేజీతో భారీ పేలుడు.. కుప్పకూలిన భవనం


