చీకటి సొరంగంలో బిక్కుబిక్కుమంటూ గడిచిన క్షణాలు.. బయట ప్రపంచంతో సంబంధాలు తెగిపోయిన వేళ ప్రాణాలపై ఆశలు సన్నగిల్లాయి. అయినా ఎక్కడో ఒక చోట సహాయక బృందాలు తమను చేరుకుంటాయన్న నమ్మకంతో సంజయ్ సాహ్, కబీర్ మహర్జన్ అనే ఇద్దరు కార్మికులు ధైర్యాన్ని కోల్పోలేదు. ప్రార్థనలతో మనసును నిలబెట్టుకుంటూ.. చివరకు ఆ చీకటి నుంచి వెలుగులోకి వచ్చారు.
నేపాల్‌లో వరదల కారణంగా జలవిద్యుత్ ప్రాజెక్టు సొరంగంలో చిక్కుకున్న ఇద్దరు కార్మికులు పది రోజుల తర్వాత ప్రాణాలతో బయటపడ్డారు. త్రిశూలీ 3ఏ జలవిద్యుత్ ప్రాజెక్టులో పనిచేస్తున్న యాంత్రిక విభాగం ఫోర్‌మ్యాన్ సంజయ్ సాహ్, యాంత్రిక పర్యవేక్షకుడు కబీర్ మహర్జన్‌ను సెప్టెంబర్ 4న సహాయక బృందాలు సురక్షితంగా వెలికితీశాయి. తాజాగా, ఓ ఇంటర్వ్యూలో వారు మాట్లాడారు. ఆపదలో చిక్కుకున్న తర్వాత చీకటి సొరంగంలో తొమ్మిది రోజులు గడిపిన సంజయ్.. ప్రార్థనలు చేస్తూ ధైర్యంగా ఉన్నట్లు తెలిపారు.
ఆగస్టు 26న వరదలు ప్రాజెక్టును ముంచెత్తిన సమయంలో సంజయ్ నియంత్రణ గదిలో విధుల్లో ఉన్నారు. సాధారణంగా అక్కడ ఐదారు మంది మాత్రమే ఉండేవారని, ఆ రోజు 40 నుంచి 45 మంది ఉన్నారని ఆయన చెప్పారు. వరదనీరు భూగర్భ ప్రాంతంలోకి ప్రవేశించడంతో కార్మికులను బయటకు పంపేందుకు ప్రయత్నించారు. ఇతరులను రక్షించే క్రమంలో తనకు బయటపడే అవకాశం లేకుండా పోయిందని సంజయ్ వివరించారు.
హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ..
“వారిని రక్షించేందుకు ప్రయత్నిస్తూ అందరినీ పరుగెత్తించాను. దాంతో నాకు సమయం లేకుండా పోయింది. చివరికి నేను బయటకు రాలేకపోయాను” అని సంజయ్ తెలిపారు. సొరంగంలో చిక్కుకున్న సమయంలో హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తూ ఉన్నానని చెప్పారు. ఆ ప్రార్థన తనకు మనోధైర్యాన్ని ఇచ్చిందని వివరించారు.
మరో కార్మికుడు కబీర్ మహర్జన్ కాఠ్మాండుకు చెందినవారు. సాధారణ నిర్వహణ పనుల కోసం కులేఖానీ జలవిద్యుత్ ప్రాజెక్టు నుంచి త్రిశూలీ 3ఏకు వెళ్లారు. ఆయన భార్య హీరా శోభా చివరిసారిగా ఆగస్టు 26 ఉదయం 7.30 గంటల సమయంలో భర్తతో మాట్లాడారు. ఆ తర్వాత ఆయన ఫోన్ పనిచేయలేదు. తొమ్మిది రోజుల పాటు కుటుంబం తీవ్ర ఆందోళనకు గురైంది.
“అతను మరో జీవితం పొంది తిరిగి వచ్చాడు. మేము ఎంతో సంతోషంగా ఉన్నాం” అని హీరా శోభా తెలిపారు. రక్షణ బృందాలు తమ ప్రాణాలను పణంగా పెట్టి తన భర్తను కాపాడాయని ఆమె కృతజ్ఞతలు తెలిపారు. వరదలతో దెబ్బతిన్న నేపాల్‌లో పలు జలవిద్యుత్ ప్రాజెక్టుల వద్ద ఇంకా గాలింపు, సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. త్రిశూలీ-3ఏలో ఇద్దరు కార్మికులు ప్రాణాలతో బయటపడటం, సొరంగాల్లో చిక్కుకున్న మరికొందరిని రక్షించవచ్చన్న ఆశలను పెంచింది.
ఇదీ చదవండి: పండ్ల బుట్టలో దాచిన తుపాకీని తీసి కాల్పులు


