న్యూయార్క్: క్రిస్మస్ వేడుకల అనంతరం నిరుపయోగంగా మారిన క్రిస్మస్ చెట్లను వినూత్నంగా పునర్వినియోగించారు. 2024లో న్యూయార్క్‌లోని జమైకా బే వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలో 250 క్రిస్మస్ చెట్లను దాదాపు 600 అడుగుల పొడవైన సహజ రక్షణ కట్టలుగా (బ్రేక్‌వాటర్స్) మార్చారు. పునరుద్ధరిస్తున్న ఉప్పునీటి చిత్తడి నేల (సాల్ట్ మార్ష్)లో కొత్తగా నాటిన వృక్షసంపదను అలలు, తీర కోత నుంచి కాపాడేందుకు వీటిని వినియోగించినట్లు జమైకా బే-రాక్‌వే పార్క్స్ కన్జర్వెన్సీ 2024 వెట్‌ల్యాండ్స్ ఫెలోషిప్ నివేదిక తెలిపింది.
ఈ రక్షణ కట్టల వెనుక గణనీయంగా మట్టి, ఇసుక వంటి అవక్షేపాలు (సెడిమెంట్) పేరుకుపోయాయి. దీంతో కొన్ని కట్టలు అభివృద్ధి చెందుతున్న చిత్తడి నేలలో పాక్షికంగా కూరుకుపోయినట్లు సంస్థ వెల్లడించింది. ఈ చెట్లను జమైకా బే వన్యప్రాణుల సంరక్షణ కేంద్రంలోని వెస్ట్ పాండ్ లివింగ్ షోర్‌లైన్ ప్రాజెక్టులో ఉపయోగించారు. 2012లో సూపర్‌స్టార్మ్ శాండీ కారణంగా మంచినీటి చెరువులోకి సముద్రపు నీరు ప్రవేశించడంతో అక్కడి పర్యావరణ వ్యవస్థ తీవ్రంగా దెబ్బతింది. గతంలో మంచినీటి జీవావరణానికి అనుకూలంగా ఉన్న ప్రాంతంలో ఉప్పునీరు చేరింది.
2021లో పూర్తయిన పునరుద్ధరణ పనుల్లో సుమారు 2,400 అడుగుల తీరప్రాంతాన్ని పునర్నిర్మించి, తొమ్మిది ఎకరాలకు పైగా కొత్త ఆవాసాన్ని అభివృద్ధి చేశారు. అయితే కొత్తగా పెరుగుతున్న మొక్కలకు అలలు, తీర కోత, మారుతున్న అవక్షేపాల వల్ల ముప్పు ఏర్పడింది. దీంతో క్రిస్మస్ చెట్లను ‘ఫాసిన్స్’గా పిలిచే నిర్మాణాలుగా కట్టి, బలహీనమైన తీర ప్రాంతాల్లో ఏర్పాటు చేశారు. కాంక్రీటు గోడల మాదిరిగా కాకుండా ఇవి అలల వేగాన్ని తగ్గించి, కోతను నియంత్రిస్తూ నీటితో కొట్టుకొచ్చే అవక్షేపాలు అక్కడే పేరుకుపోయేలా చేస్తాయి. కాలక్రమంలో చిత్తడి నేల మరింత బలపడటమే లక్ష్యంగా ఇది సాగింది.
ఈ పద్ధతిలో ఉపయోగించిన చెట్లు జీవఅవక్షేపనీయమైనవి కావడంతో శాశ్వత నిర్మాణాలుగా కాకుండా క్రమంగా ప్రకృతి వ్యవస్థలో కలిసిపోతాయి. గతంలోనూ ఈ ప్రాజెక్టులో క్రిస్మస్ చెట్లతోపాటు గుల్లలతో చేసిన ఆయిస్టర్ షెల్ బ్రేక్‌వాటర్స్, కొయిర్ లాగ్స్ వంటి సహజ రక్షణ పద్ధతులను ఉపయోగించారు. నీటి ప్రవాహాన్ని తగ్గించడం ద్వారా చెట్లు అవక్షేపాలు పేరుకునేలా చేస్తాయి. వాటిపై పెరిగే మార్ష్ మొక్కల వేర్లు ఆ అవక్షేపాలను స్థిరంగా ఉంచి తీరాన్ని క్రమంగా బలోపేతం చేస్తాయి. ఇలా సాధారణ వ్యర్థంగా భావించిన 250 క్రిస్మస్ చెట్లు న్యూయార్క్ తీర రక్షణలో భాగమయ్యాయి.
ఇదీ చదవండి: రాహుల్, ప్రియాంకతో మలేసియా ప్రధాని భేటీ


