ఇండోనేషియాలోని జావా సముద్రంలో 240 మందికి పైగా ప్రయాణికులతో వెళ్తున్న ఓ నౌక గల్లంతు కావడంతో కలకలం రేగుతోంది. నౌకతో సంబంధాలు పూర్తిగా తెగిపోవడంతో అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. ఈ ప్రయాణికుల నౌక (‘విర్గో ట్రాన్స్‌పోర్ట్ 8) తూర్పు జావా ప్రావిన్స్‌లోని సురబయ నుంచి బోర్నియో దీవిలోని దక్షిణ కాలిమంతాన్ ప్రావిన్స్ రాజధాని బంజర్‌మసిన్‌కు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది.
బంజర్‌మసిన్ సెర్చ్ అండ్ రెస్క్యూ కార్యాలయానికి నౌకలో కమ్యూనికేషన్ వ్యవస్థ పనిచేయడం లేదన్న సమాచారం అందింది. నౌక చివరిసారిగా బంజర్‌మసిన్‌లోని ఓ రేవుకు సుమారు 148 కిలోమీటర్లు (92 మైళ్లు) దూరంలో జావా సముద్ర జలాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ప్రస్తుతం ప్రాణనష్టంపై ఎలాంటి సమాచారం లేదు. నౌక కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టారు.
బంజర్‌మసిన్ రెస్క్యూ ఏజెన్సీ ఆపరేషన్స్ చీఫ్ అరియాంటో అర్డీ నౌకతో సంబంధాలు తెగిపోయిన విషయాన్ని ధృవీకరించారు. సహాయక చర్యల కోసం ట్రిసక్తి ప్రాంతంలో ప్రత్యేక ఆపరేషన్స్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. నౌక యాజమాన్యం అందించిన సమాచారం ప్రకారం, ప్రయాణ సమయంలో నౌక ప్రతికూల వాతావరణాన్ని ఎదుర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే నౌకకు ప్రస్తుతం ఏమైందన్నది ఇంకా స్పష్టంగా తెలియరాలేదు.
ఇదీ చదవండి: లాడెన్ హిట్‌లిస్ట్‌లో భారత్.. బయటపడ్డ సంచలన రహస్యాలు


