కరువుకు కేరాఫ్‌.. ఈ వాటర్‌ ‘మ్యాన్‌’ | Andhra Pradesh is facing a severe drought situation under Chandrababu government | Sakshi
Sakshi News home page

కరువుకు కేరాఫ్‌.. ఈ వాటర్‌ ‘మ్యాన్‌’

Sep 9 2026 6:14 AM | Updated on Sep 9 2026 6:14 AM

Andhra Pradesh is facing a severe drought situation under Chandrababu government

కర్నూలు జిల్లా వెల్దుర్తి మండలంలో నీళ్లు లేక ఎండిపోతున్న వేరుశనగ పంట

కుళాయి తిప్పితే నీళ్లు రావు.. పొలాల్లో నీళ్లు పారవు..

సాగర్, శ్రీశైలంలో నీళ్లు లేవు.. ఖరీఫ్‌కు నీరివ్వలేరట 

వరి వేయొద్దని చెబుతారు.. వాటర్‌మ్యాన్‌ ఎట్లా అవుతావు బాబూ..? 

బాబు వస్తే కరువు వస్తుందనేది ముప్పై ఏళ్ల నానుడి 

ఇప్పుడు వచ్చింది మరింత తీవ్ర కరువు 

దాన్ని మరిపించేందుకు చంద్రబాబు వాటర్‌మ్యాన్‌ నాటకం 

5 రోజుల్లో రెండు స్టాండింగ్‌ ఒవేషన్లతో ఎలివేషన్లు.. నేతలతో సన్మానం 

వ్యవసాయం దండగ అనే చంద్రబాబు.. ఇప్పుడు జలహారతులతో మాయలు 

బాబు తీరుతో విస్తుపోతున్న జనం

సాక్షి, అమరావతి: గుక్కెడు తాగు నీటి కోసం రాష్ట్రంలో పల్లెలు అల్లాడుతున్నాయి.. పొలాలకు నీరు లేక పంటలు ఎండిపోతున్నాయి.. నీరు, గడ్డి లేక పశువుల డొక్కలు ఎండుతున్నాయి.. అయినా పట్టించుకోని ముఖ్యమంత్రి చంద్రబాబు.. తనను తాను వాటర్‌మ్యాన్‌ అని కీర్తించుకొంటూ సొంత పార్టీ నేతలతో సన్మానాలు చేయించుకోవడం చూస్తే.. అచ్చం అలనాటి నీరో చక్రవర్తిని తలపిస్తున్నారని రాష్ట్ర ప్రజలు విమర్శిస్తున్నారు. నాడు రోమ్‌ నగరం తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు.. నేడు రాష్ట్రం కరువుతో అల్లాడుతుంటే చంద్రబాబు సత్కారాలు చేయించుకుంటున్నారని మండిపడుతున్నారు. 

వర్షాభావం వల్ల పంటలకు ఈ ఖరీఫ్‌లో నీరు ఇవ్వలేమని, రైతులు వరి పంట వేయవద్దని చెప్పిన చంద్రబాబు.. వాటర్‌మ్యాన్‌ అని తనకు తాను ప్రచారం చేసుకోవడంపై జనం విస్తుపోతున్నారు. ఒక ఆంగ్ల పత్రికలో వాటర్‌మ్యాన్‌ అని ఒక పదం రాయించుకొని, ఆ పత్రిక కీర్తించిందని ఆయన టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన నాయకత్వ సదస్సులో ఆయనే చెప్పుకోవడం.. వెనువెంటనే ఆయన కేబినెట్‌లోని అత్యుత్సాహపు మంత్రి ఒకరు చంద్రబాబును అభినందిస్తూ తీర్మానం ప్రవేశపెట్టడం, నాయకులంతా లేచి నిలబడి స్టాండింగ్‌ ఒవేషన్‌ ఇవ్వడం, ఎల్లో మీడియా వాటిని ఊదరగొట్టడం అంతా ఒక టీవీ స్కిట్‌లా నిర్వహించారు. 

కరువుకు కేరాఫ్‌ అడ్రస్‌ చంద్రబాబు  
చంద్రబాబు, కరువు కవల పిల్లలని ఎప్పుడూ వినిపించే మాట. 30 ఏళ్లుగా ఇది అనేకసార్లు రుజువైంది. ఆయన అధికారంలో ఉన్న ప్రతిసారీ రైతు కళ్లలో నీళ్లే తప్ప పొలంలో నీళ్లు పారవు. 1995–2004 మధ్య వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులను అటకెక్కించారు. విద్యుత్‌ చార్జీలు పెంచి రైతు నడ్డి విరిచారు. అప్పుడూ కరువు వచ్చింది. 1997–98లో రైతు ఆత్మహత్యలు ఉప్పెనలా జరిగాయి. 2004లో వైఎస్‌ రాజశేఖర రెడ్డి సీఎం అయ్యాక రైతుల కుటుంబాలకు పరిహారం ప్రకటిస్తే ఆ ప్యాకేజీ కోసం ఆత్మహత్యలు పెరుగుతున్నాయని వ్యాఖ్యానించి అన్నదాతను అవమానించిన గొప్ప మనిషి చంద్రబాబు. రాష్ట్రం విడిపోయిన తర్వాత 2014–2019లో మళ్లీ ఆయన అధికారంలోకి రాగానే మళ్లీ కరువు వచ్చింది. 

2024లో మళ్లీ చంద్రబాబు అధికారపీఠంపై కూర్చోగానే రాష్ట్రంలో కరువు ఛాయలు మొదలయ్యాయి. రెండేళ్లలో తీవ్ర కరువు వచ్చేసింది. వర్షాకాలంలో వర్షాలే లేవు. అన్ని జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. ప్రాజెక్టుల్లో నీటి మట్టాలు అడుగంటాయి. శ్రీశైలం, నాగార్జునసాగర్‌లలో నీళ్లు లేవు కాబట్టి ఈ ఖరీఫ్‌కు సాగు నీరు ఇవ్వలేమని చంద్రబాబు చేతులెత్తేశారు. కృష్ణా డెల్టాలో వరి సాగుకు చుక్క నీరు వదిలే పరిస్థితి లేదని తేల్చేశారు. పంటలకు నీళ్లు ఇవ్వలేని చంద్రబాబును రైతులు తిట్టిపోస్తున్నారు. నారుమళ్లు వేసిన తాము ఏమవ్వాలని ప్రశి్నస్తున్నారు. 

కరువు మండలాలను ప్రకటించాలని రైతు సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి. జనం నీటి కోసం అల్లాడుతుంటే పట్టించుకోకుండా తనను తాను వాటర్‌మ్యాన్‌గా భజన చేయించుకోవడంపై రైతుల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. పంటలకు నీరు ఇవ్వలేమని చెప్పిన బాబు వాటర్‌మ్యాన్‌ ఎట్లా అవుతారని ప్రశి్నస్తున్నారు. ఇది దగా కాదా? ప్రజలు ఇవి ఏమీ తెలియని పిచి్చవాళ్లని ఆయన అనుకుంటున్నారా అని మేధావులు విశ్లేషిస్తున్నారు.  

పబ్లిసిటీ స్టంట్‌.. 
కరువుకు పర్యాయపదంగా మారిన తనపై ఉన్న ముద్రను చెరిపేసుకోవాలనే ఆతృతలో తాను వాటర్‌మ్యాన్‌ అని రాయించుకుని, డప్పు కొట్టుకుంటున్నారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు ఇప్పుడు జలహారతి పడుతున్నారు. ప్రాజెక్టులను వదిలేసి పర్యాటకం, హైటెక్‌ వెంట పరుగులు తీసిన బాబు ఇప్పుడు పాయకరావుపేటలో నీటికి సాష్టాంగ నమస్కారం చేసి తన పబ్లిసిటీ గేమ్‌ను మరింత రక్తికట్టించారు. తాను చేయని పనులను చేసినట్టు, తాను పట్టించుకోని ప్రాజెక్టులను తానే కట్టినట్టు, తనవల్ల ఆగిన నీళ్లను తానే తెచి్చనట్టు డప్పు కొట్టుకుంటున్నారు. ఆ డప్పుకు పార్టీ నేతలు, ఎల్లో మీడియా కోరస్‌ పలుకుతున్నాయి. 

ప్రజలు పిచ్చివాళ్లు కాదు చంద్రబాబూ 
వాటర్‌మ్యాన్‌ బిరుదుకు గీటురాయి ఒక్కటే. కుళాయి తిప్పితే నీళ్లు రావాలి. కాలువలో నీళ్లు పారాలి. రైతు పొలంలో పంట నిలబడాలి. చంద్రబాబు పాలనలో రాష్ట్రంలో ఇవేమీ ఇంతకు ముందు జరగలేదు.. ఇప్పుడూ  జరగడంలేదు. అనేక గ్రామాల్లో గుక్కెడు తాగు నీరు లేక జనం విలవిల్లాడుతున్నారు. పంటలు సాగు చేయకుండా క్రాప్‌ హాలిడే ప్రకటించే పరిస్థితులు అన్ని చోట్లా కనిపిస్తున్నాయి. కానీ చంద్రబాబు మాత్రం మంత్రివర్గం, పార్టీ సమావేశాల్లో అపర భగీరథుడిగా బిల్డప్‌లు ఇచ్చుకుంటూ స్టాండింగ్‌ ఒవేషన్లు, అభినందన తీర్మానాలు, భజనలు చేయించుకొంటున్నారు. అసలు టీడీపీ ఆఫీసులో నాయకత్వ సదస్సు దేనికి పెట్టారు? నేతల శిక్షణకా, మీకు జేజేలకా? అని జనం ప్రశి్నస్తున్నారు. ఒకవైపు వాటర్‌మ్యాన్‌గా భజన చేయించుకుని వెనువెంటనే అదే సమావేశంలో ఎల్‌నినోపై చర్చించడం చూస్తుంటే ఇదంతా పిచ్చివాళ్ల సదస్సులా ఉందనే సెటైర్లు పేలుతున్నాయి.

ఏం చెప్పినా జనం నమ్ముతారనే భ్రమలో ఉన్నారా? 
తాను ఏం చెప్పినా ప్రజలు నమ్ముతారనే భ్రమలో చంద్రబాబు వాటర్‌మ్యాన్‌ బిరుదును స్వయంగా ప్రకటించుకున్నారు. క్షేత్ర స్థాయి వాస్తవాలు, జనం పడుతున్న బాధలతో సంబంధం లేకుండా ఒక పత్రికలో ఒక పదం రాయించుకుని దాన్నే బిరుదుగా స్వీకరించి తీర్మానం, చప్పట్లు, సన్మానాల ద్వారా తనపై ఉన్న కరువు ముద్రను చెరిపేసుకునేందుకు చంద్రబాబు తాపత్రయపడుతున్నారు. కానీ నారుమడి ఎండిపోయిన రైతులు, ఖాళీ బిందెలతో కిలోమీటర్లు నడిచే మహిళలు, కరువు మండలాల ప్రకటన కోసం ఎదురుచూస్తున్న జనం మాత్రం చంద్రబాబు నాటకాలు చూసి ముక్కున వేలేసుకుంటున్నారు. ఆయన స్కిట్‌లను నమ్మడంలేదు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement