స్కూటీపై వెళుతుండగా ఢీకొన్న అంబులెన్స్
ప్రమాదంలో స్నేహితుడు కూడా కన్నుమూత
తూర్పుగోదావరి జిల్లాలో విషాదం
పెరవలి: పెళ్లయిన 24 గంటలు కూడా గడవకముందే వరుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం తూర్పుగోదావరి జిల్లా, పెరవలి మండలం పిట్టల వేమవరం ప్రాంతంలో తీవ్ర విషాదాన్ని నింపింది. స్కూటీపై స్నేహితుడితో కలిసి వెళ్తుండగా ఎదురుగా వచ్చిన అంబులెన్స్ ఢీకొనడంతో ఇద్దరూ మృతిచెందారు. మంగళవారం సాయంత్రం జరిగిన ఈ ఘటనతో కుటుంబసభ్యులు, బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. పిట్టల వేమవరం గ్రామానికి చెందిన నేలపూడి ప్రదీప్ (24)కు అదే గ్రామానికి చెందిన యువతితో సోమవారం మధ్యాహ్నం వివాహం జరిగింది.
ఈ క్రమంలో అన్నవరప్పాడు సెంటర్‌లో దిగిన స్నేహితుడు హరిదాసు సాయి (21)ను స్కూటీపై ఎక్కించుకుని తీసుకువస్తుండగా ఎదురుగా వస్తున్న అంబులెన్స్ ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు ఎగిరి పక్కనే ఉన్న రాళ్ళగుట్టపై పడ్డారు. స్థానికులు వెంటనే వారిని ఢీకొట్టిన అంబులెన్సులోనే ఆస్పత్రికి తరలించారు. వరుడు అంబులెన్సులో ఎక్కించకముందే మృతిచెందగా, కొన ఊపిరితో స్నేహితుడు తణుకు ప్రభుత్వాస్పత్రిలో ప్రాణాలు కోల్పోయాడు. సింగపూర్‌లో ఉద్యోగం చేస్తున్న ప్రదీప్ పెళ్లికోసం సెలవుపెట్టి నెల రోజుల క్రితమే గ్రామానికి రావడం గమనార్హం.


