ముసుగు తీసేసిన ‘గొడ్డలి’ | Dastagiri creates a stir at Mangalagiri TDP office | Sakshi
Sakshi News home page

ముసుగు తీసేసిన ‘గొడ్డలి’

Sep 9 2026 4:41 AM | Updated on Sep 9 2026 8:08 AM

Dastagiri creates a stir at Mangalagiri TDP office

వెన్నుపోటు పార్టీ అసలు స్వరూపం బట్టబయలు

మంగళగిరి టీడీపీ కార్యాలయం వద్ద దస్తగిరి హల్‌చల్‌

ముఖ్యమంత్రిని కలిసేందుకే వచ్చామని మీడియాకు వెల్లడి

అంటే ఈ గొడ్డలి స్పాన్సర్‌ చేసింది టీడీపీయేనా అంటూ నెటిజన్ల వ్యాఖ్యలు

సాక్షి టాస్క్‌ఫోర్స్‌: మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడు దస్తగిరి భార్యతో సహా మంగళవారం ముఖ్యమంత్రి చంద్ర­బాబు నాయుడును కలుసుకోవడానికి రావడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. మంగళగిరి టీడీపీ కార్యాలయం వద్ద దస్తగిరి మీడియాతో మాట్లా­డుతూ ముఖ్యమంత్రిని కలుసుకోవడానికే వచ్చానని చెప్పాడు. ఒక హంతకుడు ఇలా తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి వచ్చి, ముఖ్యమంత్రిని కలుసుకోబోతున్నానంటూ అక్కడ మీడియాతో మాట్లాడడం చూస్తుంటే వీళ్ల మధ్య సంబంధాలు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థమౌతోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.  ‘‘గొడ్డలిని ఫలానా చోట కొన్నా.. వివేకాను నేనే నరికేశా..’ అంటూ పోలీసులకు చెప్పిన హంతకుడు దస్తగిరి ముఖ్యమంత్రిని ఎందుకు కలుస్తున్నాడు?  ఇన్నాళ్లూ కొనసాగించిన ముసుగును వీళ్లు ఇక తీసేశారా..? వెన్నుపోటు పార్టీయే ఈ గొడ్డలిని స్పాన్సర్‌ చేసినట్లు కనిపిస్తోందన్న వ్యాఖ్యలు నిజమేనా..? ’’ అంటూ సోషల్‌ మీడియాలో పోస్టులు వైరల్‌ అవుతున్నాయి.

సీఎం అపాయింట్‌మెంట్‌ ఇచ్చి ఉంటారా?
ముఖ్యమంత్రి అపాయింట్‌మెంట్‌ అంటే ఆషామాషీ కాదు.. ఎన్నో ప్రొటోకాల్స్‌ ఉంటాయి. అయినా సీఎం అనుమతి ఉంటే కానీ సాధ్యం కాదు. సాక్షాత్తూ నేనే వివేకానందరెడ్డిని హత్య చేశా అని ఒప్పుకున్న వాడిని ముఖ్యమంత్రి ఎలా కలుస్తున్నారు..? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రిని కలవడానికి వచ్చానని, ఏం లేదు.. ఓ వినతిపత్రం ఇవ్వడానికే.. అని దస్తగిరి మీడియాకు చెప్పాడు. ఆ తర్వాత సీఎంను రహస్యంగా కలిశాడన్న వార్తలు కూడా సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేశాయి.

దస్తగిరి వెనకున్నది వెన్నుపోటు పార్టీయే...
వైఎస్‌ వివేకానందరెడ్డి హత్యకు సంబంధించి తెలుగుదేశం పార్టీపై మొదటి నుంచి అందరికీ అనుమానాలున్నాయి. హంతకుడు దస్తగిరికి కార్లు, గన్‌మెన్లు, పర్సనల్‌ సెక్యూరిటీ సిబ్బందిని తెలుగుదేశమే సమకూర్చిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. తెలుగుదేశం దన్నుతోనే దస్తగిరి బహిరంగంగా తిరుగుతున్నాడని, పంచాయితీలు చేస్తున్నాడని.. గన్‌మెన్లతో దౌర్జన్యానికి దిగుతున్నాడని కూడా ఆరోపణలున్నాయి. చంద్రబాబును కలిసేందుకు దస్తగిరి రావడంతో ఇప్పుడు మరింత క్లారిటీ వచ్చిందని, వివేకా హత్య వెనకున్నది ఎవరో స్పష్టమయినట్లయిందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.

అందరికీ ఒకే లాయర్‌
సిద్దార్థ లూథ్రా అంటే మాటలు కాదు.. మనదేశంలో అత్యంత ఖరీదైన లాయర్లలో ఒకరు.. నెలకు, రోజుకు, గంటకు కాదు.. ఆయన నిమిషాలలో ఛార్జ్‌ చేస్తారని న్యాయవర్గాలలో వినిపిస్తుంటుంది. అంత ఖరీదైన లాయర్‌.. చంద్రబాబు కేసులకు ఆయనే లాయర్‌. ఆయనంటే మాజీ ముఖ్యమంత్రి, ఇపుడు ముఖ్యమంత్రి... లూథ్రాను ఆయన భరించగలరు.. కానీ వివేకానందరెడ్డి కుమార్తె సునీతకూ లూథ్రాయే లాయర్‌. ఆమె వేసిన కేసులను లూథ్రాయే వాదిస్తున్నారు. నిర్ఘాంతపోయే నిజమేమిటంటే.. హంతకుడు దస్తగిరికి కూడా సిద్దార్థ లూథ్రాయే లాయర్‌. అదీ వెన్నుపోటు పార్టీ చేస్తున్న రాజకీయం.. తండ్రిని చంపిన హంతకుడు దస్తగిరికి, సునీతకు ఒకే లాయర్‌ అంటే అర్ధం కావడం లేదూ అసలు కుట్ర ఏమిటో...

 

 

బెయిల్‌ రద్దుకు ఎందుకు ప్రయత్నించలేదు?
హత్యచేసిన దస్తగిరి జైలులో ఉండాలి.. కానీ బయటకొచ్చేశాడు. దర్జాగా జనంలో తిరుగుతున్నాడు. పంచాయతీలు చేస్తున్నాడు. దందాలు సాగిస్తున్నాడు.. వసూళ్లు చేస్తున్నాడు.. ఇవన్నీ రోజూ వార్తలుగా వస్తున్నాయి. అయినా వెన్నుపోటు పార్టీ ఆధ్వర్యంలోని కూటమి ప్రభుత్వం ఈ నేరగాడిపై ఈగ వాలనివ్వదు. బెయిల్‌ రద్దు కోసం ఎలాంటి ప్రయత్నమూ చేయరు. దస్తగిరికి యాంటిసిపేటరీ బెయిల్‌ ఇస్తుంటే సునీత అడ్డుకోలేదు.. హంతకుడికి శిక్ష పడాలని వీళ్లు ఏనాడూ కోరలేదు. హత్య చేశానని ఒప్పుకున్న దస్తగిరికి చంద్రబాబు, వివేకానందరెడ్డి కుమార్తె మద్దతుగా నిలబడటం వెనుక మర్మమేంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. దస్తగిరి బెయిల్‌ రద్దు చేయాలని కోర్టులో పిటిషన్‌ పడితే.. వెంటనే సునీత ఇంప్లీడ్‌ అయ్యి.. లూధ్రా వంటి ఖరీదైన న్యాయవాదిని పెట్టి దస్తగిరికి అండగా నిలబడడం గమనార్హం. వివేకానందరెడ్డి హత్య కేసులో ఉన్నవీ లేనివి పోగేసి ఇన్నాళ్లూ అవినాష్‌రెడ్డిపై దుష్ప్రచారం చేయించారని దస్తగిరి, చంద్రబాబు సంబంధాలను బట్టి అర్ధమౌతోందని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement