రమా నందన
యూట్యూబర్ రమా నందన స్పష్టీకరణ
ఆంధ్రప్రదేశ్: కెనడాలో ఉద్యోగాలు ఇప్పిస్తానని, వీసాలు రెన్యూవల్ చేయిస్తామని పలువురి నుంచి నగదు వసూలు చేసి మోసం చేసిన కేసులో యూట్యూబర్ జాగర్లమూడి రమా నందన (నందు) మంగళవారం ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్‌లో విచారణకు హాజరయ్యారు. విచారణలో భాగంగా డెస్టినీ కన్సెల్టెన్సీలో ఆమె పాత్ర, దాన్ని ఏర్పాటు చేసినప్పటి నుంచి జరిగిన లావాదేవీలపై ఆమెను పోలీసులు ప్రశ్నించారు.
ఈ అంశంపై తనకు ఏమీ తెలియదని అంతా తన భర్త మధుకర్ చూసుకుంటారని రమానందన చెప్పారని సీఐ సుబ్రహ్మణ్యం తెలిపారు. దీంతో ఆమె భర్తను కూడా విచారణకు పిలుస్తామని, సరైన సమాధానాలు రానందున ఈ నెల 16న మరోసారి విచారణకు రావాలని రమానందనకు నోటీసు ఇచ్చామని వెల్లడించారు. యూట్యూబ్‌లోని నందూస్ వరల్డ్ చానల్‌ను ఉపయోగించి వాట్సాప్ గ్రూప్ ద్వారా కెనడాలో ఉద్యోగాలు ఇప్పిస్తామని రమా నందన మోసాలకు పాల్పడినట్లు గుర్తించారు.
యూకే గవర్నమెంట్ అధికారిక రికార్డుల మేరకు అన్నే రమా నందన పేరిట నందూస్ కెఫే లిమిటెడ్, నందూస్ కిచెన్ లిమిటెడ్, స్మైల్ హెల్త్‌కేర్ సరీ్వసెస్ లిమిటెడ్ సంస్థలు సృష్టించినట్లు విచారణలో తేల్చారు. ఈ కంపెనీలను వీసా స్పాన్సర్íÙప్స్ చూపించడానికి ఫండ్స్ మళ్లించడానికి వినియోగించారని పోలీసులు అనుమానిస్తున్నారు. వీసాల పొడిగింపు, స్పాన్సర్‌షిప్ సర్టిఫికెట్లు ఇప్పిస్తానని ఒక్కొక్కరి నుంచి రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల వరకు వసూలు చేసినట్లు ఆమెపై ఆరోపణలున్నాయి.
ఇబ్రహీంపట్నంకు చెందిన వ్యక్తి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో రమానందన చేసిన మోసాలు, ఆర్థిక అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ అంశంపై రమా నందన, ఆమె భర్త మధుకర్, మామయ్య మోహనరావులపై కేసు నమోదవ్వగా..మోహనరావును ఇప్పటికే అరెస్ట్ చేశారు.
అద్దంకిలోనూ వసూళ్లు?: ప్రకాశం జిల్లా అద్దంకిలో కూడా ఉద్యోగాల పేరుతో నగదు వసూలు చేసినట్లు రమా నందనపై ఆరోపణలున్నాయి. అద్దంకికి చెందిన ఉప్పలపాటి నవీన్ ఉద్యోగం కోసం రూ.18 లక్షలు ఇచ్చినట్లు నవీన్ తండ్రి శ్రీనివాసరావు తెలిపారు. అక్కడి పోలీసులతో ఇబ్రహీంపట్నం వచ్చిన రమా నందనకు 41ఏ నోటీసులు ఇవ్వబోయారు.
అయితే ఇప్పుడు తాను నోటీసులు తీసుకోనని, మొగల్రాజపురంలో ఉంటున్నానని అక్కడకు వచ్చి ఇస్తే తీసుకుంటానని అడ్రెస్ చెప్పి ఆమె వెళ్లిపోయారు. అంతకు ముందు స్టేషన్‌లోకి రమా నందన వెళ్లే క్రమంలో ఆమె లాయర్లు, విలేకరుల మధ్య వాగ్వాదం జరిగింది. ఓ దశలో విలేకరులు స్టేషన్ ముందు ధర్నాకు దిగేందుకు ప్రయత్నించగా పోలీసులు సర్దిజెప్పి వివాదాన్ని ముగించారు.


