ఖమ్మంలో టోర్నీ జరిగినట్లు సృష్టించిన సర్టిఫికెట్
ఆ సర్టిఫికెట్ ఆధారంగా డీఎస్సీ స్పోర్ట్స్ కోటా ఉద్యోగం
2013లో ఖమ్మంలో జూనియర్ కేటగిరీలో జూడో పోటీల నిర్వహణ
సీనియర్ కేటగిరీలో పతకం సాధించినట్లు నకిలీ సర్టిఫికెట్ సృష్టి!
ఆ సర్టిఫికెట్‌తో తమకు సంబంధం లేదని తేల్చి చెప్పిన జూడో అసోసియేషన్ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి
ఖమ్మం స్పోర్ట్స్: ఆంధ్రప్రదేశ్‌లోని కూటమి ప్రభుత్వం డీఎస్సీ ద్వారా చేపట్టిన ఉపాధ్యాయ నియామకాల్లో అవకతవకలకు సంబంధించి రోజుకో విషయం వెలుగులోకి వస్తోంది. ముఖ్యంగా స్పోర్ట్స్ కోటాలో బయటపడుతున్న అక్రమాలు రాష్ట్రాన్ని కుదిపేస్తున్నాయి. ఈక్రమంలోనే తెలంగాణలోని ఖమ్మం జిల్లా కేంద్రంలో జరగని టోర్నీకి సర్టిఫికెట్ సృష్టించి.. దాని ఆధారంగా ప్రకాశం జిల్లాలో ఓ మహిళ స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సాధించినట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి వివరాలిలా ఉన్నాయి.
2013లో రాష్ట్ర స్థాయి జూడో పోటీలు
ఖమ్మం జిల్లా కేంద్రంలో 2013 అక్టోబర్ 19నుంచి 21వరకు జూనియర్ కేటగిరీలో బాలబాలికల రాష్ట్రస్థాయి జూడో పోటీలు జరిగాయి. కానీ ఇక్కడ సీనియర్ కేటగిరీలో పోటీలు జరిగినట్లు.. అందులో పాల్గొన్న మహిళ ద్వితీయస్థానం దక్కించుకున్నట్లు సర్టిఫికెట్ పుట్టుకొచ్చింది. ఈ సర్టిఫికెట్ ఆధారంగా సదరు మహిళ ఏపీ డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా ద్వారా ఎస్‌జీటీ ఉద్యోగం సాధించినట్లు తెలిసింది.
పోటీలు నిర్వహించిన అసోసియేషన్ బాధ్యుల సంతకాలతో కూడిన సర్టిఫికెట్ సృష్టించినట్లు తెలియడంతో... ఆమెపై చర్యలు తీసుకునేందుకు జిల్లా జూడో అసోసియేషన్ సిద్ధమవుతోంది. అసలు జరగని టోర్నీకి సర్టిఫికెట్ ఎవరు ఇచ్చారనే అంశంపై అసోసియేషన్ పరంగా విచారణ చేపట్టనున్నట్లు అసోసియేషన్ బాధ్యులు తెలిపారు. సదరు మహిళ సంబం«దీకులే ప్రెస్‌లో సర్టిఫికెట్ ముద్రించారా.. లేక అసోసియేషన్‌కు చెందిన ఎవరైనా ఇచ్చారా అన్నది తేలాల్సి ఉంది.
పరిశీలన ఏదీ?
స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగాలు పొందాలంటే క్రీడాకారులు రాణించిన స్థాయిని పరిగణనలోకి తీసుకుంటారు. అయితే, ఉద్యోగాలు ఇచ్చే సమయంలో అసోసియేషన్ బాధ్యులు, అధికారుల సంతకాలు సరిగ్గా ఉన్నాయా లేదా అని పరిశీలించాలి. ఇందుకోసం నియామక బాధ్యులు.. సదరు సర్టిఫికెట్లను క్రీడా సంఘం, జిల్లా స్పోర్ట్స్ అథారిటీలకు పంపించాలి. ఆతర్వాత వారు సర్టిఫికెట్‌ను పరిశీలించి పోటీల నిర్వహణ తేదీ, ఇతర అంశాలన్నీ సరిపోల్చుకున్నాక నిర్ధారిస్తారు. ప్రస్తుతం రెండు రాష్ట్రాల్లో సర్టిఫికెట్ల పరిశీలన నిబంధనలు అమల్లో ఉన్నా ఏపీలో అలా జరగకపోవడం గమనార్హం.
ఆ సర్టిఫికెట్‌తో సంబంధం లేదు
ఆంధ్రప్రదేశ్ డీఎస్సీలో స్పోర్ట్స్ కోటా ద్వారా ఉద్యోగం సాధించిన మహిళకు మా అసోసియేషన్ నుంచి సర్టిఫికెట్ జారీ చేయలేదు. 2013లో ఖమ్మంలో కేవలం జూనియర్ కేటగిరీలోనే పోటీలు జరిగాయి. అలాంటప్పుడు సీనియర్ కేటగిరీలో పోటీలు జరిగినట్లు సర్టిఫికెట్ ఎలా వచ్చిందో తేల్చాలి. సర్టిఫికెట్ల అంశంపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సరైన నిబంధనలు పాటించకపోవడం వల్లే ఇలా జరిగి ఉంటుంది. అక్కడి అధికారులు సదరు క్రీడా సంఘానికి లేదా జిల్లా స్పోర్ట్స్ అథారిటీకి సర్టిఫికెట్లు పంపిస్తే అసలువా, నకిలీవా తేల్చేవాళ్లం. అలాంటివేవీ చేయకుండా నేరం మాపై మోపడం సరికాదు. ఆంధ్రప్రదేశ్‌లో చాలామంది నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు సాధించినట్లు తెలుస్తోంది. – కైలాష్ యాదవ్, జూడో అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి


